Kartik month
-
తులసి చెట్టు గొప్పతనం
మీకు తెలుసా? ఇంటింటా తులసి మొక్కను పెంచడం, పూజించడం హిందూ సంప్రదాయం. తులసి మొక్కల్ని ఒక బృందావనంలా పెంచడం, ఆ తులసి కోట దగ్గర నిత్యం ధూప దీపారాధన స్త్రీలకు సనాతనంగా వస్తున్న విధి. అందులోనూ కార్తిక మాసంలో అది ఇంకా విశేషం. అంత మహత్తరమైన ప్రాధాన్యం తులసికి ఇచ్చారు. తులసీ మాహాత్మ్యం గురించి మన పురాణాలు, ఇతిహాసాలు స్పష్టంగా చెప్పాయి. తులసీ మాహాత్మ్యం గురించి సాక్షాత్తూ వ్యాసమహర్షి, ధర్మరాజుకు ఇలా చెప్పాడు... ‘‘సాక్షాత్తూ బ్రహ్మదేవుడు సైతం తులసి గొప్పదనాన్ని పూర్తిగా వర్ణించలేనన్నాడు. అయితే, ఆయన నారదుడికి చెప్పిన మాట ఏమిటంటే - కార్తిక మాసంలో తులసి పూజ చేసినవారు స్వర్గానికి వెళతారు. తులసీ దళాలతో కూడిన నీటితో స్నానం చేస్తే, తుదిశ్వాస విడిచాక వైకుంఠానికి చేరుకుంటారు. ఎవరైతే ఒక బృందావనంగా తులసి మొక్కల్ని పెంచుతారో వారికి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో నివసించడం, తులసి చెట్టు పెంచడం, తులసి పూసల మాల ధరించడం, తులసి ఆకులు తినడం వల్ల సమస్త పాపాలూ పోతాయి. యమకింకరులు తులసి చెట్టు సమీపానికి కూడా రారు.‘యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతా, యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీమ్ త్వామ్ నమామ్యహమ్’ ‘ఏ చెట్టు మూలంలో అయితే సమస్త తీర్థాలూ ఉన్నాయో, ఏ చెట్టు మధ్యలో అయితే సర్వదేవతలూ వసిస్తున్నారో, ఏ చెట్టు అగ్రభాగంలో సమస్త వేదాలూ ఉన్నాయో - అలాంటి తులసి చెట్టుకు నమస్కరిస్తున్నాను’ అనే మంత్రం చదివితే, అన్ని సమస్యలూ, కష్టాలూ నశిస్తాయి. అకాల మృత్యు భయం ఉండదు.’’అని శాస్త్రవచనం. - మహతి -
జగన్నాథుడి ఎదుట కార్తీక వ్రతం
సన్నిధి పవిత్రమైన కార్తిక మాసంలో పూజలు, నోములు, వ్రతాలతో సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. తెలుగు నేలపైనే కాదు... ఒరిస్సాలోనూ ఈ మాసంలో జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాలు అనేకం. ఈ నెలలో ఒరిస్సా ప్రాంతంలోని వయోవృద్ధ మహిళలు, వితంతువులు సామూహికంగా నెల రోజులూ కార్తీక దీక్ష నిర్వహిస్తారు. పలు ప్రాంతాల నుంచి ఒరిస్సాలోని పూరిలో నెలకొన్న జగన్నాథస్వామి ఆలయమైన శ్రీక్షేత్రానికి విచ్చేసి, గుంపులు గుంపులుగా కూడి వ్రతం ఆచరిస్తారు. ఇలా ఆచరించే కార్తీక వ్రతాన్ని స్థానికంగా ‘హబిష’గా వ్యవహరిస్తారు. వ్రతం ఆచరించే వారిని ‘హబిషియాలి’గా పేర్కొంటారు. ప్రముఖ శైవ, వైష్ణవ క్షేత్రాలు ఈ హబిషియాలీలతో కళకళలాడతాయి. ఈ నెల పొడవునా మహా విష్ణువు, మహా శివుని తపో దీక్షతో పూజిస్తారు. వ్రతం కొనసాగే వ్యవధిలో ఒంటిపూట ఆహారం, శాకాహారం, పండ్లు ఫలాల్ని మాత్రమే స్వీకరిస్తారు. శ్రీజగన్నాథునికి నివేదించిన అన్నప్రసాదాల్ని (ఒభొడా) అతి పవిత్రంగా స్వీకరిస్తారు. ‘ఒభొడా’ అందుబాటులో లేని సందర్భాల్లో ఆకు కూరలు, కందమూలం లాంటి దుంప జాతి పదార్థాలకు ఎంపిక చేసిన పప్పుల్ని చేర్చి, కూరగా వండుకొని అన్నం స్వీకరించడం కార్తీక వ్రత ఆచరణలో భాగం. సాయంత్ర వేళల్లో సాధారణంగా పండ్లను ఆరగించి గడిపేస్తారు. వ్రత సంకల్పం మొదలు ఇంటి నుంచి దూరంగా దేవస్థానాలు, మఠాలు వగైరా ప్రాంతాల్లో బస చేసి సమష్టిగా వ్రతం జరుపుకోవడం ఆచారం. ఈ సందర్భంగా శ్రీమందిరం సముదాయంలో కొలువు దీరిన మహాలక్ష్మి దేవస్థానం కూడా కళకళలాడుతుంది. దేవస్థానం ఆవరణలో పద్మాల ముగ్గుల్ని వేసి, నిత్య నూతనంగా తీర్చిదిద్దుతారు. మహాలక్ష్మి దేవస్థానంలో ఇలా ముగ్గులు వేసి దేవిని ప్రసన్నం చేసుకోవడంతో సౌభాగ్యం లభిస్తుందని వీరి విశ్వాసం. తులసి కోట ఆవరణలో... కార్తీక వ్రతం ఆచరించేందుకు పలు ప్రాంతాల నుంచి చేరిన దీక్షాధారులు అక్కడక్కడ గుంపులుగా చేరతారు. వీరు తాత్కాలికంగా బస చేసే చోట తులసి కోట ఉండేలా తప్పనిసరిగా చూసుకుంటారు. తులసి కోట ముంగిల్లో వేకువ జాము నుంచి పూజాదులు నిర్వహించి, కార్తీక పురాణం పారాయణం వగైరా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హడావిడిగా ఉంటారు. నెల రోజులూ ఇదే షెడ్యూలు. వ్రతం సమయంలో పశువులు, పక్షులు మొదలైన వాటితో భంగం వాటిల్లకుండా, తులసి మొక్క పై భాగాన సంప్రదాయ డేరా (చందువా) వేస్తారు. ఇలా ఆచరించే కార్తీక వ్రతాన్నే ‘హబిష’గా వ్యవహరిస్తారు. హబిషియాలీలకు ప్రత్యేక దర్శనం: వేలాది మహిళా భక్తులు రాష్ట్రంలో పలు చోట్ల ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీజగన్నాథుని దర్శించుకునేందుకు కార్తీక మాసంలో విశేష సంఖ్యలో యాత్రికులు విచ్చేస్తారు. హబిషియాలీల రాకతో భువనేశ్వర్‌లోని ఏకామ్ర క్షేత్రం కూడా కార్తీక మాసం నెల రోజులు కిటకిటలాడుతుంది. వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తారు. - ఎస్.వి. రమణమూర్తి, భువనేశ్వర్ -
ఆనాటి ‘వెలుగులు' మళ్లీ ప్రసరించాలి..
అనంతపురం కార్పొరేషన్ : కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో అనంతపురంలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద దీపాలు వెలిగించి..నివాళులర్పించారు. విగ్రహం చుట్టూ ఉన్న రైలింగ్‌ను పూలమాలలతో అలంకరించారు. విగ్రహం వ రకు ఉన్న మెట్లపైన దీపాలు వెలిగించారు. ‘వైఎస్ఆర్’ అనే అక్షరాలను పూలతో అలంకరించి, వాటిపై దీపాలు ఉంచారు. అనంతరం మహిళలకు కుంకుమ, పసుపు, పండ్లు, గాజులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్రతియేటా కార్తీక మాసం చివరి సోమవారం వైఎస్ విగ్రహం వద్ద దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్‌కు మహిళలంటే ఎనలేని గౌరవం ఉండేదన్నారు. ప్రతి మహిళా లక్షాధికారి కావాలని కోరుకునేవారన్నారు. ఆయన మన మధ్యలేకపోయినా ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సరోజమ్మ, పార్టీ మహిళా విభాగం నాయకులు నాగలక్ష్మి, సరస్వతి, ప్రమీల, ఎ.ప్రమీల, బి.ప్రమీల, దేవి, హేమ, కుళ్లాయమ్మ, అరుణ, లక్ష్మిదేవి, సునీత, కామాక్షమ్మ, కమలమ్మ పాల్గొన్నారు. -
కార్తికం వనభోజనాల విశిష్ట మాసం
ఎవరి నోట విన్నా కేశవనామాలో, శివపంచాక్షరీ జపాలో... ఏ ఇంట చూసినా మనసును ఆనంద డోలికలలో నింపే పూజలు, కనువిందు చేసే దీపాలు... నాసికాపుటాలకు సోకే సుగంధపరిమళాలు... గంధమో, కుంకుమో, విభూదో లేదా ఈ మూడూనో అలంకరించుకుని ఆధ్యాత్మికతతో, అరమోడ్చిన కన్నులతో కనిపించే భక్తులు... ఈ వాతావరణం కనపడిందీ అంటే అది కచ్చితంగా కార్తికమాసమే! అటు హరికీ, ఇటు హరుడికీ, మరోపక్క వారిద్దరి తనయుడైనా హరిహరసుతుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన మాసమిది. వనభోజనాలు, సమారాధనలు, ఉపవాసాలు, అభిషేకాలు, విష్ణుసహస్రనామ పారాయణలతో మార్మోగిపోతూ ఎంత నాస్తికుడికైనా ఆస్తికభావనలు కలుగ జేసే మాసం కార్తికమే. కార్తికమాసం స్నాన, దాన, జప, ఉపవాసాలకు, దీపారాధనలకు ఎంతో ప్రశస్తమైనదని పెద్దలు చెబుతారు. అలాగే తామస గుణాన్ని పెంపొందింప చేసే ఉల్లి, వెల్లుల్లి తదితర ఆహార పదార్థాల జోలికి వెళ్లరాదని, మద్య మాంసాల ప్రసక్తి తీసుకు రాకూడదని, ద్రోహచింతన, పాపపుటాలోచనలు, దైవదూషణ పనికి రావని కార్తిక పురాణం చెబుతోంది. ఏడాది పొడుగూతా యథేచ్ఛగా ఉండే మనం ఈ ఒక్క మాసంలో అయినా అటువంటి వాటికి దూరంగా ఉంటే నష్టం లేదు కదా! వనసమారాధనతో విశిష్టఫలాలు కారుమబ్బులు కానరాని నిర్మలమైన నింగి... ఆహ్లాదకరమైన వాతావరణం... రకరకాల సువాసనాపుష్పాలతో నిండిన పూలమొక్కల మధ్యన విందుభోజనం చేయడం కార్తికమాసం ప్రత్యేకత. తిరుపతి వెంకన్న, సింహాద్రి అప్పన్న, శ్రీశైల మల్లికార్జునుడు, వేములవాడ రాజ రాజేశ్వరుడు, కొమురవెల్లి మల్లన్న, మంగళగిరి నరసింహ స్వామి, అన్నవరం సత్యదేవుడు వెలసింది వనాలలోనే! ఈ విశిష్ఠతను గుర్తు చేసేందుకే వనభోజనం చేయడం మంచిదన్నారు పెద్దలు. అంతేకాదు, భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ సంగతిని జనావళికి గుర్తుచేసేందుకే ఉసిరి చెట్ల కింద విస్తట్లో జరిగే విందు. శాస్త్రాన్ని, పుణ్యఫలాలను కాసేపు పక్కన ఉంచి, లౌకికంగా ఆలోచించినా వనభోజనాలు ఎంతో హితకరమైనవి. ఎందుకంటే వనాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు, కాంక్రీటు జనారణ్యాల్లోనూ, బహుళ అంతస్థుల భవనాలలోనూ చాలీ చాలని ఇరుకు గదుల్లోనూ మగ్గిపోయే పురజనులు అప్పుడప్పుడు అయినా వనాల్లోకి వచ్చి, అందరితోనూ కలసి అన్నీ మరచి హాయిగా భోజనం చేస్తే ఎంతో బాగుంటుంది కదా! మన ముందు తరాలవారు ప్రతి చిన్న అనారోగ్యాలకీ మందులు మింగించేవారు కాదు... అందుబాటులోనున్న ఏ ఆకు పసరునో పిండి, వ్రణాల మీద పోసేవారు, లేదంటే ఏ మూలికనో వాసన చూపించేవారు. ఏ చెట్టుబెరడుతోనో కాచిన కషాయం తాగించేవారు. వాటివల్ల ఏ దుష్ఫలితాలూ తలెత్తకుండా ఆయా రుగ్మతలు సహజంగానే తగ్గిపోయేవి. ఇప్పుడు ఆ సంస్కృతి దాదాపుగా అంతరించింది. కొన్ని రకాల మొక్కలు, వృక్షాలను కేవలం పుస్తకాలలోనో లేదంటే అంతర్జాలంలోనో చూసి ఆనంద పడటం తప్ప వాటిని ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందడం కష్టమైంది. అందుకోసమైనా సరే, ఈ మాసంలో పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లి, పెద్దలంతా వనభోజనాలు చేయండి. ఎందుకంటే వారికి మంచీ మర్యాదా, ప్రేమ, ఆప్యాయత, నలుగురిలో నడుచుకోవడం ఎలాగో, ఏయే పదార్థాలను ఎలా తినాలో మనం ప్రత్యేకంగా నేర్పకుండానే తెలుస్తాయి. ఇంతకీ వనభోజనాలు చేయమని పెద్దలు ఎందుకు చెప్పారంటే... పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడి వేసుకుంటుందని తెలియజేయడం కోసమే! ఈ అంతస్సూత్రాన్ని గ్రహించిన నాడు మనకు పెద్దలు ఏర్పరచిన ఆచారాలు, సంప్రదాయాల ప్రాధాన్యత తెలుసుకోగలుగుతాం. - డి.వి.ఆర్. -
కార్తీకం..ధరలు ప్రియం
డోన్‌టౌన్: కార్తీక మాసం.. భక్తులు దీక్షలు స్వీకరించే కాలం. ఈ నెలలో వ్రతాలు, పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. వనభోజనాల సందడీ కనిపిస్తుంది. ఆదివారం వచ్చిందంటే తోటలు, పార్కులు జనంతో కిటకిటలాడుతాయి. వనభోజనాల్లో అందరూ శాఖాహారమే భుజిస్తారు. దీంతో కూరగాయలకు విపరీతమైన గిరాకీ ఏర్పడుతోంది. సాధారణ రోజుల్లో కంటే ఈ కాలంలో 60 శాతానికి పైగా ధరలు పెంచేసి వీటిని విక్రయిస్తున్నారు. గత అక్టోబరు నెలలో కిలో 10రూపాయలకే లభించే వంకాయలు ప్రస్తుతం రూ. 40 పలుకుతున్నాయి. బీరకాయలు రూ.12 నుంచి రూ.40, క్యారెట్ రూ.20నుంచి రూ. 50లకు పెరిగాయి. పూలకు భలే డిమాండ్.. కార్తీక పూజలతోపాటు అయ్యప్ప భక్తులు చేసే పడి పూజలకు పూల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో బంతి, చామంతి రకాలే కాకుండా అన్నిరకాల పూలకూ డిమాండ్ రావడంతో వ్యాపారులు అమాంతం వాటి ధరలు పెంచేశారు. చామంతులు కిలో ధర రూ. 90, బంతి కిలో ధర రూ. 80 వరకూ పలుకుతున్నాయి. కొండెక్కిన ‘కొబ్బరి’ సహజంగానే కార్తీక మాసంలో కొబ్బరికాయలకు ధర పెరుగుతుంది. ఈ మాసంలో కొబ్బరి వినియోగం ఎక్కువకావడంతో కిరాణందుకాణాలలోనూ, రిటైల్ మార్కెట్లల్లోనూ వినియోగదారుని అవసరాన్ని బట్టి ధర పెంచేస్తుంటారు. గతంలో రూ. 8 ఉండే టెంకాయ.. 16 రూపాయలకు విక్రయిస్తున్నారు. అరటి పండ్లు డజను 40 రూపాయల ధర పలుకుతున్నాయి. వెలగని ‘కర్పూరం’ ప్రస్తుతం మార్కెట్లో పూజా సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భక్తులు విధిగా వినియోగించే అగరరబత్తీలు, కర్పూరం, కుంకుమ, పసుపు వంటి వాటిపై రూ.10 నుంచి రూ.20 వరకు రేట్లు పెంచారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వీటి ధరలు రెట్టింపయ్యాయని దీంతో కర్పూరాన్ని వెలిగించలేక పోతున్నామని భక్తులు పేర్కొంటున్నారు. -
కమనీయం సీతారాముల కల్యాణం
=భక్తజనసంద్రమైన జీడికల్ =హాజరైన కర్ణాటక పీఠాధిపతి మహాస్వామీజీ =తలంబ్రాలు తీసుకువచ్చిన ఎమ్మెల్యే రాజయ్య జీడికల్(లింగాలఘణపురం), న్యూస్‌లైన్ : మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరై కల్యాణ క్రతువును కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో పొంగిపోయారు. ఏడాదిలో శ్రీరామ నవమి రోజున దేశవ్యాప్తంగా శ్రీరాముని కల్యాణం నిర్వహించ డం ఆనవాయితీ. జీడికల్లో మాత్రం నవమితోపాటు కార్తీక మాసంలో బ్రహోత్సవాలు నిర్వహించడం విశేషం. యాదగిరి లక్ష్మీనరిసింహస్వామి ఆల యం నుంచి పంపిన పట్టువస్త్రాలు, తలంబ్రాలను మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఎమ్మెల్యే రాజయ్య, గ్రామ సర్పంచ్ అవ్వారు శ్యాంప్రసాద్, ఇన్చార్జ్ ఈఓ సదానందం తీసుకురాగా వేదపండితులు యాదగిరిస్వామి, బాలనర్సయ్య సీతారాముల కల్యాణం ప్రారంభించారు. రెండు గంటల పాటు 43 మంది కల్యాణ దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. జగదబిరాముడి వివాహ వేడుకను వేలాది మంది భక్తులు తిలకించి పులకించి పోయారు. హాజరైన ప్రముఖులు కల్యాణోత్సవానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన పరమహంస మహాస్వామిజీతోపాటు ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజారపు ప్రతాప్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నాగేందర్, మాజీ చైర్మన్ నాగబండి సుదర్శనం, నాయకులు మనోహర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ హేమలత తదితరులు హాజరయ్యారు. దేవాలయ సిబ్బంది అతిథులకు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సేవలు జీడికల్ జాతరలో జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలకు చెందిన 30 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సేవలు అందించారు. గర్భగుడిలో భక్తులను క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎన్సీసీ ఏఎన్‌ఓ బి.రాజయ్య, ప్రిన్సిపాల్ బాలశేఖర్, ఎస్‌యూ ఓ నవీన్, క్యాడెట్లు తిరుపతి, సాయిరాం, వెంకటేశ్, రాజు, సాగర్, రాంగోపాల్, నవీన్‌తోపాటు పలువురు భక్తుల సేవలో తరించా రు. వెంకటేశ్వర ధార్మిక మండలి భజనలు, రాత్రి హరికథా కాలక్షేపం నిర్వహిస్తున్నట్లు భజన మండలి అధ్యక్షుడు సిద్ధేశ్వర్ తెలిపారు. ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు.