సర్దు‘పోటు’ | doubt about on dse exams | Sakshi
Sakshi News home page

సర్దు‘పోటు’

Published Mon, Jun 23 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

సర్దు‘పోటు’

సర్దు‘పోటు’

కర్నూలు(విద్య): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది డీఎస్సీ నిర్వహించకుండా విద్యా సంవత్సరం గట్టెక్కించేందుకు అడ్డదారులు వెతుకుతోంది. విద్యా హక్కు చట్టం లెక్కల ప్రకారం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు మించి పని చేస్తున్న ఉపాధ్యాయులను అవసరమైన చోట సర్దుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎక్కువ, తక్కువ ఉపాధ్యాయులు కలిగిన పాఠశాలల వివరాలను విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం, ఆర్‌జేడీ కార్యాలయం, డీఈవో కార్యాలయాల నుంచి ఆయా మండల విద్యాధికారులకు జాబితా అందింది. నిబంధనల మేరకు 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అవసరం.
 
ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 1ః30 నిష్పత్తిలో అధికారులు తక్కువ, ఎక్కుక ఉపాధ్యాయుల సంఖ్యను తేల్చారు. ఫలితంగా జిల్లాలో 1500 మంది పైగా ఉపాధ్యాయులు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రధానంగా కర్నూలు, నంద్యాల, ఆదోని తదితర నగరం, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు పని చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో కౌతాళం, కోసిగి, మంత్రాలయం, హాలహర్వి, ఆలూరు, ఆస్పరి తదితర మండలాల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రతరంగా ఉంది. ప్రధానంగా హైస్కూళ్లలో ఉపాధ్యాయుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు ఈనెల 24న డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేశారు. కాగా ఎంఈవోలకు పంపిన జాబితాపై డీఈఓ స్పందిస్తూ ఆర్‌జేడీ కార్యాలయంలో అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని.. వాస్తవ పరిస్థితిని ఆర్‌జేడీకి తెలియజేశామన్నారు. ఇదిలాఉండగా రేషనలైజేషన్‌కు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు అనుసరిస్తున్న విధానంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా తప్పించుకునేందుకు సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం తెర తీయడం సమంజసం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 అధికారిక లెక్కల ప్రకారం ఉపాధ్యాయులు తక్కువ, ఎక్కువ ఉన్న పాఠశాలల్లో కొన్ని...
 
 ఉపాధ్యాయులు ఎక్కువున్న పాఠశాలలు
 1. కర్నూలు నగరం కుమ్మరివీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 72 మంది విద్యార్థులుండగా ఆరుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారు.
 2. కర్నూలు నగరం వడ్డేపేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులకు గాను ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ముగ్గురు ఉపాధ్యాయలు అదనంగా ఉన్నారు.
 3. కర్నూలు నగరం ఎర్రబురుజులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులుండగా ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
 4. కర్నూలు నగరం పెద్దమార్కెట్ వద్దనున్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులకు గాను నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
 5. కర్నూలు నగరం బండిమెట్ట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 107 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నలుగురు ఉపాధ్యాయలు అదనంగా ఉన్నారు.
 6. కర్నూలు నగరం గడ్డవీధిలో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 44 మంది విద్యార్థులకు గాను నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక్క టీచరే చాలని అధికారులు భావిస్తున్నారు.
 7. కర్నూలు నగరం కుమ్మరి వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 43 మంది విద్యార్థులకు గాను 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ అదనంగా ఏడుగురు ఉపాధ్యాయులున్నట్లు తేల్చారు.
 8. కర్నూలు నగరం బుధవారపేటలోని 17వ వార్డు మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులకు గాను 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఐదుగురు అదనంగా ఉన్నారు.
 
 ఉపాధ్యాయులు తక్కువున్న పాఠశాలలు
 1. కౌతాళం మండలం గోతులదొడ్డి ఎంపీపీ స్కూల్‌లో 285 విద్యార్థులుండగా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. మరో 8 మంది టీచర్లు అవసరం.
 2. కౌతాళం మండలం కామవరం ఎంపీపీ స్కూల్‌లో 354 మంది విద్యార్థులుండగా ఐదుగురు టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. మరో ఏడుగురు అవసరం.
 3. కౌతాళం మండలం చిత్రపల్లి ఎంపీపీ స్కూల్‌లో 212 మంది విద్యార్థులుండగా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు కావాల్సి ఉంది.
 4. కౌతాళం ఎంపీపీ స్కూల్(ఎస్‌డబ్ల్యు)లో 354 మంది విద్యార్థులుండగా ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. మరో ఏడుగురు అవసరం.
 5. కోసిగి మండలం అగసనూరులోని ఎంపీపీ స్కూల్‌లో 214 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఐదుగురిని నియమించాల్సి ఉంది.
 6. కోసిగి మండలం కామనదొడ్డి ఎంపీపీ స్కూల్‌లో 227 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లే ఉన్నారు. మరో ఆరుగురు అవసరం.
 7. కోసిగి మండలం జంపాపురం ఎంపీపీ స్కూల్‌లో 283 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఇంకా ఏడుగురు ఉపాధ్యాయులు కావాలి.
 8. కర్నూలు కలెక్టరేట్ వెనుకనున్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 503 విద్యార్థులుగా 12 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరో ఐదుగురు ఉపాధ్యాయుల అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement