రామమూర్తి గొమాంగో
భువనేశ్వర్: భార్య హత్య కేసులో మాజీ ఎమ్మెల్యేకు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. స్థానిక ప్రత్యేక తృతీయ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కమ్ ఎంపీ/ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ తీర్పు వెల్లడించింది. రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామమూర్తి గొమాంగో ఈ కేసులో నిందితుడు. 11 మంది సాక్షుల వాంగ్మూలాలు, 15 పత్రాలను పరిశీలించిన మేరకు ఈనెల 24వ తేదీన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఆయన భార్య శశిరేఖ అనుమానస్పద మృతి కేసులో దోషిగా ఆయనను నిర్ధారించారు.
ఇదీ విషయం...
అప్పట్లో స్థానిక ఖారవేళ నగర్ ఎమ్మెల్యే కాలనీలోని ప్రభుత్వ వసతి భవనం బాత్‌రూమ్‌లో ఎమ్మెల్యే భార్య సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 1995 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన ఈ విచారకర సంఘటన చోటు చేసుకుంది. అప్పటికి ఆమె 4 నెలల గర్భవతిగా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడి మరణించినట్లు ప్రకటించడంతో తొలుత అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత హత్య కేసుగా ధ్రువీకరించారు. ఎమ్మెల్యే ఆమెని చంపేసినట్లు ఖారవేళ నగర్ ఠాణాలో ఫిర్యాదు దాఖలు చేయడంతో కేసు విచారణ మలుపు తిరిగింది. గొమాంగో తన భార్యను హత్య చేసి, ఆమె శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసినట్లు ప్రాసిక్యూషన్‌లో నిరూపించబడింది.
శిక్ష వివరాలు
నిందిత మాజీ ఎమ్మెల్యే రామమూర్తి గొమాంగో కోర్టులో హాజరైన తర్వాత న్యాయస్థానం శిక్ష వివరాలను ప్రకటించింది. సెక్షన్ 302 కింద యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది శిక్ష విధించింది. సాక్ష్యాధారాల గల్లంతు, రద్దు చేసిన నేరం రుజువు కావడంతో 201 సెక్షన్ కింద రూ.10 వేల జరిమానా, జరిమానా జమ చేయని పక్షంలో 6 నెలల శిక్షని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ప్రకటించింది.
రామమూర్తి రాజకీయ నేపథ్యం
1995లో గుణుపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జనతాదళ్ టికెట్‌పై ఎన్నికై న రామమూర్తి గొమాంగో 2000 సంవత్సరంలో బీజేపీలో చేరారు. 2000లో గుణుపూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేసి, 30 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో తిరిగి ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికలలో అతను తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి హేమా గొమాంగోపై 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2009లో బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ కూటమి కుప్పకూలడంతో బీజేపీ నుంచి దూరం అయ్యారు. అయితే 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో గుణుపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు బీజేడీ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన తిరిగి బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment