మక్కల కొనుగోలులో మస్తు దోపిడీ
ఖమ్మం వ్యవసాయం: మొక్కజొన్న రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఆరుగాలం శ్రమించి మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు కనీస ధర కూడా పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మక్కలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. క్వింటాలు రూ.1310 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయించడంలో అధికారులు విఫలంకావడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నారు. సరుకులో తేమ ఎక్కువగా ఉందనే నెపంతో కొనుగోలుకు సరేమిరా అంటున్నారు. గత్యంతరం లేక రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే ఉండి మొక్కజొన్న గింజలను ఆరబెడుతున్నారు. ఇంత చేసినా గిట్టుబాటు ధర ఇచ్చేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.
దిగుబడి అంతంతమాత్రమే...
ఖరీఫ్ సీజన్‌లో కొత్తగూడెం, పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, గార్ల, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, రూరల్, చింతకాని, మధిర, బోనకల్, వైరా, ముదిగొండ, తిరుమలాయపాలెం తదితర మండలాల్లో దాదాపు 45వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరానికి రూ.15 నుంచి రూ.20వేలు పెట్టుబడి పెట్టి పంట పండించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన మేరకు దిగుబడి రాలేదు. వర్షాలు అనుకూలిస్తే ఎకరాకు 20 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చేది. ఈ ఏడాది కేవలం 5 నుంచి 10 క్వింటాల దిగుబడి మించలేదు.
రైతులకు అందని మద్దతు ధర
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నలు క్వింటాలుకు రూ.1,310 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. నాణ్యత ప్రమాణాలను కూడా నిర్ణయించింది. వ్యర్థ పదార్థాలు 1.0 శాతం, ఇతర తిండిగింజలు 2.0 శాతం, దెబ్బతిన్న గింజలు 1.5 శాతం, కొద్దిగా దెబ్బతిన్న, రంగు మారిన గింజలు 4.5 శాతం, పరిపక్వం చెందని, నాసిరకం గింజలు 3.0 శాతం, పుచ్చిపోయిన గింజలు 1.0 శాతం, తేమ 14 శాతం ఉన్న మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టింది.
వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం పంటలో నాణ్యత ఉండటం అసాధ్యంగా మారింది. దీన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను వ్యాపారులు రైతులకు ఇవ్వడం లేదు. వ్యవసాయ మార్కెట్ లు, ప్రైవేట్‌గా, గ్రామాల్లో మొక్కజొన్నలను క్వింటాలకు రూ.850 నుంచి రూ.వెయ్యి వర కే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా రూ.460 మేరకు తక్కువగా కొనుగోలు చేసి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు.
నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు
‘దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగిన’ చందంగా మార్క్‌ఫెడ్ వ్యవహరిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నలుకొనుగోలు చేయాలని రెండు నెలల క్రితమే ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆ శాఖ పెడచెవినే పెట్టింది. దాదాపు 40 రోజులుగా మొక్కజొన్నల కొనుగోళ్లు జరుగుతున్నా మార్కెఫెడ్ వాటి కొనుగోళ్లకు ముందుకురాలేదు.
క్వింటాలుకు రూ.400 నుంచి 500 వరకు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. గత రెండు, మూడు రోజుల్లో నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇల్లెందులో ఏర్పాటు చేసిన కేంద్రంలో హమాలీల మధ్య తలెత్తిన వివాదంతో కొనుగోళ్లు జరగటం లేదు. బయ్యారం, గుండాల తదితర మండలాల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మిన తరువాత మార్కెఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు అంతగా జరగటం లేదు.
ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ 1,600 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసిందని ఆ శాఖ జిల్లా మేనేజరే చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు వ్యాపారులు దాదాపు 70 నుంచి 80వేల క్వింటాల వరకు కొనుగోలు చేశారని ఒక అంచనా. ఒక్క ఖమ్మం మార్కెట్‌లోనే దాదాపు 35వేల క్వింటాలు ఇప్పటి వరకు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.850 నుంచి రూ.1,070 వరకు మాత్రమే ధర పెట్టారు.
ధరల దోపిడీని అరికట్టని యంత్రాంగం
మొక్కజొన్నలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకన్నా వ్యాపారులు క్వింటాలుకు రూ.450 మేరకు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మార్క్‌ఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందించలేకపోయినా కనీస గిట్టుబాటు ధర అందించే విధంగా కూడా చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేదని, తేమశాతం ఎక్కువగా ఉందని సాకుతో వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
మా శ్రమను దోచుకుంటున్నారు: చలమల కోటయ్య, ఈర్లపూడి
ఎంతో కష్టపడి పండించిన పంటను దళారులు దోచుకుంటున్నారు. ఎకరంన్నరలో మొక్కజొన్న సాగుచేస్తే 10 క్వింటాల దిగుబడి వచ్చింది. కనీసం ఖర్చుల మేరకు కూడా రాలేదు. మార్కెట్‌లో మద్దతు ధర లభిస్తుందనే ఆశతో వస్తే ఇక్కడ కూడా దోపిడీ చేశారు. క్వింటాలు రూ.950కి కొనుగోలు చేశారు.