అంతా అయోమయం, గందరగోళం...
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు విషయంలో అంతా అయోమయం, గందరగోళం కనిపిస్తోంది. తెలంగాణ బిల్లుపై స్పష్టత కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంటే....విచిత్రంగా ప్రభుత్వంలో విభేదాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వేసిన ప్రతీ అడుగులోనూ తడబాటే. అఖరికి బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టాలో... రాజ్యసభలో ప్రవేశపెట్టాలో కూడా ప్రభుత్వ పెద్దలు నిర్దిష్టంగా తేల్చుకోలేకపోయారు.
ఇవాళ ప్రవేశపెడుతున్నామని... కాదు రేపని... నాన్చివేత సర్కారులో స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు... ఆర్థిక బిల్లా లేక సాధారణ బిల్లా అనేదాంట్లోనూ సందిగ్థత చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ద్రవ్యబిల్లుగా భావించిన ఉపరాష్ట్రపతి... హమీద్ అన్సారీ... రాష్ట్రపతి ఆమోదించిన దానికి అడ్డు చెప్పారు.
దీంతో రాజ్యసభ ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వ పెద్దల పథకం బెడిసి కొట్టింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు లోక్‌సభ ద్వారం తడుతోంది. బిల్లు విషయంలో పట్టుదలకు పోతున్న కాంగ్రెస్ సొంత ఎంపీలను అదుపు చేయలేక... బిల్లును గట్టెక్కించాలని విపక్షాన్ని బతిమాలుతోంది. మొత్తానికి 'టీ'పై యూపీఏ ప్రభుత్వం ప్రతీ విషయంలోనూ ముందు వెనక ఊగిసలాట అవుతునే ఉంది.