మోడల్ హౌజ్ ప్రారంభమెప్పుడో ?
బేల: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రక్కన 2013 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించిన మోడల్ హౌజ్ నేటికి ప్రారంభానికి నోచుకోవడం లేదు. దాదాపు భవనం పనులు పూర్తి అయినప్పటికి అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది. ఈ భవనానికి తలుపులు, కిటికిలు బిగింపు సైతం పూర్తి అయింది. కేవలం వైట్‌వాష్ వేసేస్తే మోడల్ హౌజ్ పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పటికి, దీన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది.
2013సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రూ.2.50 లక్షల వ్యయంతో మండల కేంద్రంలో ఒక మోడల్ హౌజ్ నిర్మించడానికి నిధులు విడుదల చేసింది. మండల కేంద్రంలో ఇలా ఏర్పాటు చేసిన మోడల్ హౌజ్ నమూనాతో మండల వాసులు ఇందిరమ్మ గృహలను నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా కొద్దిపాటి పనులతో ఈ మోడల్ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఈ అసంపూర్తి భవన నిర్మాణ పనులు పూర్తి చేయించి ప్రారంభిస్తే మండల కేంద్రంలో పనిచేసే సంబంధిత అధికారులకు మరో నూతన కార్యాలయం అందుబాటులోకి వస్తుందని మండలవాసులు అంటున్నారు.