ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రెండు పడక గదుల ఇళ్లను పేదలకు అందివ్వని ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. అసలు చెల్లించే యోచన ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, డీకే అరుణ ఆరోపణలు ప్రత్యారోప ణలు చేసుకోవడంతో పరిస్థితి కాస్త వేడెక్కింది.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో డీకే అరుణ మాట్లాడుతుండగా సభలోకి వచ్చిన హరీశ్ రావు కాసేపు వేచి ఉండి.. ఆమె ప్రశ్న అడక్కుండా ఏదేదో మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. దీంతో డీకే అరుణ ఆగ్రహానికి గురయ్యారు. ‘ఆయన సభలోకి రాగానే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు. నేను నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నా మాటలకు అడ్డు తగలాల్సిన అవసరమేముంది. హామీ ఇచ్చినట్టుగా ఇళ్లు కట్టకుంటే ప్రశ్నించొద్దా, అసలు బిల్లులు చెల్లించే ఉద్దేశం ఉందా లేదా’ అని ప్రశ్నించారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కది ద్దారు.