బీర్కూర్, న్యూస్‌లైన్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా అధికారులు ఏం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా తహశీల్ కార్యాలయాన్ని సందర్శించి, ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం ఎంతవరకు వచ్చిందని ఉపాధి హామీ అధికారులను ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పొతంగల్ గ్రామం నుంచి బీర్కూర్ గ్రామానికి రాగా, రోడ్లు అధ్వానంగా ఉండడంతో స్థానిక తహశీల్దార్ అంజ య్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోడ్లు ఇలా ఉం టే వాహనాలు ఎలా వస్తాయన్నారు.
వారంలో ఒకరోజు ‘ఇందిరమ్మ ఇళ్ల’కు ఇసుక
మండలంలోని బరంగేడ్గి గ్రామం నుంచి రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్థానిక తహశీల్దార్‌ను పిలిపించి, ఇసుక రవాణా జరుగుతుంటే పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే ట్రాక్టర్లు సీజ్ చేయాలని ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వారంలో ఒక రోజు ఇసుక తీసుకువెళ్లడానికి అనుమతులు మంజూరు చేయాలని అన్నారు.
దోషులను గుర్తించారా...?
మండలంలోని బరంగేడ్గి గ్రామంలోని పాఠశాలలో విషపు గుళికలు కలిపిన సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించారా అని ఎంఈఓ గోపాల్‌రావును కలెక్టర్ ప్రద్యుమ్న ప్రశ్నించారు. దీనిపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారని ఎంఈఓ బదులిచ్చారు. అనంతరం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీ లించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదా రులతో మాట్లాడారు.
ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు
తిమ్మాపూర్ గ్రామంలో ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య పని తీరు సరిగా లేదని, బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని పలువురు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని విధుల నుంచి తొలగించి, మరొకరిని నియమించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు ఏం చేస్తున్నారు?
Published Wed, Nov 20 2013 4:39 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement