కార్తికం వనభోజనాల విశిష్ట మాసం | Kartikam Wide concrete Outstanding month | Sakshi
Sakshi News home page

కార్తికం వనభోజనాల విశిష్ట మాసం

Published Fri, Nov 7 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

కార్తికం వనభోజనాల విశిష్ట మాసం

కార్తికం వనభోజనాల విశిష్ట మాసం

ఎవరి నోట విన్నా కేశవనామాలో, శివపంచాక్షరీ జపాలో... ఏ ఇంట చూసినా మనసును ఆనంద డోలికలలో నింపే పూజలు, కనువిందు చేసే దీపాలు... నాసికాపుటాలకు సోకే సుగంధపరిమళాలు... గంధమో, కుంకుమో, విభూదో లేదా ఈ మూడూనో అలంకరించుకుని ఆధ్యాత్మికతతో, అరమోడ్చిన కన్నులతో కనిపించే భక్తులు... ఈ వాతావరణం కనపడిందీ అంటే అది కచ్చితంగా కార్తికమాసమే! అటు హరికీ, ఇటు హరుడికీ, మరోపక్క వారిద్దరి తనయుడైనా హరిహరసుతుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన మాసమిది. వనభోజనాలు, సమారాధనలు, ఉపవాసాలు, అభిషేకాలు, విష్ణుసహస్రనామ పారాయణలతో మార్మోగిపోతూ ఎంత నాస్తికుడికైనా ఆస్తికభావనలు కలుగ జేసే మాసం కార్తికమే.
 
కార్తికమాసం స్నాన, దాన, జప, ఉపవాసాలకు, దీపారాధనలకు ఎంతో ప్రశస్తమైనదని పెద్దలు చెబుతారు. అలాగే తామస గుణాన్ని పెంపొందింప చేసే ఉల్లి, వెల్లుల్లి తదితర ఆహార పదార్థాల జోలికి వెళ్లరాదని, మద్య మాంసాల ప్రసక్తి తీసుకు రాకూడదని, ద్రోహచింతన, పాపపుటాలోచనలు, దైవదూషణ పనికి రావని కార్తిక పురాణం చెబుతోంది. ఏడాది పొడుగూతా యథేచ్ఛగా ఉండే మనం ఈ ఒక్క మాసంలో అయినా అటువంటి వాటికి దూరంగా ఉంటే నష్టం లేదు కదా!  
 
వనసమారాధనతో విశిష్టఫలాలు
కారుమబ్బులు కానరాని నిర్మలమైన నింగి... ఆహ్లాదకరమైన వాతావరణం... రకరకాల సువాసనాపుష్పాలతో నిండిన పూలమొక్కల మధ్యన విందుభోజనం చేయడం కార్తికమాసం ప్రత్యేకత. తిరుపతి వెంకన్న, సింహాద్రి అప్పన్న, శ్రీశైల మల్లికార్జునుడు, వేములవాడ రాజ రాజేశ్వరుడు, కొమురవెల్లి మల్లన్న, మంగళగిరి నరసింహ స్వామి, అన్నవరం సత్యదేవుడు వెలసింది వనాలలోనే! ఈ విశిష్ఠతను గుర్తు చేసేందుకే వనభోజనం చేయడం మంచిదన్నారు పెద్దలు.  అంతేకాదు, భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

ఈ సంగతిని జనావళికి గుర్తుచేసేందుకే ఉసిరి చెట్ల కింద విస్తట్లో జరిగే విందు. శాస్త్రాన్ని, పుణ్యఫలాలను కాసేపు పక్కన ఉంచి, లౌకికంగా ఆలోచించినా వనభోజనాలు ఎంతో హితకరమైనవి. ఎందుకంటే వనాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు, కాంక్రీటు జనారణ్యాల్లోనూ, బహుళ అంతస్థుల భవనాలలోనూ చాలీ చాలని ఇరుకు గదుల్లోనూ మగ్గిపోయే పురజనులు అప్పుడప్పుడు అయినా వనాల్లోకి వచ్చి, అందరితోనూ కలసి అన్నీ మరచి హాయిగా భోజనం చేస్తే ఎంతో బాగుంటుంది కదా!
 
మన ముందు తరాలవారు ప్రతి చిన్న అనారోగ్యాలకీ మందులు మింగించేవారు కాదు... అందుబాటులోనున్న ఏ ఆకు పసరునో పిండి, వ్రణాల మీద పోసేవారు, లేదంటే ఏ మూలికనో వాసన చూపించేవారు. ఏ చెట్టుబెరడుతోనో కాచిన కషాయం తాగించేవారు. వాటివల్ల ఏ దుష్ఫలితాలూ తలెత్తకుండా ఆయా రుగ్మతలు సహజంగానే తగ్గిపోయేవి. ఇప్పుడు ఆ సంస్కృతి దాదాపుగా అంతరించింది. కొన్ని రకాల మొక్కలు, వృక్షాలను కేవలం పుస్తకాలలోనో లేదంటే అంతర్జాలంలోనో చూసి ఆనంద పడటం తప్ప వాటిని ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందడం కష్టమైంది.

అందుకోసమైనా సరే, ఈ మాసంలో పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లి, పెద్దలంతా వనభోజనాలు చేయండి. ఎందుకంటే వారికి మంచీ మర్యాదా, ప్రేమ, ఆప్యాయత, నలుగురిలో నడుచుకోవడం ఎలాగో, ఏయే పదార్థాలను ఎలా తినాలో మనం ప్రత్యేకంగా నేర్పకుండానే తెలుస్తాయి. ఇంతకీ వనభోజనాలు చేయమని పెద్దలు ఎందుకు చెప్పారంటే... పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడి వేసుకుంటుందని తెలియజేయడం కోసమే! ఈ అంతస్సూత్రాన్ని గ్రహించిన నాడు మనకు పెద్దలు ఏర్పరచిన ఆచారాలు, సంప్రదాయాల ప్రాధాన్యత తెలుసుకోగలుగుతాం.
  - డి.వి.ఆర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement