జగన్నాథుడి ఎదుట కార్తీక వ్రతం
సన్నిధి
పవిత్రమైన కార్తిక మాసంలో పూజలు, నోములు, వ్రతాలతో సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. తెలుగు నేలపైనే కాదు... ఒరిస్సాలోనూ ఈ మాసంలో జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాలు అనేకం. ఈ నెలలో ఒరిస్సా ప్రాంతంలోని వయోవృద్ధ మహిళలు, వితంతువులు సామూహికంగా నెల రోజులూ కార్తీక దీక్ష నిర్వహిస్తారు. పలు ప్రాంతాల నుంచి ఒరిస్సాలోని పూరిలో నెలకొన్న జగన్నాథస్వామి ఆలయమైన శ్రీక్షేత్రానికి విచ్చేసి, గుంపులు గుంపులుగా కూడి వ్రతం ఆచరిస్తారు. ఇలా ఆచరించే కార్తీక వ్రతాన్ని స్థానికంగా ‘హబిష’గా వ్యవహరిస్తారు. వ్రతం ఆచరించే వారిని ‘హబిషియాలి’గా పేర్కొంటారు.
ప్రముఖ శైవ, వైష్ణవ క్షేత్రాలు ఈ హబిషియాలీలతో కళకళలాడతాయి. ఈ నెల పొడవునా మహా విష్ణువు, మహా శివుని తపో దీక్షతో పూజిస్తారు. వ్రతం కొనసాగే వ్యవధిలో ఒంటిపూట ఆహారం, శాకాహారం, పండ్లు ఫలాల్ని మాత్రమే స్వీకరిస్తారు. శ్రీజగన్నాథునికి నివేదించిన అన్నప్రసాదాల్ని (ఒభొడా) అతి పవిత్రంగా స్వీకరిస్తారు. ‘ఒభొడా’ అందుబాటులో లేని సందర్భాల్లో ఆకు కూరలు, కందమూలం లాంటి దుంప జాతి పదార్థాలకు ఎంపిక చేసిన పప్పుల్ని చేర్చి, కూరగా వండుకొని అన్నం స్వీకరించడం కార్తీక వ్రత ఆచరణలో భాగం. సాయంత్ర వేళల్లో సాధారణంగా పండ్లను ఆరగించి గడిపేస్తారు. వ్రత సంకల్పం మొదలు ఇంటి నుంచి దూరంగా దేవస్థానాలు, మఠాలు వగైరా ప్రాంతాల్లో బస చేసి సమష్టిగా వ్రతం జరుపుకోవడం ఆచారం.
ఈ సందర్భంగా శ్రీమందిరం సముదాయంలో కొలువు దీరిన మహాలక్ష్మి దేవస్థానం కూడా కళకళలాడుతుంది. దేవస్థానం ఆవరణలో పద్మాల ముగ్గుల్ని వేసి, నిత్య నూతనంగా తీర్చిదిద్దుతారు. మహాలక్ష్మి దేవస్థానంలో ఇలా ముగ్గులు వేసి దేవిని ప్రసన్నం చేసుకోవడంతో సౌభాగ్యం లభిస్తుందని వీరి విశ్వాసం.
తులసి కోట ఆవరణలో... కార్తీక వ్రతం ఆచరించేందుకు పలు ప్రాంతాల నుంచి చేరిన దీక్షాధారులు అక్కడక్కడ గుంపులుగా చేరతారు. వీరు తాత్కాలికంగా బస చేసే చోట తులసి కోట ఉండేలా తప్పనిసరిగా చూసుకుంటారు. తులసి కోట ముంగిల్లో వేకువ జాము నుంచి పూజాదులు నిర్వహించి, కార్తీక పురాణం పారాయణం వగైరా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హడావిడిగా ఉంటారు. నెల రోజులూ ఇదే షెడ్యూలు. వ్రతం సమయంలో పశువులు, పక్షులు మొదలైన వాటితో భంగం వాటిల్లకుండా, తులసి మొక్క పై భాగాన సంప్రదాయ డేరా (చందువా) వేస్తారు. ఇలా ఆచరించే కార్తీక వ్రతాన్నే ‘హబిష’గా వ్యవహరిస్తారు.
హబిషియాలీలకు ప్రత్యేక దర్శనం: వేలాది మహిళా భక్తులు రాష్ట్రంలో పలు చోట్ల ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీజగన్నాథుని దర్శించుకునేందుకు కార్తీక మాసంలో విశేష సంఖ్యలో యాత్రికులు విచ్చేస్తారు. హబిషియాలీల రాకతో భువనేశ్వర్‌లోని ఏకామ్ర క్షేత్రం కూడా కార్తీక మాసం నెల రోజులు కిటకిటలాడుతుంది. వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తారు.
- ఎస్.వి. రమణమూర్తి, భువనేశ్వర్