ముడుపులిస్తేనే ట్రాక్టర్
-
సబ్సిడీ ట్రాక్టర్లకు పైరవీల జోరు
-
బినామీ పేర్లతో దరఖాస్తులు
-
అధికార పార్టీ నాయకులకే అందలం
రఘునాథపల్లి: అన్నదాతల వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వం రాయితీగా ఇస్తున్న ట్రాక్టర్ల మంజూరు కోసం ప్రతిపాదనల దశలోనే పైరవీల జోరు కొనసాగుతోంది. రైతులకు సాగులో తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల ట్రాక్టర్‌ను ఎస్సీ, ఎస్టీలకు కేవలం రూ.50 వేలకే అందించనుంది. ఈ సారి ఎస్సీ ఎస్టీలకు 95 శాతం సబ్సిడీ పెంచడంతో తీవ్ర పోటీ నెలకొంది. రఘునాథపల్లి మండలానికి ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలకు ఆరు ట్రాక్టర్లు కేటాయించగా వీటిని పొందేందుకు 36 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
ఈ దరఖాస్తులను ఎంపీపీ, ఏఓ, తహసీల్దార్, ఎంపీడీఓ సభ్యులుగా ఉన్న కమిటీ పరిశీలించి ఎంపిక చేయాల్సి ఉంది. కానీ ఇవేమీ కాకముందే సబ్సిడీ ట్రాక్టర్లు పొందేందుకు బేరసారాలు సాగుతున్నాయి. అయితే గ్రూపులకు మొదటి ప్రాధాన్యం ఉండటంతో కొందరు బినామీ పేర్ల సబ్సిడీ ట్రాక్టర్లు పొందేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నారు. మేకలగట్టు శివారు ఆంధ్రతండాకు చెందిన ఒకరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు మహిళా గ్రూపులో సభ్యురాలిగా ఉన్న తన భార్య పేరుపై మరో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ గ్రూపుకు ఇచ్చే నజరాన విషయంలో తేడా రావడంతో సదరు గ్రూపు సభ్యులు ఆ దరఖాస్తును తొలగించాలని స్థానిక ఏఓకు ఫిర్యాదు చేసి దానిని తొలగించారు. ఇలా మరికొన్ని బినామీ దరఖాస్తులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ నాయకులకే..
మండలానికి ఇప్పటికే రెండు విడతలలో ఆరు ట్రాక్టర్లు మంజూరు కాగా వాటిని అధికార పార్టీ నాయకులే దక్కించుకున్నారు. ఇప్పుడు మూడో విడతలోనూ అధికార పార్టీ నాయకులే దక్కించుకునేందుకు మంత్రాంగం నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ సారి సబ్సిడీ పెంచడంతో ట్రాక్టర్ల మంజూరికి ఓ అధికార పార్టీ నాయకుడు ముడుపుల స్వీకారానికి తెరలేపాడు. ముందే లక్షా 50 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు మండలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. భూమిని నమ్ముకొని, సేద్యం చేస్తున్న రైతులను కాదని ముడుపులు ఇచ్చిన వారికే ట్రాక్టర్లు మంజూరు చేసేలా అధికార పార్టీ నాయకుడి వ్యవహారంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అర్హులకు ట్రాక్టర్లు మంజూరి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని «రైతులు కోరుతున్నారు.
కమిటీ ఆమోదంతోనే సబ్సిడీ ట్రాక్టర్లు
ఏఓ హుమేరా నౌసిన్
సబ్సిడీ ట్రాక్లర్ల కోసం 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. తనతో పాటు ఎంపీపీ, ఎంపీడీఓ, తహసీల్దార్ సభ్యులుగా ఉన్న కమిటీ పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాం. దరఖాస్తుల్లో అనర్హులు ఉంటే సమాచారం అందిస్తే వెంటనే తొలగిస్తాం. సబ్సిడీ ట్రాక్లర్ల కోసంఎవరూ దళారులను ఆశ్రయించవద్దు.