ఆనాటి ‘వెలుగులు' మళ్లీ ప్రసరించాలి..
అనంతపురం కార్పొరేషన్ : కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో అనంతపురంలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద దీపాలు వెలిగించి..నివాళులర్పించారు. విగ్రహం చుట్టూ ఉన్న రైలింగ్‌ను పూలమాలలతో అలంకరించారు. విగ్రహం వ రకు ఉన్న మెట్లపైన దీపాలు వెలిగించారు. ‘వైఎస్‌ఆర్’ అనే అక్షరాలను పూలతో అలంకరించి, వాటిపై దీపాలు ఉంచారు.
అనంతరం మహిళలకు కుంకుమ, పసుపు, పండ్లు, గాజులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్రతియేటా కార్తీక మాసం చివరి సోమవారం వైఎస్ విగ్రహం వద్ద దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్‌కు మహిళలంటే ఎనలేని గౌరవం ఉండేదన్నారు. ప్రతి మహిళా లక్షాధికారి కావాలని కోరుకునేవారన్నారు.
ఆయన మన మధ్యలేకపోయినా ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సరోజమ్మ, పార్టీ మహిళా విభాగం నాయకులు నాగలక్ష్మి, సరస్వతి, ప్రమీల, ఎ.ప్రమీల, బి.ప్రమీల, దేవి, హేమ, కుళ్లాయమ్మ, అరుణ, లక్ష్మిదేవి, సునీత, కామాక్షమ్మ, కమలమ్మ పాల్గొన్నారు.