విద్యాహక్కుకు ‘ప్రైవేటు’ తూట్లు
- ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు అంతంతమాత్రంగా ప్రవేశాలు
- గత ఏడాది యథేచ్ఛగా ఫీజులు వసూలు కానరాని టాస్క్‌ఫోర్‌స
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: విద్యాహక్కు చట్టం అమలుకు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు తూట్లు పొడుస్తున్నాయి. చట్ట ప్రకారం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సి ఉన్నా మూడేళ్లుగా అమలు చేయడంలేదు. చట్టం అమలయ్యేలా చూడాల్సిన అధికారు లు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేర డం లేదు. రానున్న విద్యా సంవత్సరంలోనూ ఈ విధా నం అమలయ్యే పరిస్థితి కానరావడం లేదు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అధికారులు పట్టించుకోవ డం లేదు. ఈ విధానం పకడ్బందీగా అమలు కావడానికి టాస్క్‌ఫోర్సు బృందం ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఇంతవరకు పట్టించుకోలేదు. దీంతో ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యాహక్కుకు వ్యతిరేకంగా ప్రవేశాలు చేపడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలు సైతం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించి ఉచితంగా విద్యనందించాలని నిర్దేశించింది. గత విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను వీరికి కేటాయించి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవే శం కల్పించాలని పేర్కొంది.
గతంలో ప్రవేశం పొందిన బడుగు, బలహీ న వర్గాల విద్యార్థుల నుంచి కూడా ఫీజులు తీసుకోకూడదని స్పష్టం చేసింది. జిల్లాలో ప్రైవేటు యాజమాన్యా ల కింద ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాల లు 1300 ఉండగా వీటిలో ప్రస్తుతం 1.6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వీరిలో నాలుగో వంతు మందికి ఉచితంగా విద్య అందించాలి. అయితే యాజమాన్యాలు ఇందుకు విరుద్ధంగా బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీట్ల భర్తీకి రిజర్వేషన్..
ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను రిజర్వేషన్ ప్రకా రం భర్తీ చేయాలని చట్టం నిర్దేశించింది. అనాథలు, ఎయిడ్స్ బాధితులకు ఐదు శాతం, ఎస్సీలకు పది శాతం, గిరిజనులకు నాలుగు శాతం, బీసీలకు ఆరు శాతం సీట్లను కేటాయించింది. అయితే కేవలం వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దీన్ని పట్టించుకోవడం లేదు.
కానరాని టాస్క్‌ఫోర్స్
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రతి ఏడాదీ ప్రకటిస్తుంది. రెండో ఏడాది గడిచినా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కాకపోవడంతో ఈ విద్య సంవత్సరంలోనూ అదే తీరుగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు అవకాశం లేకుండా పోయింది.
ఫీజుల నియంత్రణపై పర్యవేక్షణ..
ఈ విషయాన్ని డీఈఓ జి.కృష్ణారావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అన్ని విద్యాసంస్థలపై ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల్లో చట్టం అమలు, ఫీజుల నియంత్రణ వ్యవహారాలను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు.