సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ స్పష్టం చేసింది. పాఠశాలల్లో బోధన, నిర్వహణ ఖర్చులను అనుసరించి ఏప్రిల్ నాటికి ఫీజులు నిర్ణయిస్తామని తెలిపింది. ఫీజులపై చట్టబద్ధమైన విధివిధానాలు లేనందున ప్రత్యేక చట్టం కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు అందాలని, దీన్ని అమలు చేయిస్తామని పేర్కొంది. సోమవారం విజయవాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, వైస్ చైర్మన్ డాక్టర్ ఎ.విజయశారదారెడ్డి, కార్యదర్శి ఎ.సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో వసతులు, ఫీజులు.. విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తి, మరుగుదొడ్లు, మంచినీరు, తరగతి గదులు, లైబ్రరీ లాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని తనిఖీలు చేశామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. వారు వెల్లడించిన వివరాలు ఇంకా ఇలా..
260 విద్యా సంస్థల్లో తనిఖీలు
– రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13, 14వ తేదీల్లో 130 ప్రైవేట్ పాఠశాలలు, 130 ప్రైవేట్ జూనియర్ కాలేజీలను తనిఖీ చేయగా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించాం.
– లోపాలపై విద్యా సంస్థలకు నోటీసులిస్తాం. గడువులోగా సరిదిద్దుకోకుంటే చట్టపరమైన చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. దిద్దుబాటుకు అవకాశం లేని విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తాం.
– సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ పాఠశాలలు, కాలేజీల విషయంలో కూడా ఫీజులు, ఇతర అంశాలపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలుంటాయి.
– పాఠశాలలు ఫీజు రూ.70 వేలు చెబుతూ రూ.95 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. సృజనాత్మక బోధనకు బదులుగా బట్టీ విధానాల్లో పాఠాలు చెబుతున్నారు.
– ప్రతి యూనిట్ టెస్టుకు విద్యార్ధులను ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు మారుస్తున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తుండడంతో విద్యార్థులు ఒత్తిడితో మానసిక స్థైర్యం కోల్పోతున్నారు.
– విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఎక్కడా లేవు. బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 40 మంది పట్టే తరగతి గదుల్లో 80 – 100 మంది వరకు ఉంటున్నారు.
– ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్నాయి. విద్యార్థులతో పాటు సిబ్బంది పరిస్థితి దయనీయంగా ఉంది. రోజువారీ కూలీలకన్నా తక్కువ వేతనాలు ఇస్తున్నారు.
– గతంలో విద్యార్థుల ఆత్మహత్యలు కూడా చోటు చేసుకున్నాయి.
– ఇంజనీరింగ్, డాక్టర్ విద్య మాత్రమే చదువులన్నట్లుగా కార్పొరేట్ విద్యాసంస్థల ప్రచారం వల్ల విద్యార్థుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతూ ఒత్తిడికి గురవుతున్నాయి.
నిబంధనల మేరకు వ్యవహరించాల్సిందే
మీడియా సమావేశంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, వైస్ చైర్మన్ డాక్టర్ విజయశారదారెడ్డి, కార్యదర్శి ఎ.సాంబశివారెడ్డి
రాష్ట్రంలో ఏ విద్యా సంస్థ అయినా ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. సొసైటీల పేరిట కొన్ని సంస్థలు ఫీజుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రతి విద్యా సంస్థకు సంబంధించిన ఐటీ రిటర్న్‌లను తెప్పించి పరిశీలిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ విద్యాబోధన, ప్రమాణాల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. నాణ్యతా ప్రమాణాలపై అలసత్వాన్ని ఉపేక్షించం.
– జస్టిస్ కాంతారావు
అనువైన వాతావరణం లేదు
ప్రైవేట్ సంస్థలు నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడం లేదు. బోధనా సిబ్బంది నాలుగైదు బ్రాంచిలకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు. 3, 4, 5 తరగతుల పిల్లలకు ప్రత్యేక తరగతులంటూ ఇబ్బంది పెడుతున్నారు. సరైన ఆటస్థలం, చదువుకునేందుకు అనువైన వాతావరణం ఎక్కడా లేదు. అపార్టుమెంట్లు, బహుళ అంతస్థుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్, ఈ–మెయిల్ ప్రవేశపెడుతున్నాం.
– విజయ శారదారెడ్డి
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాచట్టం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి, నాడు–నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చింది. చంద్రబాబు బినామీ సంస్థలైన నారాయణ, చైతన్య విద్యాసంస్థలు ఇష్టానుసారం వ్యవహరించాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాచట్టాన్ని మార్చి, సింగిల్ విండో ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతులు ఇచ్చే విధానాన్ని రూపొందిస్తాం.
– ఆలూరు సాంబశివారెడ్డి
ప్రమాణాలే ప్రామాణికం
Published Tue, Feb 18 2020 3:57 AM | Last Updated on Tue, Feb 18 2020 3:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment