ప్రేమజంట విషాదాంతం | Love Couple Commits Suicide in Gajwel | Sakshi
Sakshi News home page

ప్రేమజంట విషాదాంతం

Published Fri, May 17 2019 7:11 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Love Couple Commits Suicide in Gajwel - Sakshi

లకుడారంలో తార ఇంటి వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు తార, కనకయ్య మృతదేహాలు

కొండపాక(గజ్వేల్‌): కలిసి జీవితం పంచుకుదామన్న ఆ ప్రేమజంటకు కులాలు అడ్డుగా మారాయి. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమికులు మంజ కనకయ్య(21), రాచకొండ తార (19)లు తాము చదువుకున్న పాఠశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయ విధారక సంఘటన సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం  లకుడారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్‌ కథనం ప్రకారం..

లకుడారం గ్రామానికి చెందిన మంజ మల్లయ్య–నర్సవ్వలకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మంజ కనకయ్య. అదే గ్రామానికి  చెందిన రాచకొండ మడేలు–రేణుకలకు ముగ్గురు కుమార్తెలు కాగా రెండో కుమార్తె రాచకొండ తార.  కనుకయ్య, తార చిన్నప్పటి నుంచి ఒకే తరగతి చదువుతూ వచ్చారని తెలిపారు. 2016–17 సంవత్సరంలో పది పరీక్షల్లో కనకయ్య ఫెయిల్‌ అవ్వగా తార ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో తార కుటుంబీకులు పంచాయతీ పెట్టి  కనకయ్యకు రూ.30 వేల జరిమానా విధించి మరో మారు  కలవకూడదంటూ మందలించి వదిలి వేసినట్లు తెలిపారు. అయినప్పటికీ కనకయ్య, తారల మధ్య ప్రేమాయానం సాగుతూనే వస్తుంది. ఈ క్రమంలో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చాలక మనస్తాపానికి గురైన ప్రేమజంట బుధవారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లిపోయి గ్రామానికి సుమారు 2 కిలో మీటర్లు దూరంలో ఉన్న హైస్కూల్‌లో కలుసుకున్నారు. అప్పుడు ఇరువురు చనిపోవాలని నిర్ణయం తీసుకొని తమ వెంట తీసుకెళ్లిన పురుగుల మందును తాగి హైస్కూల్లో ఒకే తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలియగానే సంఘటనా స్థలానికి వెళ్లి ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పరమేశ్వర్‌ తెలిపారు.

ఆస్పత్రి వద్ద రోదిస్తున్న తార తల్లిదండ్రులు
లకుడారంలో విషాదఛాయలు
రెండు కుటుంబాలు రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. రెండేళ్లుగా ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకోవాలని ఒకరి కొకరు నిశ్చయించుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో గత రెండేళ్ల కిందట జరిగిన సంఘటన నేఫథ్యంలో మళ్లీ కుల పెద్దల నుంచి ఎలాంటి అవమానాలకు ఎదురవుతాయోనన్న భయాందోళనతో ప్రేమ జంట కనుకయ్య, తారలు ఇంట్లోంచి వెళ్ళి పోవాలని నిర్ణయించుకొని బుధవారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లారు. కాగా కనకయ్య గత 10రోజుల క్రితం హనుమాన్‌ దీక్షను తీసుకున్నాడని తెలిపారు. బుధవారం ఇంట్లోంచి వెళ్లేటప్పుడే తన వెంట పురుగుల మందును తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సమయంలో పురుగుల మందు సేవించి హైస్కూల్లో భవనానికి ఉన్న కొక్కానికి ఉరివేసుకొని మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. బుధవారం రాత్రి వరకు రెండు కుటుంబాల వారు వెదికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో హైస్కూల్లోంచి దుర్వాసను వస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకొని మృతి చెందారని తెలిపారు. దీంతో హైస్కూల్‌ ప్రాంత మంతా రెండు కుటుంబాల రోదనలతో దద్దరిల్లి పోయింది. దీంతో రెండు కుటుంబాలు, కనకయ్య, తారలు గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ ఒక్కసారిగా మృతి చెందడంతో  విషాదఛాయలు అలుముకున్నాయని తెలిపారు. మృతుడి కుటుంబాలను సర్పంచ్‌ కందూరి కనుకవ్వ–ఐలయ్య, రైతు సమన్వయ సమితి రాష్ట్ర సభ్యులు దేవి రవీందర్‌ పరామర్శించి ఓదార్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement