సాక్షి,బెంగళూరు: రాబోయే విద్యా ఏడాది (2014-15)కి ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్-ఆర్టీఈ) కింద ప్రవేశ ప్రక్రియ వచ్చేనెల 6 నుంచి ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది ఈ చట్టం కింద ఎల్‌కేజీ, ఒకటో తరగతికి అర్హులైన పిల్లలకు ప్రవేశం కల్పించనున్నారు. అల్పాదాయ, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆర్టీఈ చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు ఆయా తరగతిలోని మొత్తం సీట్లలో 25 శాతాన్ని ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కచ్చితంగా కేటాయించాల్సిందే.
ఈ క్రమంలో వచ్చే ఏడాది ఆర్టీఈ క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అధికారికంగా అందుబాటులో ఉంచింది. ఇందులోని వివరాల ప్రకారం.... జనవరి 6న ప్రతి బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయంలో స్థానిక విద్యా సంస్థల్లో ఆర్టీఈ కింద అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు నోటీసు బోర్డులో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులు సంబంధిత పాఠశాలలో కాని లేదా బీఈఓ కార్యాలయాల్లో ఉచితంగా పొందవచ్చు. జన వరి 7 నుంచి ఫిబ్రవరి 8 తేదీల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చదలిచిన పాఠశాలలో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది.
వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఆ వివరాలను స్థానిక బీఈవో అధికారుల విద్యాసంస్థల యాజమాన్యం ఫిబ్రవరి 17లోపు అందజే యాల్సి ఉంటుంది. సదరు బీఈవో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తుది జాబితాను కార్యాలయంతో పాటు విద్యా సంస్థల నోటీసు బోర్డులో అదేనెల 28న పెట్టాల్సి ఉంటుంది. అటుపై విద్యా ఏడాది ప్రారంభం రోజు నుంచి ఆర్టీఈ కింద అడ్మిషన్ పొందిన విద్యార్థులు తము ఎంచుకున్న పాఠశాలకు వెళ్లవచ్చు.
నిధుల వ్యయం ప్రభుత్వానిదే!
ఆర్టీఈ కింద అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల చదువుకు అయ్యే మొత్తాన్ని (ఒక్కొక్కరికి ఏడాదికి రూ.11,500) ప్రభుత్వమే భరిస్తుంది. ఇందులో 65 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 35 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రతి విద్యా సంస్థ మొత్తం సీట్లలో 25 శాతం సీట్లు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. వీటిలో 7.5 శాతం ఎస్సీ, 1.5 శాతం ఎస్టీ, 3 శాతం వికలాంగులకు, 2 శాతం హెచ్‌ఐవీ పీడిత విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లలో ఓబీసీ వర్గానికి చెందిన విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చు. మరింత సమాచారం కోసం www.schooleducation.kar.nic. in లో సంప్రదించవచ్చు.
6 నుంచి ఆర్టీఈ ప్రవేశ ప్రక్రియ ప్రారంభం
Published Wed, Dec 25 2013 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement