నా హృదయం రక్తమోడుతోంది: ప్రధాని
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల తీరుపై ప్రధాని ఆవేదన
న్యూఢిల్లీ: లోక్‌సభలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు లోక్‌సభలో గందరగోళం సృష్టించడంపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అంత అనుభవమున్న ఎంపీలు.. అందునా సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు పార్లమెంటులో యుద్ధవాతావరణం సృష్టించడం చూసి తన గుండె గాయపడిందని, ఇలాంటి దృశ్యాలు లోక్‌సభలో చూడాల్సి రావడం తన దురదృష్టమని అన్నారు. ‘‘సభలో జరుగుతున్నది చూస్తుంటే నా హృదయం రక్తమోడుతోంది’’ అని ఆయన తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సభ వెల్‌లోకి వెళ్లి అడ్డుకోవడానికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రైల్వే మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపేయాల్సి వచ్చింది. ఈ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్.. పలువురు ఎంపీలతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. శాంతంగా ఉండాలంటూ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎవరూ వినలేదంటూ ఆవేదన చెందారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచివికావన్నారు.
దురదృష్టకరం: కమల్‌నాథ్
లోక్‌సభలో సీమాంధ్రకు చెందిన మంత్రుల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కూడా తప్పుబట్టారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. సభను అడ్డుకుంటున్నారు.. గందరగోళం సృష్టిస్తున్నారు.. సభా నియమాలను అన్ని విధాలా ఉల్లంఘిస్తున్నారు. భవిష్యత్ లోక్‌సభలకు ఇది అపశకునం’’ అని ఆయన పార్లమెంటు బయట విలేకరులతో వ్యాఖ్యానించారు. సభ ఏ ఒక్క వర్గానికో చెందినది కాదని, సభ్యులందరికీ చెందినదని, దాని మర్యాదను కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని అన్నారు.
అంత తొందరేమొచ్చింది: పల్లంరాజు
ప్రధాని వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి పల్లంరాజు విభేదించారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలన్న తొందర ఎందుకని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు బడ్జెట్‌ను అడ్డుకోవడాన్ని ఆయన సమర్థించారు. ‘‘సభలో ఈ రోజు జరిగిన సంఘటనను ఒక్కదాన్నీ వేరుగా చూస్తూ (ప్రధాని) వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. 15వ లోక్‌సభలో చాలాసార్లు ఇలా సభను స్తంభింపజేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి’’ అని అన్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న బిల్లులో చాలా లోపాలున్నాయి. అది ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఆ బిల్లు ఆమోదం పొందితే.. కోస్తాంధ్ర, రాయలసీమ తీవ్రంగా నష్టపోతాయి’’ అని చెప్పారు.