సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ(రేషనలైజేషన్) ఎఫెక్ట్‌తో జిల్లాలోని 232 పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. సర్కార్ కూడా రేషనలైజేషన్‌కు అనుకూలంగా నిర్ణ యం తీసుకోవడంతో విద్యార్థులు కూడా అయోమయానికి గురవుతున్నారు.
సర్కార్ ఆదేశాల మేరకు కలెక్టర్ చైర్మన్‌గా డీఈఓతో పాటు ఇతర జిల్లా అధికారులను సభ్యులుగా ఉన్న రేషనలైజేషన్ కమిటీ విద్యార్థులు, పాఠశాలల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడమే కాకుండా ప్రత్యమ్నాయ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేవివరాలను సైతం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. విద్యాశాఖ కార్యదర్శి జారీ చేసిన ఆదేశాలను పరిశీలిస్తే నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు లేని పాఠశాలలు జిల్లాలో 232 ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
వీటిలో ఎక్కువగా 9 నుంచి 10 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2013 -14 డైస్ లెక్కల ఆధారంగా ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ జరుగుతున్నట్లు సమాచారం.
దూరం ఆధారంగా
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 19 మందిలోపు విద్యార్థులు ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కిలోమీటర్ పరిధిలోని స్కూళ్లలో విలీనం చేస్తారు. గిరిజన ప్రాంతాలలో 19 మంది విద్యార్థులు ఉన్నా లేకపోయినా సమీప పాఠశాలలకు విలీనం చేయనున్నారు. అయితే కిలో మీటర్ పరిధిలో పాఠశాల లేనిపక్షంలో 15 మంది విద్యార్థులే ఉన్నప్పటికీ కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జిల్లా కేంద్రం సంగారెడ్డి సమీపంలోని చింతల్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో మొత్తం 5 తరగతులకు కలుపుకుని 16 మంది విద్యార్థులు ఉండగా, నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలోని నేతాజీనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉండగా, ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సంగారెడ్డి మండల పరిధిలోని చిమ్నాపూర్ తండాలో 5వ తరగతి వరకు కేవలం 9 మంది విద్యార్థులే ఉన్నా, ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
ఇక శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గిరిజన తండాలో 5వ తరగతి వరకు 11 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలను మూసివేస్తే 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా ప్రాథమిక పాఠశాలలు లేకపోవడంతో ఈ పాఠశాల్లోని విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. కొండాపూర్ మండలం ఎదురుగూడెం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు కేవలం 10 మంది విద్యార్థులే చదువుతున్నప్పటికీ ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 225 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత, 5 ఉన్నత పాఠశాలలు రద్దయ్యే అవకాశం ఉంది.
రవాణా చార్జీలు ఊసేలేదు
బడీడు పిల్లలను బడిలో చేర్పించి బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. కానీ సర్కార్ ఈ పథకాన్ని ఒకే సంవత్సరం అమలు చేసింది. 2012-13, 2013-14 విద్యా సంవత్సరానికి ఇప్పటి వరకు పైసా కూడా నిధులు కేటాయించలేదు.
దీంతో ప్రభుత్వం తాజాగా తీసుకున్న పాఠశాలల హేతుబద్దీకరణ పేద విద్యార్థులకు భారంగా మారనుంది. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూతపడనున్న 232 పాఠశాలలకు చెందిన సుమారు 6 వేల మంది విద్యార్థులు తమ గ్రామానికి దూరంగా ఉన్న పాఠశాలలో చదవాల్సిన పరిస్థితి ఉంది. తమ గ్రామంలో పాఠశాల ఉన్నందున తమ పిల్లలను చదివిస్తున్నామని, ఇతర గ్రామాలకు పంపించే ఆర్థిక స్థోమత తమకు లేదని ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. సర్కార్ తీసుకున్న రేషనలైజేషన్ నిర్ణయంతో ఇటు స్థానికంగా పాఠశాల లేక, అటు రవాణా చార్జీలు రాక గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
232 బడులకు తాళం!
Published Tue, Sep 30 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement