సాక్షి, హైదరాబాద్: విద్యా హక్కు చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వనప్పుడు, దాని కోసం ఎందుకు కేంద్రాన్ని గట్టిగా అడగటం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది. అడిగినా కూడా కేంద్రం నిధులు ఇవ్వకపోతే, దానిపై సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం ఎందుకు చేయడం లేదని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వమేమీ అతీత శక్తి కాదని, రాజ్యాంగంలో కేంద్రం విధులు స్పష్టంగా నిర్వచించారని, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదంది. కేంద్రం నిధులు రాలేదంటూ చట్టాన్ని అమలు చేయకపోవడం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ప్రభుత్వ మే చట్టాన్ని అమలు చేయకుంటే, ఇక ప్రైవేటు విద్యా సంస్థలు ఏం అమలు చేస్తాయని నిలదీసింది. విద్యా హక్కు చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలని 2013లోనే ఈ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
నిధులు అడిగినా ఇవ్వడం లేదు...
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలు కావడం లేదంటూ న్యాయ విద్యార్థి తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, విద్యా హక్కు చట్టం అమలుకు కేంద్రం సగం నిధులు భరించాల్సి ఉందని తెలిపారు. ఈ నిధుల కోసం ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనం ఉండటం లేదన్నారు.
నిధులు ఇవ్వకుంటే అమలు చేయరా?
కేంద్రం నిధులు ఇవ్వకుంటే మీ నిధులతో చట్టాన్ని అమలు చేయవచ్చు కదా? కేంద్రం నిధులిచ్చే వరకు చట్టాన్ని అమలు చేయరా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద 25 శాతం సీట్లను పేదలకు ఇవ్వాలని, మరి వాటి సంగతేమిటని నిలదీసింది. ప్రభుత్వమే చట్టం గురించి పట్టించుకోకపోతే, ఇక ప్రైవేటు విద్యా సంస్థల గురించి చెప్పేదేముందని వ్యాఖ్యానించింది. చట్టం వచ్చినా పేద పిల్లలు అలానే ఉండిపోవాల్సిందేనా? అంటూ నిలదీసింది. కేంద్రం తన వాటా కింద తప్పనిసరిగా నిధులు ఇవ్వాలని చట్టం చెబుతోందని ఏఏజీ గుర్తు చేయగా, మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యాశాఖ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామని, కేంద్రం వంటి పెద్ద శక్తితో ఘర్షణ పెట్టుకోలేమని రామచంద్రరావు చెప్పారు. ఏ రాష్ట్రం కూడా కేంద్రం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మీ పిల్లలకోసం మీరేమీ చేయలేరా..?
ఇదే విషయంలో కోర్టులోనే ఉన్న విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరో పిటిషన్ వేసేదాకా వేచి చూసే బదులు, మీ బిడ్డల విషయంలో మీరు ఎందుకు న్యాయ పోరాటం చేయరని ప్రశ్నించింది. తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఉదయమే నిధుల గురించి కేంద్రానికి లేఖ రాశామని ఆయన చెప్పారు. ఎన్ని రోజు ల్లో చర్యలు తీసుకుంటారని ధర్మాసనం అడగగా, రెండు నెలల గడువు కావాలని ఆయన కోరారు. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలుకు ఏం చర్యలు తీసుకోబోతున్నారో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment