తాండూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రమైన తాండూరు పట్టణంలో రాత్రి పూట గస్తీ నిర్వహణ నామామాత్రంగా మారింది. దీంతో దుండగలు తెగబడుతున్నారు. ఇళ్లు, దుకాణాలను లూటీ చేస్తున్నారు. బంగారు, వెండి, నగదు అపహరించుకు పోతుండటంతో పట్టణవాసులు బెంబేలెత్తిపోతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో మూడు ఇళ్లలో దుండగులు చోరీలకు పాల్పడటం రాత్రి వేళ పోలీసు గస్తీ వైఫల్యానికి అద్దం పడుతోంది. ఈనెల 20న తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి నివాసం ఎదురుగా కిరాణ వ్యాపారి చంద్రయ్య ఇంట్లో, తాజాగా భవానీ నగర్‌లోని బైక్ మెకానిక్ మహ్మద్ ఇస్మాయిల్ ఇంట్లో, సాయిపూర్‌లోని యాదిరెడ్డి చౌక్‌లో సమీపంలో కిరాణ వ్యాపారి నరేందర్ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడటం సోమవారం వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం గాంధీచౌక్‌లోని బంగారు నగల దుకాణంలోనూ పట్టపగలే చోరీ జరిగింది.
కొరవడిన నిఘా...
రాత్రి వేళ నడిచే కొన్ని హోటళ్లను మూయించడానికే పెట్రోలింగ్ పరిమితమైందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు రాత్రి పట్టణంలో 8 రూట్‌లలో గస్తీ నిర్వహించాలి. ప్రస్తుతం మూడు రూట్‌లకే గస్తీ పరిమితం కావడం గమనార్హం. ఇక తాండూరు రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో గస్తీ తూతూమంత్రంగా మారింది. అర్థరాత్రి దాటిన తరువాత రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల వద్ద అనుమానితులపై పోలీసు నిఘా పూర్తిగా కొరవడింది. ఒక రౌండ్ పెట్రోలింగ్ నిర్వహించి మమ అనిపించేస్తున్నారు. స్థానిక పోలీసు అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పెట్రోలింగ్ అధ్వానంగా మారింది. అర్భన్ సర్కిల్ కార్యాలయం పరిధిలో సుమారు 42మంది కానిస్టేబుళ్లు, 20 మంది హోంగార్డులు ఉన్నారు. ఇంత మంది సిబ్బంది ఉన్నప్పటికీ రాత్రి పూట కేవలం మూడు రూట్‌లలో గస్తీ నిర్వహిస్తుండటం గమనార్హం. కర్ణాటక సరిహద్దు కావడం, రైలు సౌకర్యం ఉండటంతో దుండగులు తాండూరును లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు.
సిబ్బంది కొరత...
కానిస్టేబుళ్లు, హోంగార్డులు మూడోవంతు కోర్టు, ఎన్‌బీడబ్ల్యూ, శిక్షణ, ట్రాఫిక్ నియంత్రణతోపాటు ఉన్నతాధికారుల కార్యాలయాలకు అటాచ్‌లకు వెళ్లడంతో రాత్రివేళ గస్తీకి సిబ్బంది కొరతగా మారిందనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే రాత్రిపూట బీట్లు తగ్గాయని అంటున్నారు.మూడేళ్ల క్రితం అలాట్‌మెంట్ ప్రకారమే కానిస్టేబుళ్ల నియామకం అయ్యారని, ఈ సంఖ్యను ప్రస్తుత అవసరాలకనుగుణంగా పెంచితే ఎక్కువ రూట్‌లలో రాత్రి వేళ్ల గస్తీ నిర్వహించేందుకు వీలవుతుందని, తద్వారా చోరీలను నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సిబ్బంది పెంపుతోపాటు గస్తీ లోపాలను సవరిస్తూ, ప్రత్యేక నిఘాను ఏర్పాటుపై ఉన్నతాధికారులు యోచించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
గస్తీకి సుస్తీ
Published Tue, Dec 24 2013 12:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
Advertisement
Advertisement