కాంగ్రెస్ అడుసులో కామ్రేడ్లు
విశ్లేషణ
బీజేపీ తనకు తానుగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థాయికి చేరుకుంది. ఆనాడు హిందూ మహాసభగా ఆరంభమై, ఆరెస్సెస్ రాజకీయ విభాగంగా రంగ ప్రవేశం చేసి, గాంధీజీ హత్యతో ప్రమేయం ఉన్న సంస్థతో సాన్నిహిత్యం ఆరోపణలు ఎదుర్కొని, ప్రజాభిమానానికి చిరకాలం దూరంగా ఉండిపోయిన జనసంఘ్ ఇవాళ బీజేపీ పేరుతో ఎదిగింది. అలాంటి పార్టీ ఒక ప్రజాస్వామిక శక్తిగా ఆవిర్భవించడానికి నియంతృత్వ వ్యతిరేకత పేరుతో 1977లో సీపీఎం కల్పించిన గౌరవం కొంతవరకైనా కారణం కాదా?
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ(ఎం) కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకోవడం సరైనదా? కాదా? అనే అంశం మీద చర్చ సహజం. పార్టీలో కూడా ఈ అంశం మీద చర్చ జరుగుతున్నదనీ, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇదే అంశం మీద పరస్పరం విభేదించుకుంటున్నారనీ వార్తలు వెలువడు తున్నాయి. అలాగే, మహాసభలో ఒక తీర్మానం ఆమోదించిన తరువాత, బెంగాల్ శాఖ అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం సరైనదేనా, ఇది క్రమశిక్షణా రాహిత్యం కాదా అనే అంశం కూడా ఆ చర్చలోనే భాగంగా మారిందని అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ వామపక్ష కూటమి మధ్య ఎన్నికల ఒప్పందం పట్ల ఈ కూటమి భాగస్వామి సీపీఐ ఎన్నికలకు ముందే తన అసమ్మతిని తెలియచేసిందని వార్త. త్వరలో జరుగనున్న కేంద్ర కమిటీలో ఈ పరిణామాలను చర్చిస్తారని తెలుస్తున్నది.
జలంధర్ తీర్మానం ఏమైంది?
294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల తరువాత, 22 స్థానాలతో సీపీఎం మూడో స్థానంలోకి పడిపోయింది. ఇది వామపక్ష కూటమికి, ముఖ్యంగా సీపీఎం శ్రేణులకు, అభిమానులకు నిరాశా నిస్పృహ లను కలిగించింది. 2014 పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ సొంత బలంతో మెజారిటీ స్థానాలు గెలిచి, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా సాధించలేకపోయింది. సీపీఎం సంఖ్యాబలాన్ని కోల్పోయింది. క్షీణిం చిన తన బలం గురించి అప్పుడే మేధోమథనం జరుపుకుంది కూడా. విశాఖ పట్నంలో మహాసభను ఏర్పాటు చేసి, ఆ పరిణామాలు, పర్యవసానాల మీద ఒక తీర్మానం ఆమోదించింది. 1977 నాటి జలంధర్ మహాసభలో కూడా వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రత్యామ్నాయం కోసం కృషి చేయాలని తీర్మానించింది. కానీ ఆచరణలో ఇన్నేళ్లుగా పార్టీ కార్యాచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటూ, ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్న రీతిలో వివిధ పాలక పక్ష, దోపిడీ వర్గ రాజకీయ పక్షాలతో ఏదో ఒక పేరుతో ఎన్నికల పొత్తులు ఎత్తులు కట్టింది. దాని ఫలితమే (2015 నాటి) ఈ పరిస్థితికి కారణ మని విశాఖపట్నంలో ఆత్మ విమర్శ చేసుకున్నది.
ఆ తీర్మానం చేసిన ఏడాదిలోపునే పార్టీ బెంగాల్ శాఖ అందుకు భిన్నంగా వ్యవహరించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ‘అరాచక,’ ‘అవినీతి’, ‘అహం కార’ పాలనకు గుణపాఠం చెప్పాలన్న పేరుతో, చిరకాల శత్రువు కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహనకు వచ్చింది. ఆ విధంగా సీపీఎం, కాంగ్రెస్ కలసి 2016 అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాయి. కానీ జరిగిందేమిటి? తృణమూల్‌కు 2011 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. సీపీఎం దృష్టిలో అత్యంత అభి వృద్ధి నిరోధక పార్టీ, హిందూమతతత్వ పార్టీ, ప్రజా ప్రయోజనాలకు తీవ్ర ప్రమాదకారి అయిన బీజేపీ 14 శాతం ఓట్లతో గణనీయమైన స్థానాన్ని దక్కించుకుంది. ఇది సీపీఎం పార్టీకి వచ్చిన ఓట్ల శాతానికి కుడిఎడంగానే ఉంది. కాగా కేంద్ర కమిటీ చర్చ జరగబోతుండగా పాత తీర్మానాలు, వాటి ఆచరణ, ఉల్లంఘన, క్రమశిక్షణా రాహిత్యం వంటి అంశాలను ఇక్కడ చర్చిం చబోవడంలేదు. కానీ వామపక్ష ఉద్యమ శ్రేయోభిలాషులు, కమ్యూనిస్టు సోదరులు, ఇతర ప్రజాస్వామ్య లౌకిక భావజాలం కలిగిన మిత్రులు ఆలో చించగలరన్న ఆకాంక్షతో ఒక కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషిగా కొన్ని అంశాలను చర్చిస్తున్నాను.
జనతాపార్టీ పాఠాలు
1977లో జరిగిన జలంధర్ మహాసభ గురించి మరోసారి! ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత జరిగిన సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ సభ ఏర్పాటైంది. పార్టీ కేంద్ర కమిటీ తరఫున నాటి కార్యదర్శి నంబూద్రిపాద్ ఒక ప్రతిపాదన చేశారు– ‘అత్యవసర పరిస్థితి పదఘట్టనల కింద నలిగిన అన్ని పార్టీలతో, శక్తులతో, వ్యక్తులతో కలసి నియంతృత్వ వ్యతిరేక వేదికను నిర్మించి, అభివృద్ధి చేయాలి. ఈ వేదిక పార్లమెంటేతర ఉద్యమాలకు మాత్రమే పరిమితం కాదు’ అని. పుచ్చలపల్లి సుందరయ్య ఆ ప్రతిపాదనతో విభేదించారు. ‘అంటే ఈ నియంతృత్వ వ్యతిరేక వేదిక తరఫున జనసంఘ్ ప్రధాన చోదకశక్తిగా ఉన్న జనతాపార్టీతో ఎన్నికల ఒప్పందాలు, పొత్తులు, తదుపరి పర్యవసానాలు ఉంటాయన్నమాట! అభివృద్ధి నిరోధకత్వాన్ని వ్యతి రేకించే పేరుతో అదే పాలక వర్గ కాంగ్రెస్‌తో కలసి సీపీఐ ఎన్నికలలో పాల్గొంటే దానిని మార్క్సిజానికి తూట్లు పొడిచే రివిజనిజం అని విమర్శించే మనం, ఇప్పుడు నియంతృత్వ వ్యతిరేకత పేరుతో అదే పాలక పార్టీ, పైపెచ్చు మరింత అభివృద్ధి నిరోధకమైన మతతత్వ పార్టీ జనసంఘ్‌తో చేతులు కలప డాన్ని ఏమనాలి?’ అని ప్రశ్నించారు.
మహాసభ ప్రతినిధులంతా ఉలిక్కి పడ్డారు. తరువాత తమలో తాము చర్చించుకున్నారు. చివరికి, ‘ఎన్నికల పొత్తులు, ఉమ్మడి వేదికలు ఏమీ ఉండవు. పరస్పర పోటీ నివారణే ఉంటుంది’ అని మొత్తం మీద ఆ అంశంపై మహాసభ మరింత వేడెక్క కుండానే చర్చ ముగిసింది. తదుపరి పరస్పర పోటీ నివారణ, ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ జనతాపార్టీకీ, సీపీఎంకీ మధ్య పొత్తులాగే ‘త్వమేవాహం’ తీరులో ఆచరణ కనిపించింది. అయినా సుందరయ్య మాత్రం తాను సీపీఎం వేదికలపై తప్ప ఉమ్మడి వేదికలపై ప్రసంగించేందుకు అంగీకరించలేదు. ‘రజాకార్లతో, కేంద్ర సైన్యంతో చేతులు కలిపిన వారితో, జనతాపార్టీ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఈ రోజున వారితో ఎన్నికల పొత్తు పేరుతో కలిస్తే ప్రజలు ఏమనుకుంటారు. మీకు ఓట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు కాదు. నేను రాను’ అని ఎలాంటి శషభిషలు లేకుండానే తిరస్కరించారు.
ఆ ఎన్నికలలో జనతాపార్టీ గెలిచింది. నిజమే. ఆ పార్టీలో మొరార్జీ దేశాయ్‌లూ, చరణ్‌సింగ్‌లూ, రాజ్‌నారాయణ్‌లూ ఉన్నారు. కానీ, ఆఖరికి పార్టీ రూపకర్త లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సహా– అందులో వీరంద రికి ఉన్న బలం ఎంత? బీజేపీకి ముందు రూపమైన జనసంఘ్‌కు దేశ వ్యాప్తంగా అండగా, నిర్దేశిత శక్తిగా ఉన్న హిందూ మతతత్వ ఆరెస్సెస్ కార్య కర్తలే ఆ పార్టీకి బలమైన నిర్మాణ వ్యవస్థగా ఉన్నారు. సంఖ్యాపరంగానే కాదు, నిర్మాణపరంగా కూడా వారే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే జనతాపార్టీకి వెన్నెముక భారతీయ జనసంఘ్. అధికారంలో ఉంటూ ఉనికి, నిర్మాణ వ్యూహం, రాజకీయం, భావజాలాల రీత్యా తన ప్రాబల్యాన్ని బలంగా విస్త రించడానికి 1977లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నది. ఇక్కడే ఇంకొక విషయం ప్రస్తావించుకోవాలి. తొలి పార్లమెంటులో ప్రథమ ప్రధాని నెహ్రూ. తొలి విపక్ష నేత సుందరయ్యగారే. కానీ నేడు బీజేపీ తనకు తానుగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థాయికి చేరుకుంది. ఆ పార్టీ, ఆ ప్రభుత్వం అలాగే నిలిచి ఉంటాయా అన్న ప్రశ్నను అటుంచుదాం! ఆనాడు హిందూ మహాసభగా ఆరంభమయి, ఆరెస్సెస్ రాజకీయ విభాగంగా రంగ ప్రవేశం చేసి, గాంధీజీ హత్యతో ప్రమేయం ఉన్న సంస్థతో సాన్నిహిత్యం ఆరో పణలు ఎదుర్కొని, ప్రజాభిమానానికి చిరకాలం దూరంగా ఉండిపోయిన జనసంఘ్ ఇవాళ బీజేపీ పేరుతో ఎదిగింది. అలాంటి పార్టీ ఒక ప్రజాస్వామిక శక్తిగా ఆవిర్భవించడానికి నియంతృత్వ వ్యతిరేకత పేరుతో 1977లో సీపీఎం కల్పించిన గౌరవం కొంతవరకైనా కారణం కాదా?
కింకర్తవ్యం?
