బ్యాంకాక్ : ముసుగు ధరించిన ఒక వ్యక్తి షాపింగ్‌మాల్‌లోకి చొరబడి తుపాకితో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన గురువారం థాయిలాండ్‌లో చోటుచేసుకుంది. కాగా ఈ దాడిలో ముగ్గురు చనిపోగా , నలుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు 145 కిలోమీటర్ల దూరంలో లోప్‌బురి ప్రావిన్స్ అనే ప్రదేశం ఉంది. గురువారం ఉదయం 8గంటలకు ముసుగు ధరించిన ఒక వ్యక్తి లోప్‌బురి ప్రావిన్స్‌లోని రాబిన్‌సన్ మాల్‌లోకి చొరబడినట్లు సీసీటీవి ఫుటేజీలో రికార్డయింది. నిందితుడు మొదట సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి అనంతరం షాపులోకి చొరబడి సేల్స్‌వుమెన్‌తో పాటు రెండేళ్ల పిల్లాడిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్లి బంగారు ఆభరణాలతో పాటు నగదును తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చాడు.
మరో వీడియోలో ఒక చేతిలో తుపాకి పట్టుకొని మరొక చేతితో పెద్ద నెక్లెస్‌ను పట్టుకొని బయటికి వచ్చినట్లు రికార్డయింది. అంతేకాదు సదరు దొంగ దర్జాగా బైక్‌పై పారిపోతున్నది వీడియోలో స్పష్టంగా కనపడింది. ' ఆ దొంగకు జాలి, దయ అనేవి లేవు. షాపులోకి చొరబడి విధ్వంసం చేయడమే గాక రెండేళ్ల పిల్లాడిని అనవసరంగా పొట్టనబెట్టుకున్నాడు.మమ్మల్ని నమ్మండి.. త్వరలోనే ఆ ముసుగుదొంగ ఎక్కడ ఉన్నా పట్టుకొని తీరుతాం' అని పోలీస్ కమాండర్ అంపోల్ బురుప్పన్ పేర్కొన్నారు. కాగా చిన్నారి తల్లిదండ్రులు చనిపోయిన తమ బిడ్డను తలుచుకుంటూ ' చిట్టినాన్న! నిన్ను పోగొట్టుకోవడం మా దురదృష్టకరం. ఆ దుర్మార్గుడి నుంచి నిన్ను కాపాడుకోలేకపోయాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలని మేము ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం' అంటూ భావోద్వేగంతో ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment