హవ్వ.. ఇదేం దుస్థితి!
సర్కార్ బడుల్లో మరుగుదొడ్ల ఏర్పాటు కలేనా?
- ఎవ్వరికీ పట్టని విద్యార్థినుల గోస
- సుప్రీంకోర్టు హెచ్చరించినా ఫలితం శూన్యం
- ఆర్వీఎం, ఆర్‌డబ్ల్యూఎస్ మధ్య సమన్వయ లోపం
- ముందుకు సాగని పనులు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని విద్యాహక్కు చట్టం చెప్తున్నా.. అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. పాఠశాలల దుస్థితి మారడం లేదు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం వంటి కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సమయాల్లో.. పాఠశాల నుంచి దూరంగా వెళ్లలేక.. ఎవరికీ చెప్పుకోలేక బాలికలు లోలోపలే కుంగిపోతున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో నిర్మించిన టాయిలెట్స్‌కు నిర్వహణ లేక, శుభ్రపరిచేందుకు సిబ్బంది, నిధులు, నీటి వసతులు లేక కంపుకొడుతున్నాయి. ఫలితంగా నిర్మించిన మూణ్నాళ్లకే నిరుపయోగంగా మారుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించినా.. విద్యాశాఖ(రాజీవ్ విద్యామిషన్), ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో పనులు ముందుకు సాగడంలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండాలి. ఈ లెక్కన 138 ప్రభుత్వ పాఠశాలల్లో 1,230 మరుగుదొడ్లు అవసరమని అధికారులు తేల్చి చెప్పారు. కాగా విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో వసతులు లేవని ఆరోపిస్తూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు తక్షణమే అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలని ఆదేశించడంతో విద్యాశాఖ అధికారుల్లో చలనం వచ్చింది. ప్రతి పాఠశాలలో బాలురకు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలి.
ప్రతి 40 మంది బాలికలకు ఒకటి, ప్రతి 80 మంది బాలురకు ఒకటి చొప్పున మరుగుదొడ్లు ఉండాలని కోర్టు సూచించింది. దీంతో జిల్లా అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటివరకు 138 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, 70 పాఠశాలల్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని నిర్ధారించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 238 మరుగుదొడ్లు లేవని అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు అత్యవసర సమయాల్లో పాఠశాల నుంచి దూరంగా వెళ్లాల్సి వస్తోందని, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో 240 పాఠశాలలకు తాగునీటి సౌకర్యం లేదు. కాగా విద్యార్థులు తాగడానికే నీరు లేకపోవడంతో ఉన్న టాయిలెట్స్‌ను శుభ్రం చేసే పరిస్థితి లేక కంపు కొడుతున్నాయి.
సమన్వయ లోపంతోనే జాప్యం
జిల్లాలో పలు పాఠశాలకు టాయిలెట్స్ మంజూరు కాకపోగా మంజూరైనవాటిని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సకాలంలో పూర్తి చేయడంలేదు. ఆర్వీఎం, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనులు ముందుకు సాగడంలేదని విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిధులు మంజూరు చేశారు. వీటితో మరుగుదొడ్లు, తాగునీటి వసతుల యూనిట్లు నిర్మించాలని ఈ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించారు. ఈ పనులు అప్పగించి 15 నెలలు కావస్తున్నా నేటికి 450 మరుగుదొడ్లు, 400 తాగునీటి యూనిట్లు మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన పనులు నిలిచిపోయాయి.