సాక్షి ప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా బచ్చన్నపేటలో హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య (70) కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్ ఆయ నను అపహరించి, హత్య చేసిందని.. క్వారీ నీటి గుంటలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయిందని గుర్తించారు. భూముల వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేత, జనగామ జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త అంజయ్య ఈ హత్య కు సూత్రధారి అని తేల్చారు.
ఈ మేరకు బచ్చన్నపేట, టా స్క్‌ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితుడు గిరబోయిన అంజయ్య, సుపారీ ముఠా సభ్యులు డోలకొండ శ్రీకాంత్, శివ రాత్రి బాషా అలియాస్ భాస్కర్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, 3 సెల్‌ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ఇప్పటికే ఓసారి చంపేందుకు యత్నించి..: అంజయ్య కు సంబంధించి సర్వే నంబర్ 174లోని భూములపై వివా దాలు ఉన్నాయి. దీనిపై రామకృష్ణయ్య గతంలో అధికారు లకు ఫిర్యాదు చేశారు. దీనిపై కక్షగట్టిన అంజయ్య.. రామకృష్ణయ్యను హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. 2022 జూలైలో జలంధర్ అనే వ్యక్తితో కలసి కారుతో ఢీకొట్టి చంపేందుకు విఫలయత్నం చేశాడు. ఇటీవల తనకు పరిచయమున్న దండుగు ల తిరుపతి అనే వ్యక్తితో రూ.8 లక్షలు సుపారీ ఇస్తానని, రా మకృష్ణయ్యను చంపాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీ నికి అంగీకరించిన తిరుపతి.. తనకు సమీప బంధువులైన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, దండుగుల రాజులతో కలసి రామకృష్ణయ్య హత్యకు ప్లాన్ చేశాడు.
పోచన్నపేట శివారులో కిడ్నాప్ చేసి..: తిరుపతి, శ్రీకాంత్, బాషా, దండుగుల రాజు నలుగురూ కలసి ఈ నెల 15న సాయంత్రం ఒక కారు అద్దెకు తీసుకుని పోచన్నపేట శివారులో మాటు వేశారు. బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్న రామకృష్ణయ్యను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని, చిన్నరామన్చర్ల శివారుకు తీసుకువెళ్లారు. సుమారు 6.30 గంటల సమయంలో టవల్ మెడకు బిగించి రామకృష్ణయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని.. ఓబూల్ కేశ్వాపూర్, పెద్దపహాడ్‌ల మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడి ఓ క్వారీ నీటిగుంటలో పడవేశారు. హత్య జరిగే నాటికి అంజయ్య ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా రూ.2 లక్షల వరకు నిందితులకు ముట్టజెప్పాడు.
ఒకటి కాదు రెండు హత్యలు!: రామకృష్ణయ్య హత్యకేసులో విచారణ జరుపుతున్న క్రమంలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చిందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అంజయ్య మరో భూవివాదంలో రూ. 2.5 లక్షల సుపారీ ఇచ్చి తన బావమరిది మల్లేశం భార్య సుభద్రను హత్య చేయించినట్టు వెల్లడైందని వివరించారు. 2022 అక్టోబర్ 20న ఆ హత్య జరిగిందని, ఆ ఘటనలోనూ తిరుపతి, రాజు హస్తం ఉన్నట్టు గుర్తించామన్నారు. 2012లో సుభద్ర భర్త మల్లేశం చనిపోయాడని.. తనకు రెండెకరాల భూమి రావాలని సుభద్ర నిలదీయడంతో అంజయ్య సుపా రి గ్యాంగ్‌తో హత్య చేయించాడని సీపీ వెల్లడించారు.
బీఆర్‌ఎస్ నుంచి అంజయ్య సస్పెన్షన్
భూవివాదాలు, హత్య కేసు నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకుడు గిరబోయిన అంజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ మండలాధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ప్రకటించారు. అంజయ్య తొలి నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్త కాదని, నాలుగేళ్ల కింద వేరే పార్టీ నుంచి వచ్చాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment