
పోలీస్ శాఖలో ప్రమోషన్ల వివాదం!
- నూతన జిల్లాల నేపథ్యంలో అడ్‌హాక్ ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయం
- ఇప్పటికే పదోన్నతుల కోసం ఇచ్చిన జీవోలు 54, 108 వివాదాస్పదం
- ఐదో జోన్ 1991 బ్యాచ్ ఎస్సైలకు కలవని నోషనల్ ఇంక్రిమెంట్
- నిరసనగా మూకుమ్మడి సెలవులకు సిద్ధమవుతున్న 200 మంది ఇన్‌స్పెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో పదోన్నతులు వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో జరిగిన పదోన్నతుల విషయంలో ఇప్పటికీ న్యాయస్థానంలో కేసులు కొనసాగుతున్నాయి. తాజాగా కొత్త జిల్లాల నేపథ్యంలో అడ్‌హాక్ పేరిట ఇవ్వనున్న పదోన్నతులు అగ్నికి ఆజ్యం పోసినట్లవుతున్నాయి. రాష్ట్ర విభజన పూర్తయి దాదాపు రెండున్నరేళ్లు గడిచినా ఇంకా సిబ్బంది నియామకాలు పూర్తి కాలేదు. కమలనాథన్ కమిటీ తుది కేటాయింపులు జరపకపోవడంతో ఇప్పటికీ కొంత మంది ఏపీకి చెందిన అధికారులు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అడహక్ పేరిట ఇవ్వనున్న పదోన్నతులు ఏపీకి చెందిన వారికి కూడా దక్కనుండటంతో తెలంగాణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పదోన్నతులకు సంబంధించి జీవోలు 54, 108లలో దొర్లిన తప్పుల కారణంగా చాలా మందికి అన్యాయం జరిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంలో ఐదో జోన్‌కు చెందిన 1991, 95 బ్యాచ్‌లకు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని నిపుణుల కమిటీ తేల్చింది. దీనిపై ఐదేళ్లుగా పోరాడుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ఐదో జోన్‌కు చెందిన దాదాపు 200 మంది పోలీసు అధికారులు మూకుమ్మడి సెలవులు పెట్టాలని యోచిస్తున్నారు.
నాలుగేళ్ల సర్వీసును విస్మరించారు
ఐదో జోన్‌కు చెందిన ఎస్సైలకు 1991 బ్యాచ్‌కు చెందిన వేరే జోన్లకు చెందిన వారితో పాటు నాలుగేళ్ల సీనియారిటీ కలవలేదు. దీంతో ఒకే బ్యాచ్‌కు చెందిన వారి బదిలీలో తేడా ఏర్పడింది. 1991 బ్యాచ్‌కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్లు 15 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇన్‌స్పెక్టర్ హోదాలోనే కొనసాగుతున్నారు. ఆరో జోన్‌కు చెందిన ఎస్సైలు మాత్రం ప్రస్తుతం డీఎస్పీ, ఏఎస్పీలుగా కొనసాగుతున్నారు. దీనిపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా వారికి అనుకూలమైన తీర్పు వచ్చింది. దీంతో జరిగిన తప్పును సరిదిద్దేందుకు డీజీపీ అనురాగ్ శర్మ, అప్పటి వరంగల్ డీఐజీ కాంతారావు నేతృత్వంలో కమిటీ వేశారు. నాలుగేళ్ల నోషనల్ ఇంక్రిమెంట్ కలవలేదని డీఐజీ కూడా నివేదిక ఇచ్చారు. అయినా ఇప్పటికీ 1991కి చెందిన ఐదో జోన్ ఎస్సైలకు న్యాయం జరగలేదు. ప్రస్తుతం జోన్ విధానాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం యోచిస్తున్నందున ఇప్పుడు న్యాయం జరగకపోతే తీవ్రంగా నష్టపోతామంటూ ఆందోళన చెందుతున్నారు.