పంటలపై వరుణ ప్రతాపం, చలిగాలులకు నలుగురు మృతి | Heavy rains hits crops, Four killed in cold winds | Sakshi
Sakshi News home page

పంటలపై వరుణ ప్రతాపం, చలిగాలులకు నలుగురు మృతి

Published Sat, Oct 26 2013 2:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

Heavy rains hits crops, Four killed in cold winds

సాక్షి, మచిలీపట్నం : వర్ష బీభత్సానికి జిల్లాలో చేలు చెరువులయ్యాయి. కళ్లముందే మునిగిపోతున్న పంటచేలను చూసి రైతు గుండె చెరువైంది. జిల్లాలో లక్షా 12 వేల ఎకరాల్లో పంట నీటమునగగా, దిక్కుతోచని స్థితిలో అన్నదాత అల్లాడుతున్నాడు. మరోపక్క అనేక గ్రామాలు వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చలిగాలుల ధాటికి జిల్లాలో నలుగురు మృతిచెందారు.

నందిగామ మండలం రాఘవాపురంలో కోట రామయ్య దెబ్బతిన్న పత్తిచేను వద్ద విస్తుపోయి చూస్తున్నాడు.. కంకిపాడు మండలం చలివేంద్రపురంలో కొల్లి సుబ్బారెడ్డి నీటమునిగిన వరిచేనును కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు.. జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటలో చుక్కా యాకోబు వర్షానికి తడిసి మొలకలు వచ్చిన మొక్కజొన్నను చూసి బిక్కుబిక్కుమంటున్నాడు.. అవనిగడ్డ మండలం దక్షిణతిరువోలు లంకలో బచ్చు రాజేశ్వరరావు నీటిపాలైన బీర, బెండ పంటలను చూపి బెంగపెట్టుకున్నాడు.. కొల్లేరు తీరంలోని భుజబలపట్నంలో సయ్యపురాజు గుర్రాజు తన చేపల చెరువులను చూసి గుబులు పెట్టుకున్నాడు..

కలిదిండి, కైకలూరు మండలాల్లో రొయ్యల చెరువుల గట్లు తెగి రైతులు హడావుడిగా పట్టుబడులు చేస్తున్నారు.. తీరానికి చేరువలో ఉన్న బందరు, కృత్తివెన్ను మండలాల్లో ముంపు తీవ్రత పెరుగుతుందని ప్రజలు, రైతులు కలవరపడుతున్నారు.. ఇవి జిల్లాలో శుక్రవారం కనిపించిన హృదయాలను పిండేసే దృశ్యాలు. ఇవి ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. జిల్లా అంతటా అన్ని పంటల రైతులు ముంపు ముప్పునుంచి గట్టెక్కే మార్గంలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నీట మునిగిన పంట చేను గట్టున ఉన్న ఏ రైతును కదిలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు.

 చెరువులను తలపిస్తున్న పొలాలు...

 జిల్లాలో ఏ చేలను చూసిన నీళ్లతో నిండి చెరువులను తలపిస్తున్నాయి. కాయకష్టం నీటిపాలు కావడంతో కర్షకుడి కళ్లలో కన్నీళ్లే ఉబికివస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో దాన్ని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వరుణుడి ప్రతాపానికి జిల్లాలోని చేలు చెరువులయ్యాయి. వాటిని చూసి రైతుల గుండెలు కన్నీటి కాల్వలుగా మారుతున్నాయి. జిల్లాలో గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అధికారిక లెక్కల ప్రకారం 1,12,808 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

ఈ నష్టం రెట్టింపు ఉంటుందని రైతుల చెబుతున్న లెక్కలను బట్టి తెలుస్తోంది. అధికారిక అంచనాల ప్రకారం జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా దానిలో 48,872 ఎకరాల పంట నీటిముంపునకు గురైంది. అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి, నాగాయలంక, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, కలిదిండి, గుడ్లవల్లేరు, నందివాడ, పమిడిముక్కల, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు, నందిగామ తదితర మండలాల్లో వరిచేలు నీటిపాలు కావడంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

 పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బ...

