ఐడియా ప్లీజ్‌? | Sree Ramana Wrote A Story On AP Politics | Sakshi

Jul 7 2018 2:15 AM | Updated on Aug 15 2018 2:40 PM

Sree Ramana Wrote A Story On AP Politics - Sakshi

రెండు రోజుల క్రితం అమరావతి ప్రాంతం నించి ఓ మధ్యరకం నేత ఫోన్‌ చేశాడు. ‘ఏమన్నా కొత్త ఆలోచనలుంటే చెప్పండి. అసలేమీ తట్టడం లేదు’ అంటే నాకేమీ అర్థం కాలేదు. అదే చెప్పాను. ‘ఏముందండీ, మొన్నటిదాకా మమ్మల్ని గెలిపించడం చారిత్రక అవసరమని అన్ని సభల్లో చెప్పాం. భయపెట్టాం, బతి మాలాం. ఔనా కాదా తమ్ముళ్లూ అని సందేహం తీర్చుకున్నాం. పెద్దగా స్పందనల్లేవు. ఎక్కడా పట్టు దొరకడం లేదు. మా నాయకుడికి కాస్త పట్టు చిక్కితే చాలు, దున్ని వదుల్తాడు’ అన్నాడాయన ఫోన్లో. మీరొకసారి రాకూడదూ, ఎదురుపడి మాట్లాడుకుందాం అన్నాను. ఆయన నవ్వి, మీరు పునాదులు కదిలిస్తున్నారు. చంద్రబాబు అంటే టెక్నాలజీ. అట్లాగే తిరగేసినా టెక్నాలజీ అంటే ఆయనే.

విషయాలు మాట్లాడుకోవడానికి గుమ్మా ల్లోకి వెళ్లడమా... ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా?’ అన్నాడు. ఆ తర్వాత చెప్పండని ముందుకు తోలాడు. ‘ఇప్పుడు మోదీ అనాదిగా చేసిన, చేస్తున్న పలు మోసాల్ని తనదైన తీరులో బయటపెడుతున్నారు కదా, అవేమీ పండడం లేదా’ అని అడిగాను. అబ్బే! ఏ మాత్రం అంతు పట్టడం లేదండీ. మొసలి మొహం చూసి దాని ఎక్స్‌ప్రెషన్స్‌ చెప్పడం చాలా కష్టమండీ. మనకి పి.వి. కూర్మావతారం టైపండి. లోపలి సంగతి అంతుపట్టదండీ. తర్వాత మన్మోహన్‌ సింగ్‌ నవ్వుతున్నారో గంభీర ముద్రలో ఉన్నారో లేక మాట్లాడుతున్నారో అంతుబట్టకుండా పదేళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఇదిగో తరువాత మోదీ గద్దెక్కారు. అసలు మా నాయకుడే పర మముదురు. అరటి చెట్టుకి ఆరు  గెలలేయిస్తానని రైతుల్ని నమ్మించగలడు. మరి ఆయనే మోదీని పసిగట్టలేకపోయాడు’ అంటూ ఫోన్లోనే గాఢంగా నిట్టూర్చాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు.

‘ఏం ఈసారి మీకేవన్నా డౌటా’ అని అడి గాను. ఆయన నవ్వి ‘భలేవారే, మాకు కింద టిసారే డౌటు. ఎట్టాగో బయటపడ్డాం. నాలుగేళ్లు టైముంది కదా అనుకున్నాం. సీజన్‌ ఇట్టే తిరిగొ చ్చింది. ఓ చిత్రం గమనించారా. మనం పవర్‌లో ఉంటే కాలచక్రం యమ స్పీడుగా తిరుగుతుంది. మనం అపోజీషన్‌లో ఉంటే చక్రం ఎంతకీ కదిలి చావదు’ అని పెద్దగా నవ్వాడు. ఇంతకీ ఏమన్నా చెబుతారా అని సూటిగా అడిగాడు. విశాఖ రైల్వే జోను, కడప ఉక్కు ఉన్నాయి కదా అన్నాను. ప్చ్‌... అవి చాలవులెండి. మనకి పట్టు దొరకాల. కనీసం పోలవరం సగంపైగానన్నా తేల్తుందను కుంటే అదీ తేల్లేదు. విశ్వవిఖ్యాత క్యాపిటల్‌ ఎండ మావి అని తేలిపోయింది. దాని కోసం లక్ష ఎక రాల మాగాణి భూమిని ఎడారి చేసి పెట్టారు. కల లుగన్న విద్యాలయాలు రానే లేదు. నా మాట లకేంగానీ, మీరు కాస్త యోచన చెయ్యండి’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

కాసేపటికి తేరుకున్నాను. ప్రతివాళ్లూ ఎన్ని కలెప్పుడు వచ్చినా సిద్ధమేనని పై మాటలు మాట్లాడుకున్నారుగానీ అంత వీజీగా నెగ్గలేమని అందరికీ తెలుసు. ఓట్లు సొంత పంటలు తక్కు వగానే ఉంటాయి. అందరూ కొనుగోళ్లమీదే ఆధా రపడాలి. డబ్బులు దండిగా ఉన్నా, వాటిని చెలా మణీలోకి తెచ్చి జనంమీదికి వదలడం కూడా ఈసారి పెద్ద సమస్యే. ఇప్పటికి అయిదు బల మైన శక్తులు కనిపిస్తున్నాయి. తీరా ముఖస్తానికి వచ్చేసరికి పంచ పాండవులు మంచముకోళ్లవలె మూడై.. చివరకు ఎన్నిగా మిగుల్తాయో ఎవరెవరు కలిసిపోతారో తెలియదు. చంద్రబాబు నిరుద్యోగ యువతకి నెలనెలా ఓ వెయ్యి భృతి ఇచ్చే పాత వాగ్దానానికి పదును పెడుతున్నారు. అది ఓ కొలిక్కి వచ్చేసరికి పెట్రోలు ధర వంద అవు తుంది. ఇలాంటివేవీ చంద్రబాబుని పంటగడికి చేర్పించలేవు. మైకులు పగిలేట్టు మోదీని తిడితే టీడీపీకి లబ్ధి వనగూరుతుందా? జగన్‌మోహన్‌ రెడ్డికి అనుకూలంగా వీస్తున్న పవనాలను ఛేదించగలరా? పవన్‌కల్యాణ్‌తో పొంచివున్న ప్రమాదాన్ని నివారించుకోగలరా? ఆలోచించాలి. ఏదైనా ఐడియా తడితే అమరావతికి ఫోన్‌ చెయ్యాలి. ఇదే నా దీక్ష!

శ్రీరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement