
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 'వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అని చంద్రబాబునాయుడు తన అధికారిక ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. జన్మదిన శుభకాంక్షలు తెలుపుతూ.. చంద్రబాబు చేసిన ట్వీట్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్‌లో స్పందించారు. 'ప్లజెంట్ సర్‌ప్రైజ్ అండి. థ్యాంక్యూ' అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను జనం మధ్యలో జరుపుకొన్నారు. అనంతపురం జల్లా నల్లమడకు భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. భారీ కేక్‌ను తెప్పించి వైఎస్ జగన్‌తో కట్ చేయించారు. ఈ సందర్భంగా నల్లమడలో ఆయన బస చేసిన శిబిరం వద్ద పండుగ వాతావరణం కనిపించింది. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. ఇటు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.