
‘మహా’ బెదురు
బాబోయ్... ఈ డ్యూటీలు చేయలేం
- ప్రత్యామ్నాయం వైపు 22 మంది సీఐల చూపు
- అసెంబ్లీ సమావేశాల తరువాత మరో 20 మంది సిక్ లీవ్?
- వసూళ్లను కమిషనర్ నియంత్రించడమే కారణం
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో పోలీస్ ఉద్యోగమంటే ఆ మజానే వేరు. జీతంతో పాటు గీతమూ బాగానే ఉండేది. ఇక్కడ పని చేయడమంటే అదృష్టం ఉండాలనేది పోలీసు వర్గాల మాట.
లా అండ్ ఆర్డర్ స్టేషన్ హౌస్‌ఆఫీసర్ (ఎస్‌హెచ్ ఓ)గా పోస్టింగ్ తెచ్చుకునేందుకు కొందరు ఇన్‌స్పెక్టర్లు తీవ్ర కసరత్తే చేసేవారు. భారీ స్థాయిలో పోటీ ఉండేది. దీనికి ఖద్దర్ సిఫారసుతో పాటు రూ.లక్షలు వెచ్చించేందుకు ముందుకొచ్చేవారు. కొన్ని సందర్భాలలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చు చేసిన వారూ ఉన్నారు. నగరంలో ఎస్‌హెచ్‌ఓగా పని చేసేందుకు ఏళ్ల తరబడి ‘క్యూ’లో ఉన్న ఇన్‌స్పెక్టర్ల సంఖ్యా తక్కువేం కాదు. రాజకీయ పలుకుబడి, డబ్బు, ఇతరత్రా అండదండలు ఉన్న వారికే పోస్టింగ్‌లు వచ్చేవి. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది.
ఎస్‌హెచ్‌ఓ పోస్టు అంటేనే కొందరు ఇన్‌స్పెక్టర్లు భయపడుతున్నారు. పలుకుబడి, డబ్బు, రాజకీయ అండదండల వంటివి లేని వారికి సైతం నగరంలో ఎస్‌హెచ్‌ఓ పోస్టింగ్ ఇస్తామన్నా ‘మేం రాలేం మహాప్రభో’ అంటున్నారు. ఒకప్పుడు నగరంలో ఎలాగైనా స్థానం సంపాదించాలని ఆశించిన వారు ప్రస్తుతం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి బయట పడాలని చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ‘మామూలు’గా వచ్చే ఆదాయం కోల్పోవడమేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గత మూడు నెలలుగా ఠాణాల పరిధిలో నెలవారీ మామూళ్లు, కలె క్షన్లు బంద్ చేయించారు.
ఇప్పటికే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లకు చెందిన సుమారు 80 మంది కలెక్షన్ కింగ్‌లపై కమిషనర్ బదిలీ వేటు వేశారు. ఇప్పటికీ వారికి పోస్టులు ఇవ్వలేదు. మరోపక్క ఠాణాలో ఎవరైనా ఒక్క పైసా వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. మామూళ్ల తంతుపై ఠాణాలపై స్పెషల్ బ్రాంచ్‌తో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు డేగ కన్నేశారు. ఫిర్యాదుదారుల నుంచి నయాపైసా ఆశించకుండా సిబ్బంది పనితీరుపై బాధితుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే విధానం అమలు చేశారు.
ఎప్పుడూ మామూళ్ల కనకవర్షంతో తడి సిముద్దయ్యే లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగంలోని ఇన్‌స్పెక్టర్లు ఒక్కసారిగా వచ్చిన ‘మార్పు’తో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నేర రహిత నగరంగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్, సేఫ్ కాలనీ ప్రాజెక్ట్, ఠాణాలో రిసెప్షనిన్ వ్యవస్థ, పనితీరుపై రోజువారీ అప్రయిజల్ రిపోర్టు రాయడం, స్నాచింగ్‌లు, దొంగతనాలు జరగకుండా గస్తీని పెంచడం, కంప్యూటర్ పరిజ్ఞానం కోసం సిబ్బందికి తరగతులు నిర్వహించడం...ఇలా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు పనిభారం పెరిగింది. బయటి ఆదాయం తగ్గడంతో పాటు పనిభారం పెరగడాన్ని కొంతమంది ఇన్‌స్పెక్టర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో సుమారు 22 మంది ఇన్‌స్పెక్టర్లు లూప్‌లైన్ (ఇంటెలిజెన్స్, ఎస్బీ, జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కో, విజిలెన్స్ విభాగాలు)కు వెళ్లిపోతామని భీష్మించుకు కూర్చుకున్నారు. దీనికోసం ఇప్పటికే దరఖాస్తు చేశారు. మరికొందరు ఇన్‌స్పెక్టర్లు అసెంబ్లీ బందోబస్తు పూర్తయిన తరువాత ఏకంగా సిక్ లీవ్ పేరిట దీర్ఘకాలిక సెలవులో వెళ్లడానికి సిద్దపడుతున్నారు. గత మూడు నెలలుగా పోలీసు కమిషనర్ తీసుకున్న చర్యలతో చాలా స్టేషన్లకు ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. దీనిపై సామాన్యులు హర్షిస్తుండగా... ఇన్నాళ్లూ మామూళ్ల మత్తులో గడిపిన ఇన్‌స్పెక్టర్లు తట్టుకలేకపోతున్నారు.
ఇదీ లెక్క..
నగరంలో 60 శాంతిభద్రతల ఠాణాలు, 3 మహిళా పోలీసు స్టేషన్‌లు, 25 ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లు ఉన్నాయి. వీటిలో మామూళ్లలో మొదటి స్థానంలో ఉన్న ఠాణాల వివరాలు ఇవీ..
వెస్ట్‌జోన్: ఎస్‌ఆర్‌నగర్, పంజగుట్ట, బంజారాహిల్స్,
నార్త్‌జోన్: బోయిన్‌పల్లి, బేగంపేట,
ఈస్ట్‌జోన్: కాచిగూడ, చాదర్‌ఘాట్, సుల్తాన్‌బజార్,
సెంట్రల్‌జోన్: నారాయణగూడ, సైఫాబాద్, చిక్కడపల్లి,
సౌత్‌జోన్: చాంద్రాయణగుట్ట, బహ దూర్‌పురా, ఛత్రినాక