 జిల్లాలో 1.37 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. దానిలో 52,330 ఎకరాల్లో పంట వర్షాలకు దెబ్బతింది. జగ్గయ్యపేట, నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు, మైలవరం తదితర ప్రాంతాల్లో తీతకు వచ్చిన పత్తిచేను తడిచిపోవడంతో రంగుమారిపోయింది. చాలాచోట్ల విచ్చుకునే దశలో ఉన్న, తీతకు వచ్చిన పత్తి వర్షాలు, గాలులకు నేలరాలిపోయి నీటిపాలైంది. దీంతో ఎకరాకు పదివేల రూపాయల వరకు నష్టం వస్తుందని పత్తి రైతులు ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో మచిలీపట్నం, నూజివీడు, మైలవరం తదితర ప్రాంతాల్లో 2,500 ఎకరాల్లో వేరుశనగ, జగ్గయ్యపేట, నందిగామ, వత్సవాయి. పెనుగంచిప్రోలు, కంచికచర్ల ప్రాంతాల్లో 1,358 ఎకరాల్లో మొక్కజొన్న, 200 ఎకరాల్లో మినుము పంట దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. జిల్లాలో దాదాపు 22,500 ఎకరాల్లో సాగు జరుగుతున్న పసుపు చేలలో తోట్లవల్లూరు, కంకిపాడు, మోపిదేవి, అవనిగడ్డ, పామర్రు, ఉయ్యూరు, చల్లపల్లి ప్రాంతాల్లోని 1,305 ఎకరాల్లో పసుపు చేలు నీటి ముంపునకు గురయ్యాయి.

మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లోని 2,245 ఎకరాల్లో మిరప చేలు, 493 ఎకరాల్లోని అరటి పంట దెబ్బతింది. తోట్లవల్లూరు, కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు ప్రాంతాల్లోని 273 ఎకరాల్లోని తమలపాకు తోటలు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, కోడూరు తదితర ప్రాంతాల్లోని 3,232 ఎకరాల్లోని కూరగాయల తోటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లోని బీర, బెండ తోటల్లోకి నీరు చేరడంతో నాలుగు రోజులుగా నీటిలో నానిపోయి కాయలు కుళ్లిపోయాయని రైతులు వాపోతున్నారు.
 
తెగిన రొయ్యల చెరువుల గట్లు...

 జిల్లాలో ఆక్వారంగం ఆక్సిజన్ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. 73 వేల ఎకరాల్లో చేపల, 35 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులను సాగు చేస్తున్నారు. కొల్లేరు, కలిదిండి, కృత్తివెన్ను, బందరు ప్రాంతాల్లో రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ సమస్య, చేపల చెరువుల్లో డీవోబీ సమస్యలు తలెత్తాయి. కైకలూరు, కలిదిండి మండలాల్లో రొయ్యల చెరువుల గట్లు తెగి రైతులు నష్టపోయారు.

జలదిగ్బంధంలో గ్రామాలు...

మచిలీపట్నం : అల్పపీడన ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. శుక్రవారం కుండపోతగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లటంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల తాకిడికి జిల్లాలోని పది మండలాలపై ప్రభావం చూపగా 80 గ్రామాల చుట్టూ నీరు చేరింది. మూడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. మచిలీపట్నం, గుడివాడ పట్టణాల్లో రోడ్లపై నీరు చేరి ప్రజలు అవస్థల పాలయ్యారు.

భారీ వర్షాల కారణంగా జిల్లాలో రెండు లక్షల మంది జనాభాపై ప్రభావం పడింది. కలిదిండి మండలంలో అత్యధికంగా 18.4, తిరువూరులో అత్యల్పంగా 0.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 40 గృహాలు దెబ్బతినగా వాటిలో 16 పాక్షికంగా దెబ్బతినానయని ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపారు. 484.11 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయని, దీంతో రూ.125 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు. పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి 100 రోడ్లు 750 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని అధికారులు నివేదిక తయారుచేశారు. 49 పశువులు మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.
 
చలిగాలులకు నలుగురు మృతి


కూచిపూడి/పెడన రూరల్/పామర్రు రూరల్, న్యూస్‌లైన్ :  భారీ వర్షాల ప్రభావంతో వీచిన చలిగాలులకు జిల్లాలో నలుగురు మృతిచెందారు. మొవ్వ మండలం కాజలో పేకేటి వీరరాఘవరెడ్డి, మొవ్వ ఎస్టీ కాలనీలో కే వెంకటేశ్వర్లు గురువారం రాత్రి చనిపోయారు. పెడన తోటమూల ప్రాంతంలోని మొగ్గయ్య కాలనీలో చేనేత వృత్తి చేసుకునే గుత్తి కాంతమ్మ (68) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. పామర్రు మండలం పెదమద్దాలి అంబేద్కర్ కాలనీలో పోలవరపు వరలక్ష్మి (65) గురువారం రాత్రి చలిగాలులకు కన్నుమూసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement