నిద్రపోతున్నవారిని లేపవచ్చుగానీ...నిద్ర నటిస్తున్నవారికి మెలకువ తెప్పించడం అసాధ్యమని మరోసారి రుజువైంది. ప్రాథమిక విద్యా సంస్థలు సౌకర్యాల లేమితో అల్లాడుతున్నాయని, ఈ కారణంగా విద్యా హక్కు చట్టం ఎందుకూ కొరగానిదవుతున్నదని ఎందరో ఆరో పిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కొందరు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. వివిధ రాష్ట్రాల నుంచి అఫిడవిట్లు కోరిన సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రాథమిక విద్యారంగంలో నెలకొన్న దుస్థితిపై రాష్ట్రాలకు నిర్ణీత గడువు విధించి ఆలోగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ, పరి స్థితి యథాతథంగా కొనసాగుతున్నదని తాజాగా ఒక పిటిషన్ విచా రణ సందర్భంగా తేలింది. అక్షరక్రమంలో ముందు వరుసలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సౌకర్యాల లేమిలో, వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడంలో కూడా ముందే ఉన్నదని వెల్లడైంది. సరిగ్గా నాలుగేళ్లక్రితం...అంటే 2010 ఏప్రిల్ 1న విద్యా హక్కు చట్టాన్ని ఆర్భాటంగా అమలుచేయడం మొదలెట్టారు. మూడేళ్లలోగా చట్టంలో నిర్దేశించిన అంశాలన్నిటినీ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఇప్పటికీ మొండి గోడలు, చెట్లకింది చదువులు, ఎంతకూ రాని పుస్త కాలు... ఇలా అన్నీ ఎప్పటిలాగే ఉన్నాయని పలు క్షేత్రస్థాయి నివేది కలు చెబుతున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తయితే బాలబాలికలకు మరుగు దొడ్ల సౌకర్యం లేకపోవడం మరో ఎత్తు. మంచినీటి సంగతి చెప్పనవ సరమే లేదు. రెండేళ్లక్రితం ప్రాథమిక పాఠశాలల్లో మంచినీరు, మరు గుదొడ్ల విషయమై దాఖలైన పిటిషన్ విచారణకొచ్చినప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలనూ సుప్రీంకోర్టు గట్టిగా మందలించింది. ఈ రెండు సౌక ర్యాలనూ ఆరు నెలల వ్యవధిలో సమకూర్చాలని ఆదేశించింది. నాలు గురోజులనాడు ఒక పిటిషన్ విచారించిన సందర్భంలోనూ ఇదే స్థితి. పర్యవసానంగా ధర్మాసనం ముందు మన రాష్ట్ర ప్రభుత్వం తలదించు కుంది. మరికొంత సమయమిస్తే దీన్ని సరిచేస్తామని సంజాయిషీ ఇచ్చుకుంది. ఎప్పటిలాగే సుప్రీంకోర్టు మరోసారి ప్రభుత్వాన్ని మందలించాల్సి వచ్చింది. చదువుకోవడానికి పాఠశాలల కొచ్చే బాలబాలికలకు కనీస సౌకర్యాలు కొరవడితే, అందువల్ల వారు చదువులో వెనకబడిపోతే దేశానికి అవసరమైన ఉత్తమ పౌరులను తయారుచేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అన్నిటికీ జవాబు ఒకటే...మరికొంత సమయమిస్తే చేస్తామని చెప్పడమే.
విద్యాహక్కు చట్టం మన రాష్ట్రంలో పరమ అధ్వానంగా అమలవుతున్నదని వార్షిక విద్యా నివేదిక(ఏసర్)-2013 వెల్లడిం చింది. సర్వే చేసిన పాఠశాలల్లో కేవలం 65 శాతం పాఠశాలలకు మాత్రమే మంచినీటి సదుపాయం ఉన్నదని ఆ నివేదిక తెలిపింది. 19 శాతం పాఠశాలలకు అసలు మరుగుదొడ్ల సదుపాయమే లేదు. 43 శాతం పాఠశాలల్లో మాత్రమే బాలబాలికలకు విడిగా మరుగుదొడ్లు ఉన్నాయని నివేదిక అంటున్నది. అసలు ఏ పాఠశాలలో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అవసరమో చూసి, వాటిని కల్పించే బాధ్యతను పంచాయతీలకు అప్పగిస్తే ఈ సమస్య చాలా త్వరగా పరిష్కారమవుతుంది. కానీ, ప్రభుత్వం మాత్రం తనకలవాటైన పద్ధతుల్లో అన్నీ తానే నిర్ణయించాలనుకోవడం సమస్య పరిష్కారానికి అవరోధంగా నిలుస్తున్నది. ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న ఇలాంటి పరిస్థితులవల్ల బాలికల చదువు దెబ్బతింటున్నది. ఎదిగివస్తున్న తమ బిడ్డలను బడులకు పంపడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్నారు. వారి భయాలు కూడా సహేతుకమైనవే. మరుగుదొడ్లులేని బడుల్లో ఆడ పిల్లలు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందు వల్ల వారిని చదువు మాన్పించడమే పరిష్కారమని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఒకటో తరగతిలో చేరిన బాలికల్లో మూడోవంతు మంది పదో తరగతికొచ్చేసరికి చదువుకు స్వస్తి చెబుతున్నారని ఒక అంచనా.
వీరిలో ఎక్కువమంది బడుగు, బలహీన వర్గాల పిల్లలేనని చెప్పనవసరం లేదు. ప్రభుత్వానికి మాత్రం ఇదేమీ పట్టడంలేదు. అది యథాప్రకారం నిమ్మకు నీరెత్తిన ధోరణిలోనే వ్యవహరిస్తున్నది. మనకంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌వంటి రాష్ట్రాలు ఈ విషయంలో మన ప్రభుత్వంకంటే సున్నితంగా ఆలోచిస్తున్నాయి. సౌకర్యాల కల్పనలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. పంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకూ భిన్నస్థాయిల్లో ప్రజా ప్రతినిధులుంటారు. వారంతా జనం ఓట్లతో ఎన్నికయ్యేవారే. తమ తమ ప్రాంతాల్లో ఉండే సమస్యలు వారికి తెలియకపోవు. అయినా, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన నాలుగేళ్లనుంచీ...సుప్రీంకోర్టు దృష్టికొచ్చి సరిచేయమని చెప్పిన రెండేళ్లనుంచీ సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయంటే అది సిగ్గుచేటైన సంగతి.
మన రాష్ట్రంలో ఉన్న 78,000కుపైగా పాఠశాలల్లో సగానికిపైగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీరు సదుపాయాలు లేవని ఆమధ్య జరిపిన సర్వేలో తేలింది. ఒకపక్క బోధనావిద్యలో పట్టాలు పొందిన వందలాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే పాఠశాలల్లో చట్టం నిర్దేశించిన మేరకు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉండటంలేదని ఆ సర్వే వివరించింది. ఇక ఆటస్థలాల సంగతి చెప్పనవసరమేలేదు. ఇలాంటి పరిస్థితులన్నిటినీ సరిచేస్తామని ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు చెప్పే ప్రభుత్వం ఆ దిశగా కాస్తయినా ప్రయత్నించడంలేదని స్పష్టమైంది. విద్యాహక్కు చట్టం నిబంధనలు, తమ ఆదేశాలు ఎంతవరకు అమలయ్యాయో సూచించే స్థాయీ నివేదికను జూలై 7 నాటికి అందజేయాలని సుప్రీంకోర్టు తాజా గడువు విధించింది. కనీసం అప్పటికైనా మన ప్రభుత్వం బాధ్యతను గుర్తెరుగుతుందా అన్నదే ప్రశ్న.
కొరగాని ‘విద్యాహక్కు’!
Published Mon, May 12 2014 11:47 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement