సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాను అడ్డుకుని, అక్రమాన్ని బయటపెట్టిన పోలీసు అధికారికి పదోన్నతి రాకపోయినా గుర్తింపు, ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. కబ్జాకోరులపై తన అనుమతి లేకుండా చర్యలు ఎలా తీసుకుంటావంటూ సదరు ఇన్‌స్పెక్టర్‌పై ఓ ఎమ్మెల్యే కస్సుమన్నారు. పట్టుబట్టి మరీ ఆ అధికారిని బదిలీ చేయించారు. వెస్ట్‌జోన్‌లోని ఓ ఠాణాలో పోస్టింగ్ ఇచ్చిన మూడు నెలలు కూడా కాకుండానే ఉన్నతాధికారులు ఆయన్ను బదిలీ చేశారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే.. కబ్జా అంశంపై కేసు నమోదు, దర్యాప్తు, అరెస్టులు ప్రతిదీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరగటం.
సమర్థుడిగా గుర్తింపు ఉండటంతోనే పోస్టింగ్...
అత్యంత ప్రముఖులు నివసించే, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పశ్చిమ మండలంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఏప్రిల్ 2న జరిగిన రేవ్ పార్టీ తీవ్ర కలకలం సృష్టించింది. ఆ సందర్భంలో స్థానిక ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారులు ఆ స్థానంలో సమర్థుడిగా గుర్తింపు ఉన్న అధికారిని నియమించారు. ఈ నియామకానికి ముందే ఉన్నతాధికారులు సదరు అధికారి వ్యవహారశైలి, పనితీరు తదితరాలను పరిగణనలోకి తీసుకున్నారు.
కబ్జా కేసుతో విభేదాలు..
పశ్చిమ మండలంలో ఉన్న రూ.40 కోట్ల విలువైన స్థలం కబ్జా వ్యవహారం గత నెలలో వెలుగులోకి వచ్చింది. దీనిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు, బోగస్ వ్యక్తులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలా ఆ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందారు. బాధితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్సీ వారికి అండగా నిలిచారు. కబ్జా పర్వాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
వారి ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఆద్యంతం అన్ని అంశాలను సదరు ఇన్‌స్పెక్టర్ పరిశీలించి.. కబ్జా నిజమేనని తేల్చారు. అడ్డా కూలీలను స్థల యజమానులుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఈ వివరాలు ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి, వారు అనుమతించిన తర్వాతే నిందితులను అరెస్టు చేశారు. మొత్తం 16 మంది నిందితులుగా ఉండగా అయిదుగురిని కటకటాల్లోకి పంపారు.
అనుమతి రద్దు చేసిన జీహెచ్‌ఎంసీ...
పశ్చిమ మండల పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, అరెస్టు చేసిన నిందితుల వివరాలు పరిగణనలోకి తీసుకున్న జీహెచ్‌ఎంసీ అంతర్గత విచారణ జరిపింది. ఇందులో అసలు విషయం తేలడంతో సదరు నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఈ విషయాన్ని కబ్జాకోరుల ద్వారా తెలుసుకున్న నగర ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. తనకు తెలియకుండా కబ్జాపై కేసు ఎలా నమోదు చేస్తారని, అరెస్టుల వరకు ఎలా వెళ్తారంటూ సదరు ఇన్‌స్పెక్టర్‌పై రంకెలు వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, తనకు లభించిన ఆధారాలను బట్టే ముందుకు వెళ్లానంటూ సదరు ఇన్‌స్పెక్టర్ చెప్పడాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేక అతడిని బదిలీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు.
చేతులెత్తేసిన ఉన్నతాధికారులు...
ఓ దశలో ఈ విషయం రాష్ట్రంలోనే కీలక కార్యాలయం వరకు వెళ్లింది. అక్కడి అత్యున్నత అధికారులు జరిగిన అంశంపై నివేదిక కోరారు. ఆద్యంతం ప్రతి అంశాన్నీ వివరిస్తూ నగర పోలీసులు రిపోర్టు కూడా సమర్పించారు. దీన్ని పరిశీలించిన ఆ కీలక కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్ తప్పులేదని భావించింది. అయినప్పటికీ ఎమ్మెల్యే ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ను బదిలీ చేయించారు. కబ్జాపై కేసు, దర్యాప్తు, అరెస్టుకు ఆదేశించిన ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఎమ్మెల్యే ఒత్తిడి తట్టుకోలేక సదరు ఇన్‌స్పెక్టర్‌ను బదిలీ చేస్తూ మరో పోలీసుస్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా నియమించారు.
నగరంలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ..
నగర కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఎం.నరేందర్‌ను బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు. ఇక్కడ ఉన్న కె.నాగేశ్వర్‌రావుకు మారేడ్‌పల్లి ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ ఎం.మట్టయ్యను సీసీఎస్‌కు మార్చారు.
(చదవండి: ఫారిన్ ట్రేడింగ్ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం)
Comments
Please login to add a commentAdd a comment