
ఎన్ఆర్ఐపై దాడి: ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్
ముషీరాబాద్: ప్రవాస భారతీయుడిపై ముషీరాబాద్ పోలీసులు దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఇద్దరు ఎస్సై లతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల మహేంద్ర హిల్స్ కు చెందిన మల్లాపురం వాసుపై ముషీరాబాద్ పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన డీసీపీ కమాలాసన్ రెడ్డి.. ఆ ఘటనకు కారణమైన ఇద్దరు ఎస్సైలను, ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు.
ఈనెల 25న ముషీరాబాద్‌కు చెందిన తన స్నేహితులు ప్రీతమ్, నిఖిల్‌లతో కలిసి కోఠిలో ఓ హోటల్‌లో మద్యం తాగిన అనంతరం వారిని దింపేందుకు ముషీరాబాద్ అనూషా అపార్ట్ మెంట్ కు వెళ్లిన వాసు అనే ఎన్ఆర్ఐ కారును పక్కగా ఆపి స్నేహితులతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది అర్ధరాత్రి రోడ్డుపై ఏమి చేస్తున్నారంటూ దాడికి దిగినట్లు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. దీనిపై ప్రశ్నించడంతో పోలీసులకే ఎదురు చెప్తారా? తమను స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టినట్లు తెలిపా రు. అనంతరం సీఐ దగ్గరకు తీసుకెళ్లగా అతను తమను దారుణంగా అవమానించడమేగాక, తమ ఫోన్లు లాక్కున్నారని, రూ. రూ.5 లక్షలు ఇస్తే వదిలి వేస్తానని, లేనిచో పాస్‌పోర్టులు సీజ్ చేస్తానని బెదిరించినట్లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు. దీంతో హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు డీసీపీ కమాలాసన్ రెడ్డి దర్యాప్తు చేయించారు. ఆ ఘటనకు కారణమైన ఇద్దరు ఎస్సైలను, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.