సాక్షి, హైదరాబాద్ : దేశంలో అవసరానికి మించి భారీగా మొక్కజొన్న నిల్వలు ఉన్నాయని... యాసంగిలో మక్కలు సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరించారు. మక్కల సాగు, నిల్వలకు సంబంధించి ప్రస్తుతం దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా యని, రాష్ట్రంలో రబీలో మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు సీఎం కె.చంద్రశేఖర్ రావుకు నివేదించారు. మక్కలకు కనీస మద్దతు ధరను ఆశించే పరిస్థితి లేనేలేదని, మద్దతు ధర రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. ధర ఎంత తక్కువ వచ్చినా ఫర్వాలేదనుకునే రైతులు మాత్రమే మొక్కజొన్న సాగుకు సిద్ధపడాలన్నారు.
యాసంగిలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు, మార్కెటింగ్ అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో మక్కల సాగును నిపుణులు, అధికారులు తీవ్రంగా వ్యతి రేకించారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయని ఈ సమావేశంలో నిపుణులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ము కోవచ్చు, కొనుక్కోవచ్చు అనే విధానంతో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని, దీనికి తోడుగా విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలను పెద్ద ఎత్తున తగ్గించిం దని... ఇవి పేద రైతు పాలిట శాపంగా పరిణమిం చాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
దిగుమతి సుంకం తగ్గింపు...
అంతర్జాతీయ విపణిలో అవసరాలకుపోను.. 28 కోట్ల మెట్రిక్ టన్నుల మక్కల నిల్వలున్నాయని, దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్ టన్నుల మక్కలు మాత్రమే సాలీనా అవసరం కాగా, 3 కోట్ల 53 లక్షల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని నిపుణులు, అధికారులు సీఎంకు తెలియజేశారు. అంటే 1 కోటీ 11 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు అదనంగా ఉన్నాయని, వానాకాలంలో దేశవ్యాప్తంగా మరో 2.04 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న పంటల నుంచి దాదాపు 4 కోట్ల 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయని తెలియజేశారు. దీంతో ఈ సంవత్సరానికే కాకుండా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడా మక్కల స్టాకు ఉంటుందని అధికారులు తేల్చిచెప్పారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం విదేశాలనుంచి అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను దిగుమతి చేసుకోవడానికి నిర్ణయించడం పరిస్థితులను మరింత దిగజార్చిందని స్పష్టం చేశారు. మక్కల మీద విధించే 50 శాతం దిగుమతి సుంకాన్ని 35 శాతం తగ్గించి కేవలం 15 శాతం పన్నుతో విదేశాల నుంచి మొక్కజొన్నలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతించిందన్నారు. తద్వారా దేశంలోని, రాష్ట్రంలోని మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించక రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందన్నారు.
పొరుగు రాష్ట్రాల్లో తక్కవ ధరకే కోళ్ల దాణా..
తెలంగాణలో ఉన్న మొక్కజొన్న రైతులకు సరైన ధర ఇప్పించాలనే ఉద్దేశంతో కోళ్ల పరిశ్రమ వ్యాపారులతో వ్యవసాయ శాఖ చర్చలు జరిపిందని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎంకు వివరించారు. బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్ల దాణా అతి తక్కువ రేటుకే దొరుకుతున్నందున, తెలంగాణలో పండిన మొక్కజొన్నలు కొనడానికి కోళ్ల వ్యాపారులు సుముఖంగా లేరని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖామంత్రి గంగుల కమలాకర్, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment