సాక్షి, అమరావతి: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంస్కరణలు ఎంతో స్ఫూర్తిదాయకమని, తమ రాష్ట్రాల్లో అమలుకు అవి మార్గదర్శకంగా ఉన్నాయని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసించారు. విద్యారంగ అభివృద్ధి కోసం పనిచేస్తున్న అనేక ప్రఖ్యాత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు, నిపుణులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలను శనివారం సందర్శించారు.
అనంతరం విద్యా శాఖ ఉన్నతాధికారులతో సంభాషించారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ రాష్ట్రంలో అమలవుతున్న విద్యా పథకాల గురించి ఈ బృందానికి వివరించారు. సీఎం వైఎస్ జగన్.. విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ.. జగనన్న అమ్మఒడి, మన బడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతులు, బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు, సీబీఎస్‌ఈ సిలబస్, ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ తదితర కార్యక్రమాల ద్వారా విద్యా రంగాన్ని పటిష్టం చేశారని చెప్పారు.
ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము సందర్శించిన పాఠశాలలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంసించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, సంతోషకరమైన అభ్యాస వాతావరణం, మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్, ఉపాధ్యాయుల సృజనాత్మకత, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, టీచర్ మెంటార్‌లు వినియోగిస్తున్న ‘టీచ్ టూల్’, బోధన అభ్యాస పద్ధతులు, కొత్త యాప్లు.. తదితర కార్యక్రమాలన్నీ బాగున్నాయని మెచ్చుకున్నారు. ఇవన్నీ తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి స్ఫూర్తిగా ఉన్నాయని చెప్పారు.
విద్యా రంగ ప్రముఖుల బృందం ఇదీ..
కృష్ణా జిల్లా కోలవెన్ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పునాదిపాడు, ఈడుపుగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎన్టీఆర్ జిల్లాలోని పటమట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను విద్యా రంగ ప్రముఖుల బృందం సందర్శించింది.
ఈ బృందంలో రతీ ఫోర్బ్స్ (డైరెక్టర్ ఫోర్బ్స్ మార్షల్ లిమిటెడ్), వివేక్ రాఘవన్ (ట్రస్టీ, ఆర్జీ మనుధనే ఫౌండేషన్ సీఈఓ ప్రెసిడెంట్, ఎయిర్‌వైన్ సైంటిఫిక్), నీలేష్ నిమ్కర్ (ఫౌండర్ ట్రస్టీ, క్వెస్ట్), కవితా ఆనంద్ (విద్యాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు), మురుగన్ వాసుదేవన్ (సీఈఓ, లెట్స్ డ్రీమ్ ఫౌండేషన్, మాజీహెడ్, సోషల్ ఇన్నోవేషన్, సిస్కో ఇండియా దక్షిణాసియా), మినాల్ కరణ్వాల్ (సబ్డివిజనల్ మేజిస్ట్రేట్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, నందుర్‌బార్, మహారాష్ట్ర), ఆకాంక్ష గులాటి (డైరెక్టర్, యాక్ట్ గ్రాంట్స్), ప్రాచీ విన్లాస్ (మైఖేల్ సుసాన్ డెల్ ఫౌండేషన్, డైరెక్టర్, ఇండియా), తరుణ్ చెరుకూరి (సీఈఓ, ఇండస్ యాక్షన్), స్నేహ మీనన్(క్యాటలిటిక్ ఫిలాంత్రోపీ, దస్రా) తదితరులు ఉన్నారు.
ఏపీలో విద్యా సంస్కరణలు భేష్
Published Sun, Feb 5 2023 6:19 AM | Last Updated on Sun, Feb 5 2023 7:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment