
సీసీటీవీ ఫుటేజీల్లో నిందితుడు
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నగరంలో వీఆర్‌సీ సెంటర్‌లోని శుభమస్తు షాపింగ్ మాల్‌లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. దుండగుడు నాలుగో అంతస్తులోని యజమాని కార్యాలయంలో ఉన్న లాకర్‌ను పగులగొట్టి రూ.16 లక్షల నగదును అపహరించుకుని వెళ్లాడు. శుక్రవారం ఉదయం మాల్ తెరిచిన సిబ్బంది నాలుగో అంతస్తులో సీసీ కెమెరాలు పగులగొట్టి ఉండటం, యజమాని కార్యాలయంలో లాకర్ తెరచి ఉండడం, బాత్‌రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యానును తొలగించి కిందపడవేసి ఉండటాన్ని గమనించి యజమాని వాసుకు సమాచారమిచ్చారు.
యజమాని చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ జే.శ్రీనివాసులరెడ్డి, ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించగా చోరీ జరిగిన తీరు, నిందితుడి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. దాని ఆధారంగా నిందితుడు అదే మాల్‌లో పనిచేసే మణిగా గుర్తించారు. గురువారం రాత్రి మాల్ మూసివేసే సమయానికి దుండగుడు లోపలికి ప్రవేశించి చోరీ చేసి బాత్‌రూమ్‌లో దాక్కున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బాత్‌రూమ్‌లో నుంచి బయటకు వచ్చి వెళ్లాడు. పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. చోరీ చేసిన సొత్తును స్వా«దీనం చేసుకున్నారు.