నియంతృత్వానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా పోరాడవలసిందే. సీపీఎం చేసింది అదే కూడా. కానీ ఆ ఎన్నికలలో జనతాతో పొత్తు వల్ల సీపీఎంకు ప్రయోజనం ఏమీ లేదు. బెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో అప్పుడు జనతా, జనసంఘ్ లేవు. అయితే సీపీఎంకు ప్రయోజనం లేకపోయినా, జనతా పార్టీలో అంతర్లీనంగా ఉన్న బీజేపీకి ఆ పొత్తు వల్ల నైతిక బలం సమకూరింది. ఇప్పుడు ప్రశ్నించుకుందాం! సుందరయ్యగారు చెప్పినట్టే, 1977 నాటి చర్య ఈ సమాజం పురోగమించేందుకు తోడ్పడిందా? ఇంకో ప్రశ్న– అధికారంలో ఉండి, అభివృద్ధి నిరోధకత్వం కలవారి కొమ్ము కాయడం కాషాయీకరణకు బలం చేకూర్చేందుకు తోడ్పడలేదా? మళ్లీ బెంగాల్ ఫలితాల దగ్గరకు వద్దాం. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉండకపోతే కాంగ్రెస్–వామపక్ష కూటమికి బదులు శాసనసభలో బీజేపీ ద్వితీయ స్థానంలో ఉండేది అని ఆ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి అంటున్నారు. అదే నిజమైతే వామపక్ష కూటమి, ప్రజాస్వామ్య పురోగామి లౌకికశక్తుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో! కానీ బెంగాల్ శాఖ కార్యదర్శి అభిప్రాయం గమనించదగినదే. అయినా బెంగాల్ వాస్తవిక పరిస్థితి అక్కడి పార్టీ కమిటీ కంటే అన్యులకే బాగా తెలుసునని భావించగలమా? అదలా ఉంచుదాం!
అదే మహాసభలో సుందరయ్య పార్టీ నిబంధనావళికి ఒక సవరణ ప్రతిపాదించారు. ‘వివిధ జాతుల సమాహారంగా, విభిన్న రాజకీయ పరిస్థితులు ఉన్న మన దేశంలో రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఆయా రాష్ట్రాల కమిటీలకే ఉంచాలని, కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరుతో రాష్ట్రాల మీద వారికి సమ్మతం కాని నిర్ణయాలు కేంద్ర పార్టీ రుద్దరాదన్నదే ఆ సవరణ. కాబట్టి ప్రస్తుత పరిస్థితు లలో బెంగాల్ కమిటీ నిర్ణయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం సమంజసం కాదా? (ఆనాడు సుందరయ్య సవరణ వీగి పోయింది. అది వేరే సంగతి)
చివరిగా ఎన్నికలు, పొత్తులు, ఎత్తులు; పార్లమెంటరీయేతర పోరా టాలు, సాయుధ ప్రతిఘటన ఇలాంటి అంశాలు ఆయా భౌతిక, వాస్తవిక రాజకీయ పరిస్థితిపై ఆధారపడి ఉండాలి. మార్క్స్ నిర్దేశించినట్టు ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో శక్తి కొలది పనిచేసి తన కనీస జీవనావసరాలు తీర్చగలిగే∙వ్యవస్థను సాధించే దిశగా సాగే సమాజ గమనమే ఆశయం. అది జపంతో వచ్చేది కాదు. ఆ దిశగా ప్రజా చైతన్యాన్ని ఎంతో కొంత పెంచగలిగామా, కనీసం మరింత అభివృద్ధి నిరోధక దశకు, అంధకారంలోకి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేశామా అన్నదే కమ్యూనిస్టుకు గీటురాయి. నిరంతర చర్చలు, వాదోపవాదాలు, చీలికలు ప్రజలను నిరాశలోకి నెట్టివేస్తాయి. జరిగిందేదో జరిగింది. ఇక ఆత్మ విశ్వాసం నింపగల కార్యాచరణతో ప్రజలలో తమపై తమకు విశ్వాసం కల్పించాలి. కమ్యూనిస్టుల కర్తవ్యం అదే.
వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు ‘ 9848069720
డా. ఎ.పి. విఠల్