సాక్షి, అమరావతి: పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించేలా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2022 – 23 విద్యాసంవత్సరం నుంచి దీన్ని పక్కాగా అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. తద్వారా వీటిల్లో ఏటా లక్ష సీట్లు పేద విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి.
విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలందరికీ కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేలా ‘ఇండస్ యాక్షన్’ అనే సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. గవర్నెన్స్, టెక్నాలజీ సపోర్టు తదితర అంశాల్లో సంస్థ ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ సంస్థ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం అమలుకు తోడ్పాటునిచ్చి లక్షల మంది పేద విద్యార్ధులకు మేలు చేకూర్చింది.
ఆర్టీఈపై న్యాయ వివాదాలు..
దేశంలో 6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యకోసం కేంద్ర ప్రభుత్వం 2009లో జాతీయ విద్యాహక్కు చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలోని సెక్షన్ 12 (1సి) ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ, గుర్తింపు పొందిన ప్రతి పాఠశాల యాజమాన్యాలు నర్సరీ, ఎల్‌కేజీ, లేదా ఒకటో తరగతి నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను కేటాయించాలి.
చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించి దశాబ్దం దాటినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లోనే ఆర్టీఈ చట్టాన్ని నోటిఫై చేసినా విధానపరమైన కారణాలతో పాటు కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం కోటా అమలుకు నోచుకోలేదు.
సీఎం ఆదేశాలతో కోటాపై కదలిక
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీఈ చట్టం అమలుపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లలకు 25 శాతం కోటా ప్రకారం సీట్లు కేటాయించేలా చర్యలు చేపట్టారు. వరుసగా రెండేళ్లు కరోనా కారణంగా పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది.
తాజాగా ఈ ఏడాది నుంచి కోటా అమలుకు సన్నద్ధమైంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు.
ఫీజులపై నిర్ణయానికి కమిటీ
అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించేందుకు 25 శాతం కోటా తోడ్పడనుంది. ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ స్కూళ్లలో విద్యను పేద విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం కోటా కింద సీట్లను కేటాయించి ఫీజులను ప్రభుత్వమే యాజమాన్యాలకు చెల్లిస్తుంది.
స్కూళ్లు, తరగతుల వారీగా చెల్లించాల్సిన ఫీజులపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కమిటీని నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా తరగతుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అనుసరించి ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులను చెల్లించనున్నారు.
ఏటా లక్ష మందికి అవకాశం
ఆర్టీఈ చట్టం ప్రకారం 25 శాతం కోటా అమలుతో రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో దాదాపు లక్ష సీట్లు పేద పిల్లలకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం 9,500 స్కూళ్లలో 35 వేల సీట్లు ఈ విద్యాసంవత్సరంలో పేద పిల్లలకు అందనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment