యాచారం, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించినా సక్రమంగా రైతులకు బిల్లులు ఇవ్వరు. పోనీ కొనుగోలు చేసిన మక్కలనైనా తరలిస్తారంటే.. అదీ లేదు. మొత్తంగా కొనుగోళ్ల వ్యవహారాన్ని అధికారులు గాలికొదిలినట్టు కన్పిస్తోంది. యాచారం మండలంలో మహిళా సమాఖ్య, ఐకేపీ సంయుక్తంగా చింతపట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రానికి మండలంలోని రైతులే కాకుం డా మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పలు మండలాల నుంచి 200మంది రైతులకుపైగా సోమవారం వరకు 8,111 క్వింటాళ్ల మొక్కజొన్నలు విక్రయాలు జరిపారు. విక్రయాలు జరిపిన రైతులకు క్వింటాల్‌కు రూ.1,310 చొప్పు న రూ.కోటి పది లక్షల వరకు డబ్బులు అందాల్సి ఉంటుంది.
కానీ రైతులకు సగం బిల్లులు కూడా అందలేదు. కొనుగోలు కేంద్రంలో ప్రారంభంలో విక్రయాలు జరిపిన వారం రోజుల్లోనే రైతులకు బిల్లులు ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించినా సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నిత్యం చెప్పులరిగేలా తిరగక తప్పడం లేదు. ఇదిలాఉంటే మక్కల బస్తాలు ఏ రక్షణ లేకుండా కొనుగోలు కేంద్రాల వద్దే మూలుగుతున్నాయి. సుమారు 200 క్వింటాళ్ల మక్కల బస్తాలు ఎండకు ఎండి.. వానకు తడుస్తూ మొలకలొస్తున్నాయి. కొనుగోళ్లు జరిగిన తర్వాత మక్కల బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ ఉత్పత్తులు ఏ మాత్రం ఉపయోగానికి రాని దుస్థితి ఏర్పడింది.
పంటలు వేసుకోవటానికి సిద్ధం
వర్షాలు సంవృద్ధిగా కురిసి భూగర్భజలాలు పెరగడం వల్ల వరితోపాటు వివిధ రకాల పంటలు వేసుకోవటానికి రైతులు సిద్ధమవుతున్నారు. చింతపట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో విక్రయాలు జరిపిన రైతుల్లో అత్యధికంగా వరి సాగు చేసేవారే ఉన్నారు. ఒక్కో రైతుకు రూ.వేలాది బిల్లులు అందాల్సి ఉంది. విక్రయించిన మొక్కజొన్న డబ్బులు సకాలంలో అందకపోవడం, నాటేసే సమయం దగ్గరపడుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
ఈ నెల చివరి వరకే కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు
ఈ నెల చివరి వరకే మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్థానిక ఐకేపీ, సమాఖ్య సభ్యులకు ఆదేశాలందాయి. గత కొద్ది రోజుల కింద ఇబ్రహీంపట్నంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం బంద్ కావడంతో ఇబ్రహీంపట్నం పరిసరాల గ్రామాల నుంచి రైతులు చింతపట్లలోని కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్నలు విక్రయాలకు తరలి స్తున్నారు. అధికారుల ఆదేశాలతో ఐకేపీ, సమాఖ్య సిబ్బంది ఈనెల 20లోపు రైతులకు ఇచ్చిన బస్తాల వరకే మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 20 తర్వాత వచ్చిన రైతులకు బస్తాలు ఇవ్వడం నిలిపేశారు. కొద్ది రోజులుగా చింతపట్ల కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలను అధికారులు సకాలంలో తరలించకపోవడం, భద్రపర్చుకునే స్థలం లేక గోదాం బయటనే నిల్వ ఉంచారు. చలి, కురిసే వర్షాలకు వందలాది క్వింటాళ్ల మొక్కజొన్న మొలకెత్తడంతోపాటు, బూజు పట్టింది. కొనుగోలు చేసిన వెంటనే తరలిస్తామని అధికారులు హామీలు ఇవ్వడమే కానీ ఆచరణలో శ్రద్ధ పెట్టడంలేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
నెల కింద విక్రయించా...
చింతపట్ల కొనుగోలు కేంద్రం లో 38 క్వింటాళ్ల మొక్కజొన్నలు నెల కింద విక్రయించా. విక్రయించిన మొక్కజొన్నకు రూ.49వేలకు పైగా నేటికీ బిల్లులు అందలేదు. చెప్పులరిగేలా తిరగగా సోమవారం చెక్ ఇచ్చారు. అది కూడా 27న తేదీ వేసి ఇచ్చారు. సాగు పనులు దగ్గరపడుతుంటే భయం నెలకొంది. - ముత్యాల సాయిరెడ్డి, నానక్‌నగర్
కొనుగోలు కేంద్రాని కొనసాగించాలి
చింతపట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మరో పక్షం రోజలకు పైగా నిర్వహించాలి. నేటికీ రైతులు పలు గ్రామాల నుంచి వందలాది క్వింటాళ్ల మొక్కజొన్నలు తీసుకోస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలి. లేదంటే రైతులు నష్టపోతారు.
- లిక్కి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ, చింతపట్ల
ప్రోత్సాహం లేదు
కొనుగోలు కేంద్రం నిర్వాహణ సక్రమంగా చేయాలని చిత్తశుద్ధి ఉన్నప్పటికీ అధికారుల నుంచి ప్రోత్సాహం లేదు. వెనువెంటనే మొక్కజొన్నలు తరలించకపోవడం వల్ల వందలాది క్వింటాళ్ల నిల్వలు అలానే ఉంటున్నాయి. నేటికీ రైతులకు రూ.లక్షలాది బిల్లులు ఇవ్వాలి. రైతులు నిత్యం తిరుగుతున్నారు. - స్రవంతి, ఎస్‌ఆర్‌పీ మార్కెటింగ్ ఐకేపీ
మొలకెత్తిన నిర్లక్ష్యం!
Published Tue, Dec 24 2013 12:25 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement