విద్యుత్ బకాయిల చెల్లింపుల అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. అందులో భాగంగానే రూ. 6,757 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఏపీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంచాయితీ నడుస్తోంది. తెలంగాణ తమకు విద్యుత్ చార్జీలు బకాయి పడిందంటూ ఏపీ ఫిర్యాదు చేయడంతో కేంద్రం గతేడాది కీలక ఉత్తర్వులిచ్చింది.
ఏపీ వాదనతో ఏకీభవించిన కేంద్రం అసలు, లేట్ పేమెంట్ సర్ చార్జీ కింద కలిపి మొ త్తం రూ.6,757 కోట్లను ఏపీకి చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. 30 రోజుల్లోగా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభు త్వం ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం ఆదేశాలపై సీజే ధర్మాసనం గతంలో విచారించి స్టే విధించింది. కాగా, ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయా న్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం కూడా విచారణ జరిపింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.
రావాల్సిన వాటిని పరిగణనలోకి తీసుకోలేదు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలకు రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకోకుండానే ఏపీకి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసిందని వైద్యనాథన్ పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంటే, మరో రాష్ట్రం 10 ఏళ్ల వరకు సరఫరా చేయాలని ఏపీ పునరి్వభజన చట్టంలో ఉందని, అయినా విడిపోయిన తర్వాత తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా నిలిపివేసిందని నివేదించారు. దీంతో తెలంగాణ బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఈ కారణంగా రాష్ట్రంపై రూ.4,740 కోట్ల భారం పడిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment