బాన్సువాడ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ పడిపోయిన బిల్లులను ఇక చెల్లించనున్నారు. పది నెలలుగా బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో చాలావరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. కొంతమంది అప్పు చేసి ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగించారు. కాగా ఇటీవల గృహ నిర్మాణ శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి ఆన్‌లైన్ చెల్లింపులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిధులను సైతం విడుదల చేయడంతో గృహ నిర్మాణదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ పథకం కింది జిల్లాలో సుమా రు 1.57లక్షల మంది లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వివిధ దశల్లో నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
జిల్లాకు మూడు విడతల్లో 2,41,992 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,57,824 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే 84,168 ఇళ్లు ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. మరో 6,956 ఇళ్లు ప్రాథమిక స్థాయిలో ఉండగా, 15,390 ఇళ్లు బేస్మిట్ లేవల్‌లో, 1,689 ఇళ్లు లెంటల్ లెవల్లో , రూఫ్ లెవల్‌లో 5,398 ఇళ్లు ఉన్నాయి. మరో 29,433 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొన్నాయి. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 1,28,391 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన జిల్లాలో 53 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం బిల్లుల చెల్లింపు పున:ప్రారంభమవడంతో గృహ నిర్మాణ అధికారులు ఇంటి నిర్మాణాన్ని బట్టి లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
లే అవుట్ ఉంటేనే ..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించబోయే ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపికలో అనేక నిబంధనలు వర్తించేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో విచ్చలవిడిగా అవినీతి జరగడం, ఒకే ఇంటికి ఐదు నుంచి 10 ఇళ్ల రుణాలు పొందడం లాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అలాంటి అవకతవకలకు తావులేకుండా, లేఅవుట్ ప్లాట్లు ఉన్న వారికే ఇళ్ల రుణాలు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నిరుపేదలకు ఇళ్లను ఇకపై ప్రత్యేకంగా లేఅవుట్‌లు ఉన్న చోటనే నిర్మించాలని నిర్ణయించారు. లేఅవుట్ స్థలం ఉన్న నిరుపేదలను ఎంపిక చేసి వారికి రూ. 3.50 లక్షలతో ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో రెండంతస్తుల భవనాల వారూ ఇందిరమ్మ పథకం ద్వారా నిధులు పొందగా, ప్రస్తుతం వాటిని గుర్తించడం కష్టంగా మారింది.
ఇప్పుడలా జరగకుండా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా, అర్హులను గుర్తించనున్నారు. లేఅవుట్ కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తే అక్కడ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు కల్పించ వచ్చని, దీంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్‌రూం, హాలు, కిచెన్‌కు రూ.3.50 లక్షలు సరి పోవని, రూ.4.60 లక్షల వరకు వ్యయం అవుతుందని గృహనిర్మాణ సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే లబ్ధిదారుడు నేరుగా ఇల్లు నిర్మించుకుంటే రూ.3.50 లక్షలు ఇవ్వవచ్చని వారు అంటున్నారు.
ప్రభుత్వం తరపున నిర్మిస్తే 14 శాతం కాంట్రాక్టర్ లాభం, 5 శాతం వ్యాట్, 2 శాతం ఆదాయపు పన్ను, మైనిం గ్ పన్ను 5 శాతం, కార్మిక సెస్ 5 శాతం, పర్యవేక్షణ చార్జీలు 7 శాతం కలిపి సుమారు 30 శాతం వ్యయం అదనంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుడు నేరుగా నిర్మించుకొంటే ఈ అదనపు భారం తప్పుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రూ.3.5 లక్షల చొప్పున బిల్లులు చెల్లిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు గంపెడాశతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తారా? లేదా గత మార్చిలో దరఖాస్తు చేసుకొన్న వారికి సైతం వర్తిం పజేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఈ పథకంలోని విధి విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
నిలిచిన ఇళ్ల నిర్మాణాలు
పదినెలలుగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, సామిల్స్ వ్యాపారులపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఒకవైపు నిర్మాణ దారులు బిల్లులు లేక పనులను ఆపేస్తుండగా, మరోవైపు సంబంధింత వ్యాపారులు అప్పులు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు.ఈసారి ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గడంతో కూలీలకు చేతినిండా పని లేకపోయింది. ఇంటి నిర్మాణాల్లో కూలీ పనులు చేసుకోవాలనుకున్నా, ఇక్కడా వారికి పని దొకరడం లేదు. వెరసి కూలీలు వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం!
Published Wed, Jan 14 2015 11:20 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement