మన్మోహన్‌సింగ్ ఇచ్చిన ఆరు హామీలు
తెలంగాణ బిల్లు, అవశేషాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీపై నాటి ప్రధానమంత్రి మన్మోహన్ న్‌సింగ్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన సారాంశం ఇది.(2014 ఫిబ్రవరి 20న ఈ ప్రకటనను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసింది)
మిస్టర్ చైర్మన్ సర్,
ప్రతిపక్ష నాయకుడు, ఇతర సభ్యులు.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను చాలా సుదీర్ఘంగా, జాగ్రత్తగా విన్నాను. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు.. ప్రత్యేకించి సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం తీసుకోనున్న నిర్దిష్ట చర్యలను ఇప్పటికే హోం శాఖ మంత్రి చెప్పారు. దీనికి సంబంధించి నేను మరికొన్ని ప్రకటనలు చేయాలనుకుంటున్నాను.
⇒కేంద్ర సాయానికి సంబంధించిన ప్రయోజనాలది మొదటి ప్రకటన. రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు సహ 13 జిల్లాలతో తరించబోయే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా... వచ్చే ఐదేళ్ల కాలానికి వర్తిస్తుందని ప్రకటిస్తున్నాను. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పటిష్ఠంగా ఉంచుతుంది.
⇒ అవతరించబోయే రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహకాలతో సహా అవసరమైన ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని బిల్లులో ఇప్పటికే పేర్కొన్నాం. తత్ఫలితంగా ఉభయ రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధికి ఇవి తోడ్పడతాయి.
⇒ఈ బిల్లు ఆమోదం తరువాత అవతరించే ఆంధ్రప్రదేశ్ (రాయలసీమ, ఉత్తరాంధ్రలతో కూడిన) రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి పథకం వర్తిస్తుందని బిల్లులో ఇప్పటికే పొందుపరిచాం. ఒడిశాలోని కే–బీ–కే (కోరాపుట్–బోలాంఘిర్–కలహండి) ప్రత్యేక ప్రణాళిక (స్పెషల్ ప్లాన్), మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రత్యేక పథకం, ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక అభివృద్ధి పథకం తరహాలోనే ఈ పథకమూ ఉంటుంది.
⇒పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి పునరుద్ధరణ, పునరావాసం సజావుగా జరిగేందుకు అవసరమైన సవరణలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరగా వాటిని ఆచరణలో పెట్టేందుకు చర్యలు చేపడతామని హామీ ఇస్తున్నాను.
⇒ ఉద్యోగులు, నిధులు (ఫైనాన్స్), ఆస్తులు, అప్పుల విభజన వంటివి సంతృప్తికరంగా పూర్తిచేసేలా ముందస్తు చర్యలు తీసుకొని నూతన రాష్ట్ర అవతరణ తేదీని ఖరారు చేయడం జరుగుతుంది.
⇒ అవశేషాంధ్రప్రదేశ్‌లో మొదటి ఏడాది, ప్రత్యేకించి అవతరణ తేదీకి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించడానికి మధ్య కాలంలో ఎదురయ్యే ఆర్థిక లోటును 2014–15 కేంద్ర బడ్జెట్‌లో భర్తీ చేయడం జరుగుతుంది.
సర్, నేను చేసిన ఈ అదనపు ప్రకటనలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆతృతే కాకుండా సీమాంధ్ర నిరంతర శ్రేయస్సు, సంక్షేమం పట్ల మాకున్న అంకితభావాన్ని వెల్లడిస్తున్నదని ఆశిస్తున్నాను.