గజ్వేల్, న్యూస్‌లైన్: మక్కల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా.. చెక్కుల పంపిణీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండటంతో కోపోద్రిక్తులైన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా గురువారం స్థానిక మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి సుమారు ఆరు గంటలకుపైగా లావాదేవీలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి ఇక్కడికి చేరుకోగా రైతులు వాగ్వాదానికి దిగారు.
అయిదు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో చివరకు ఆందోళన సద్దుమణిగింది. గజ్వేల్‌లోని ఐకేపీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వ్యవహారంలో కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఈ కేంద్రం నిర్వాహకులు వ్యాపారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో కొనుగోళ్లలో జాప్యం జరిగిందని గుర్తించిన జిల్లా అధికారులు కేంద్ర నిర్వాహకురాలు, ఐకేపీ ఏపీఎంను సస్పెండ్ చేసిన సంగతి విదితమే. అక్టోబర్ నెలలో ప్రారంభించిన ఈ కేంద్రంలో జనవరి 15 వరకు మొత్తం 34వేల క్వింటాళ్ల వరకు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఇందులో 19,500 క్వింటాళ్ల స్టాకును తరలించారు.
మిగిలిన 14వేల పైచిలుకు క్వింటాళ్ల స్టాకు ప్రస్తుతం మార్కెట్ యార్డు ఆవరణలో పడి వున్నది. స్టాకు తరలింపునకు నోచుకోకపోవడంవల్ల మొత్తం రూ.3.5కోట్ల వరకు జరగాల్సిన చెల్లింపుల్లో ఇప్పటివరకు కోటిన్నర మాత్రమే చెక్కులను అందించగలిగారు. సుమారు రూ.2కోట్లకుపైగా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడి నుంచి నిల్వలను మార్క్‌ఫెడ్ అధ్వర్యంలోని గోదాముల్లోకి తరలిస్తేనే రైతులకు చెల్లింపులు జరుగుతాయి. కానీ వ్యవహారంలో నెలతరబడి జాప్యం నెలకొన్నది. జిల్లాలోని మిగతా ఈ ప్రక్రియ పూర్తి కావస్తున్నా.. గజ్వేల్‌లో పరిస్థితి భిన్నంగా ఉన్నది. మరో పక్క గడువు ముగిసిందనే కారణంతో కేంద్రంలో కొనుగోళ్లును నిలిపివేయడంతో వేలాది క్వింటాళ్ల మక్కలు కొనుగోళ్లకు నోచుకోకుండా పడివున్నాయి.
ఈ సమస్యలపై విసిగిపోయిన రైతులు ఈనెల 3న యార్డు గేటుకు తాళమేసి ధర్నా నిర్వహించారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో తిరిగి గురువారం ఉదయం యార్డు గేటుకు తాళం వేశారు. పైగా గేటు ఎదుట ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక హుటాహటినా ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, డీఎంకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. సాయంత్రం 3గంటలవరకు ఆందోళన కొనసాగడంతో యార్డులో ఆరు గంటలకుపైగా లావాదేవీలు నిలిచిపోయాయి.
ఇదే క్రమంలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి సైతం ఇక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. ఈ సందర్భంగా రైతుల సమక్షంలో సమస్యను మార్క్‌ఫెడ్ డీఎం, ఆర్‌డీఓలు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ సూచన మేరకు నిల్వలు లిఫ్ట్ చేసి పెండింగ్‌లో ఉన్న చెక్కులను అయిదు రోజుల్లో ఇప్పించడంతోపాటు యార్డులో కొనుగోలు చేయకుండా మిగిలిపోయిన మక్కలను ప్రభుత్వ కేంద్రాల గడువు ముగిసినందు వల్ల ప్రైవేట్ వ్యాపారులతో కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది.
నెలలు గడుస్తున్నా.. చెక్కులివ్వరా?
Published Thu, Feb 6 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement