ట్రాక్టర్లను నడుపుతున్న స్పీకర్ మధుసూదనాచారి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సాక్షి, పరకాల: వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరందించి, రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పరకాల పట్టణంలోని జీఎంఆర్ గార్డెన్‌లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం కిసాన్ మేళా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై 50 మంది రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన ప్రాంతం తెలంగాణ రాష్ట్రమన్నారు.
కేసీఆర్ పరిపాలన రైతులకు స్వర్ణయుగమని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దపీట వేశారని కొనియాడారు. రుణాల కోసం ఎదురుచూడకుండా ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు పెట్టుబడి అందించడం చారిత్రకమైందని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ బొల్లె భిక్షపతి, వరంగల్ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ కొంపెల్లి ధర్మారాజు, పరకాల, ఆత్మకూరు ఎంపీపీలు నేతాని సులోచన, మల్లికార్జున్, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, పరకాల ఏడీఏ విద్యాసాగర్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, మండలంలోని వ్యవసాయా విస్తీర్ణ అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment