చదువుకొనలేం.. | private schools in feeses highest | Sakshi
Sakshi News home page

చదువుకొనలేం..

Published Tue, May 27 2014 2:50 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

చదువుకొనలేం.. - Sakshi

చదువుకొనలేం..

 ప్రైవేట్ స్కూళ్లలో అడ్డగోలు ఫీజులు
- ఐఐటీ, డీజీ, కాన్సెప్ట్, ఈటెక్నో, ఇతర పేర్లతో దోపిడీపర్వం
- నియంత్రణంలో సర్కారు విఫలం
- పేదలకు భారమవుతున్న విద్య

 
చదువుకునే రోజులు పోయి, చదువు‘కొనే’ రోజులొచ్చాయి. ప్రైవేట్ పాఠశాలలు ఐఐటీ, డీజీ, కాన్సెప్ట్, ఈ టెక్నో అంటూ కొత్త పేర్లు పెట్టుకొని వేలల్లో ఫీజులు, డొనేషన్లు గుంజుతున్నాయి. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు ఎక్కడ వెనకబడతారోననే భయంతో తల్లిదండ్రులు సైతం ఖర్చుకు వెనకాడకుండా ఇలాంటి స్కూళ్లలోనే చదివి స్తున్నారు. దీంతో యాజమాన్యాలు ఫీజులను అమాంతం పెంచుతున్నాయి. ఫలితంగా పాఠశాల విద్య భారమవుతోంది.
 
ఇంత ఫీజులా?
నాకు ఇద్దరు పిల్లలు... పెద్దోడు మూడో క్లాస్, చిన్నోడు ఎల్‌కేజీ. మనం ఎంత చేసినా పిల్లల కోసమే కదా అని కరీంనగర్‌లో పేరున్న స్కూళ్లో చదివిద్దామని పోతే... వాళ్లు ఫీజు చెప్పగానే కళ్లు తిరిగినయ్. ఎల్‌కేజీకి బస్సు ఫీజుతో కలిపి 20 వేలు చెప్పిండ్రు. మూడో క్లాస్‌కు 24 వేలు అన్నరు. ఇద్దరు పిల్లలను అందులో చదివించాలంటే స్కూల్ ఫీజే 45 వేల రూపాయల అయితది. స్కూల్ డ్రెస్‌లు, బుక్కులు, స్టేషనరీ వీటన్నింటికీ మరో 10 వేలన్నా అయితయ్. నాకొచ్చే జీతం ఏడాదికి 72 వేలు. పిల్లల స్కూల్‌కే 55 వేలు పోతే ఇంకా మా కుటుంబం ఎట్ల గడవాలె.
 - మహేందర్, కరీంనగర్
 
శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్ : మరో పది రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు... ఆపై మరో వారం రోజులకు ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు రంగురంగుల కరపత్రాలతో రాజకీయ ప్రచారాన్ని తలపించేలా ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. చాలాపాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవు. కొన్ని పాఠశాలలకు గుర్తింపు లేదు. ఒలింపియాడ్, ఐఐటీ, టెక్నో, కాన్సెప్ట్, ఈ టెక్నో, ఈ కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ తదితర పేర్లను గతేడాది తొలగించారు.

 పేర్లు మారినా ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవు. వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లలను చేర్పించడంపై టీచర్లకు కూడా ‘ప్రైవేటు’ యాజమాన్యాలు టార్గెట్ విధించాయి. ఒక్కో టీచర్ కనీసం పది మందిని చేర్పిస్తే వేతనాలు సంతృప్తికరంగా ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఏం మాట్లాడినా ఓపికతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

భారీగా ఫీజులు
పలు పాఠశాలల్లో ఫీజులు లక్ష రూపాయలకు చేరాయి. జిల్లాకేంద్రంతోపాటు గోదావరిఖని, పలు మున్సిపాలిటీల పరిధిలోని కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో హాస్టల్ ఫీజుతో కలుపుకుని రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. మండలకేంద్రాల్లోనూ ఫీజులు ఇంచుమించు ఇంతే ఉన్నా యి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు గుంజుతున్నారు.

 బోధనతోపాటు ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్, బాక్సింగ్ ఇతర టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ పలు రకాల ఫీజుల పేరుతో వసూళ్లు చేస్తున్నారు. పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, సాక్సులు, టై అంటూ ఇష్టమొచ్చిన ధరలు యాజమాన్యాలే నిర్ణయించి, తప్పనిసరిగా వారి వద్దనే తీసుకోవాలంటూ నిబంధన విధిస్తున్నారు.

ఐదేళ్ల క్రితం ఓ విద్యాసంస్థ మొదటిసారిగా ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ అంటూ జిల్లా కేంద్రానికి చేరుకుని... అప్పటివరకు రూ.3 నుంచి రూ.5 వేలు ఉన్న పాఠశాల ఫీజును ఏకంగా రూ.15 వేలకు పెంచింది.  ఆ తర్వాత జిల్లాలో అసలు విద్యా సంస్థల తీరే మారిపోయింది. సాధారణ స్థాయి పాఠశాలల్లో నర్సరీకి రూ.3 వేల వరకు ఫీజుండగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి దాకా తరగతి ప్రకారం రూ.4 వేల నుంచి రూ.15 వేల దాకా ఉన్నాయి. అదనంగా హాస్ట ల్ ఫీజులు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఉంది.

కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో నర్సరీ నుంచి ఎల్‌కేజీ వరకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి దాకా 12వేల నుంచి 30 వేల దాకా ఫీజులుంటున్నా యి. హాస్టళ్లో ఉంచి చదివించాలంటే స్కూలు ఫీజు కాకుండా రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా కట్టాల్సిందే. పదో తరగతి అయితే ఇంకా ఎక్కువే.  కొన్ని పాఠశాలలు మరో అడుగు ముందుకేసి ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సులో బీజాలు వేస్తామంటూ లక్ష రూపాయల ఫీజు అంటూ కొత్త విధానానికి రూపకల్పన చేశాయి.

కొన్ని పాఠశాలలు బ్రాండ్ ఇమేజ్ పేరుతో దోచుకుంటున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరుతో జిల్లాకేంద్రంలో 20కి పైగా పాఠశాలలు ఉన్నాయంటే దోపిడీ ఎంత మేర ఉందో ఊహించుకోవచ్చు. ఆధునిక విధానంలో బోధన అందించడం, భవిష్యత్ లక్ష్యాలకు ఇప్పటినుంచి తర్ఫీదు ఇవ్వడం మంచిదే అయినా అలా విజయాలు సాధించినవారి సంఖ్య ఒకటిరెండుకే పరిమితమవుతుండడంతో ధనార్జనకోసమే ఇలాంటి కోర్సులనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంత సొమ్ము వెచ్చించి ప్రైవేట్‌లో చదివించడం పేదలకు సాధ్యమయ్యే పనికాదు.

నిబంధనలకు విరుద్ధం
విద్యాహక్కుచట్టం ప్రకారం ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిం చకూడదనే నిబంధన ఉన్నా చాలా స్కూళ్లు దీన్ని పాటించడం లేదు. ఎంట్రెన్స్‌లతో విద్యార్థులు చిన్న వయసులోనే మానసికంగా కుంగిపోయి చదువు పై ఏకాగ్రత సాధించలేకపోతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. దీనికితో డు భారీగా ఫీజులు వసూలు చేస్తున్న చాలా పాఠశాల లు డిగ్రీ, ఇంటర్ చదివిన వారితోనే బోధన సాగిస్తున్నాయి. కరపత్రాల్లో ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తున్నాయి.
 
విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది

- ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు ఏర్పాటు చేయకూడదు.
- పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి.
- ప్రవేశపరీక్ష నిర్వహించకూడదు.
- అర్హత కలిగిన ఉపాధ్యాయులతోనే     విద్యాబోధన చేపట్టాలి.
- అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, 60 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
- పాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35 చొప్పున ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఉండాలి.
- ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement