Number of students
-
ఇలాగైతే పాఠాలెలా..
ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ఎప్పుడు చిన్నచూపు చూస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ విద్యాప్రమాణాలను దిగజారుస్తోంది. ఏటా పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రకియ మొదలుకొని, ఉపాధ్యాయుల బదిలీలతో సహా అలసత్వం చూపిస్తోంది. విద్యాశాఖపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పాఠశాలల పరిస్థితి చూస్తే ప్రభుత్వ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. - ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి కాని రేషనలైజేషన్ - ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి ఏంటి? - విద్యాహక్కు చట్టానికి తూట్లు - విద్యార్థుల చదువులకు ఇబ్బందులు విశాఖ ఎడ్యుకేషన్ : ఏటా బడుల్లో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా జరుగుతుంది. ప్రభుత్వ ఆలసత్వం వల్ల ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. దాంతోపాటు బదిలీ ప్రక్రియను కూడా పూర్తి చేయలేదు. బదిలీలు రేషనలైజేషన్‌తో ముడిపడి ఉండటంతో ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి వస్తున్నా ఈ బదిలీ ప్రక్రియని పూర్తి చేయడంలో కాలయాపన చేస్తుంది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వేసవి సెలవులు ముగిసేనాటికి ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి సక్రమంగా పాఠశాలలు జరిగేలా చూస్తామన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినప్పటికీ ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ, రేషనలైజేషన్‌లో జాప్యం చేస్తునే ఉంది. దీనివలన హేతుబద్ధీకరణ కోసం ఉపాధ్యాయులు వేచి చూడాల్సి వస్తుంది. బదిలీ అయినా పాత స్థానాల్లోనే: జిల్లాలో 1385 ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రాథమికోన్నత పాఠశాలలు ఏకోపాధ్యాయునితో నడుస్తున్నాయి. వీటిలో కొన్ని చోట్ల విద్యార్ధులు నిష్పత్తి కంటే ఎక్కువగా ఉండగా, మరికొన్ని చోట్ల తక్కువగా విద్యార్ధులు ఉన్నారు. ప్రభుత్వం నిష్పత్తి తక్కువగా ఉన్న పాఠశాలలను రేషనలైజేషన్‌లో భాగంగా సమీప పాఠశాలలో విలీనం చేసి ఆదర్శపాఠశాలల సంఖ్యను పెంచాలని ఆలోచిస్తుంది. ఈ ప్రక్రియ కూడా పూర్తి కాకపోవడంతో ఏ పాఠశాలలు పోతాయో, ఏవి ఉంటాయో తెలియని పరిస్థితి విద్యార్ధులది. అదే పరిస్థితి ఉపాధ్యాయుల్లో కూడా కనిపిస్తుంది. హేతుబద్ధీకరణ పేరుతో ఎక్కడికి పంపిస్తారో తెలియని పరిస్థితి. దీనివలన వారు కూడా బోధనపై దృష్టిపెట్టలేకపోతున్నారు. విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం వలన చదువుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే టీచర్ అన్ని తరగతులకు బోధించాలంటే తలకు మించిన భారం. వీలైనంత వేగంగా రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సిలబస్ పరంగా నష్టపోయేది విద్యార్ధులే. 2013లో బదిలీ అయిన వారు చాలా మంది పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. వీరు పనిచేస్తున్న పాఠశాలలన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలే. ఆ పాఠశాలలకు ఎవరూ రాకపోవడంతో ఉపాధ్యాయులందరూ పాత స్థానాల్లోనే కొనసాగాల్సి వస్తుంది. బదిలీ ప్రక్రియ పూర్తి చేసిన కూడా పాత స్థానాల్లో కొనసాగుతున్న వీరు కూడా తమ బదిలీ స్థానాలకు వెళ్లడానికి ఎదురు చేస్తున్నారు. హేతుబద్ధీకరణ పూర్తయితే కాని తమ స్థానాలకు వెళ్లలేని పరిస్థితి. విద్యాహక్కు చట్టమేమంటోంది - విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి హేతుబద్దీకరణ ప్రక్రియ విద్యాశాఖ పూర్తి చేసి అన్ని పాఠశాలల్లో విద్యార్ధుల నిష్పత్తి అనుసరించి ఉపాధ్యాయులను నియామకం చేయాలి. - ఎక్కువ మంది విద్యార్ధులు ఉన్న పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయ నియామకాలు చేసి ఖాళీ పోస్టులను గుర్తించి డీఎస్సీ అభ్యర్ధులను పూర్తి నింపడం కాని లేదా. - ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి బదిలీ ప్రక్రియలో నియామకం చేయాలి. తక్షణం బదీలీ ప్రక్రియ పూర్తి చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన హేతుబద్ధీకరణతోపాటు, బదిలీ ప్రక్రియ కూడా పూర్తిగా ఆగిపోయింది. రకరకాల కారణాలతో బదిలీలు కోరుకుంటున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం జీఓ కోసం ఎదురుచూస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలంటే బదిలీ ప్రక్రియతో పాటు రేషనలైజేషన్ పూర్తి చేయాలి. -మధు, పీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. -
325 స్కూళ్లకు తాళాలు ?
- విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడమే కారణం - అలా చేస్తే1800 మంది టీచర్లు అదనమని గుర్తింపు - పాఠశాలల విలీనం, హేతుబద్ధీకరణతో సర్దుబాటు - మరింత జాప్యం కానున్న డీఎస్సీ 2014 నియామకాలు గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 325 ప్రాథమిక పాఠశాలలను మూసి వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 30 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసి వేసి అక్కడి విద్యార్థులను సమీప పాఠశాలలకు తరలించేందుకు కసరత్తు చేస్తోంది. 30 మంది కంటే తక్కువ ఉన్న విద్యార్థులను కిలోమీటరు పరిధిలోని మరో పాఠశాలకు పంపే విధంగా విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ విధంగా జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్, మున్సిపల్ ప్రాథమిక పాఠశాలల పరిధిలో 325 పాఠశాలలు మూసి వేయాలని నిర్ణయించారు. ఈ స్థాయిలో పాఠశాలలను మూసి వేస్తే ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న 1800 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉంటారని అధికారులు గుర్తించారు. వీరిని పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. విద్యాహక్కుచట్టం మేరకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులను తప్పనిసరిగా నియమించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను గమనిస్తే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ఐదు తరగతులకు ఇద్దరు లేక ముగ్గురు ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేశారు. తాజాగా చేపట్టిన విలీన ప్రక్రియతో ప్రతి పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులను విధిగా నియమించాల్సి ఉంది. ముందుగా పాఠశాలలను విలీనం చేసిన తరువాత ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా పల్నాడు ప్రాంతంలోని మారుమూల మండలాలు, తండాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేక విద్యాబోధనకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది గుంటూరు, తెనాలి, బాపట్ల డివిజన్లలోనే పని చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో సత్తెనపల్లి, నరసరావుపేట డివిజన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరింత జాప్యం కానున్న డీఎస్సీ-2014 నియామకాలు పాఠశాలల విలీనం ద్వారా జిల్లాలో 1800 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్లు గుర్తించడంతో హేతుబద్ధీకరణ, బదిలీల ద్వారా వారిని అవసరమైన పాఠశాలల్లో సర్ధుబాటు చేయాల్సి ఉంది. అదే విధంగా ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలను సైతం నెల రోజుల్లో జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవన్నీ జరిగిన తరువాతనే డీఎస్సీ-2014 నియామకాలు చేపట్టే అవకాశం లేదు. డీఎస్సీ ద్వారా వెయ్యి మంది టీచర్లను భర్తీ చేయాల్సి ఉంది. -
67 స్కూళ్లు మూత!
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులపై నమ్మకం సన్నగిల్లడంతో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తీసుకుంటున్న చర్యలు ఫలితమివ్వక పోవడంతో ప్రభుత్వం ఏకంగా పాఠశాలలను మూసి వేయడానికి సిద్ధమైంది. సర్వశిక్ష అభియాన్ తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 19 ప్రాథమిక పాఠశాలల్లో అసలు పిల్లలే లేరు. తొమ్మిది పాఠశాలల్లో 10 మంది, మరో 39 పాఠశాలల్లో పది మందిలోపే విద్యార్థులు ఉన్నారు. పది మంది లోపు పిల్లలున్న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 67 పాఠశాలలు మూతపడటం ఖాయం అని తెలుస్తోంది. ఇంగ్లిష్ మీడియంపై ఉన్న మక్కువతో చాలా మంది తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు మిగిలిపోనున్నారు. ఇలా మిగిలిపోయిన వారిని రేషనలైజేషన్‌లో అవసరం ఉన్న చోటుకు సర్థబాటు చేయనున్నారు. ఉపాధ్యాయులను ఇలా సర్దుబాటు చే స్తూ పోతే భవిషత్తులో టీచర్ పోస్టుల నియామకాలుండవని నిరుద్యోగులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులున్నప్పటికీ ఎందుకు పిల్లలు రావటంలేదో విద్యా శాఖాధికారులకు అర్థం కావడం లేదు. ప్రవేటు పాఠశాలల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు లేకపోయినప్పటికి చాలా మంది అక్కడికే విద్యార్థులను పంపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పాజిటివ్ అంశాలను త ల్లిదండ్రులకు విడమరచి చెప్పడంలో సదరు శాఖ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనేది కాదనలేని సత్యం. వేసవి సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఇల్లిల్లూ తిరిగి (క్యాంపైన్) ప్రమోషన్ వర్క్ నిర్వహిస్తుంటే ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. అందోళనలో గ్రామీణ ప్రజలు జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న విద్యార్థులు తల్లితండ్రులు పాఠశాలలు మూతపడతాయనే విషయంలో అందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలలను మూసివేస్తే తమ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు పంపడానికి ఆర్థిక స్థోమత లేని వారు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఇలాంటి వారి పిల్లలు ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయే ప్రమాదం ఉంది. లక్షలాది రుపాయలు వెచ్చించి నిర్మించిన పాఠశాలలు నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. -
క్రమబద్ధీకరణ కలవరం!
సాక్షి, కరీంనగర్ : ఏటా విద్యార్థులు లేక మూతబడుతున్న సర్కారు స్కూళ్లు.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జరుగుతున్న ఉపాధ్యాయ పోస్టుల క్రమబద్ధీకరణ నిరుద్యోగ అభ్యర్థులపై నీళ్లు చల్లుతోంది. విద్యార్థులు లేక స్కూళ్లు మూతబడుతుంటే.. విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టులను ఇతర పాఠశాలలకు తరలిస్తోంది. గత విద్యా సంవత్సరం జిల్లా విద్యాశాఖ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను క్ర మబద్ధీకరించింది. ఆ సమయంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 540 ఎస్జీటీ పోస్టులు మిగిలాయి. ఇటు ఉన్నత పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య తగ్గి.. వెయ్యిమందికి పైగా ఉపాధ్యాయులు పనిలేకుండా ఉన్నారు. దీంతో డీఈవో లింగయ్య అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో సర్దుబాటు చే శారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈయేడు జిల్లావ్యాప్తంగా సర్కారు పాఠశాలల్లో 30వేల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందని సాక్షాత్తూ విద్యాశాఖ గణాంకాలే చెప్తున్నాయి. వెంటాడుతున్న గుబులు ‘దసరా సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ఉంటుంది. ఆ తర్వాతే డీఎస్సీ నిర్వహిస్తాం’ అని ఈ నెల 2న సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీల సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ మళ్లీ క్రమబద్ధీకరణ చేపడితే.. ప్రస్తుతం జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 120 స్కూళ్లలో వందలాది ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గత విద్యా సంవత్సరం 540 మందిని సర్దుబాటు చేసిన అధికారులు వీరి సేవలు ఎక్కడ వినియోగించుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క తర్వాత ప్రకటించే డీఎస్సీలోనూ పోస్టులు తగ్గుతాయి. దీంతో కొత్త రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువులొస్తాయనే కోటి ఆశతో ఉన్న నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో జిల్లాలో వేలాది మంది బీఎడ్, డీఎడ్, ఇతర కోర్సులు పూర్తి చేశారు. ఇప్పటికే వేలాది మంది ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. పేరున్న కేంద్రాల్లో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. పరిణామాల దారెటో..? విద్యార్థుల సంఖ్య తగ్గిందే తడవుగా పాఠశాలలకు తాళం.. ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో చోటుచేసుకునే పరిణామాల గురించి ఆలోచించడం లేదనిపిస్తోంది. ఒక్క సారి స్కూలుకు తాళం వేస్తే.. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో మళ్లీ పాఠశాల ఏర్పాటు అసాధ్యమని తెలిసినా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఆర్ధిక స్థోమత లేని, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది నిరుపేద విద్యార్థులు సర్కారు స్కూళ్లనే నమ్ముకుని ఉన్నారు. నేడు మూతబడ్డ పాఠశాలల పరిధిలో భవిష్యత్తులో విద్యార్థులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఆ ప్రాంతంలో విద్యార్థు పరిస్థితి ఏమిటో వారికే తెలియాలి. పాఠశాలలు మూతబడితే.. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్ల సంఖ్య కూడా అదే తీరుగా పెరిగే అవకాశాలున్నాయి. సర్కారు స్కూళ్లపై ప్రజల విశ్వాసం సడలడంతోనే విద్యార్థులు ప్రైవేట్‌కు వెళ్తున్నారు. విషయం తెలిసినా.. ప్రభుత్వం మాత్రం పాఠశాలలను బలోపేతం చేసి వారి విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిరుద్యోగులకు అన్యాయం ఎం.ప్రతాపరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, టీఆర్టీఎఫ్ ఉపాధ్యాయ పోస్టుల క్రమబ్ధ్దకరణ నిర్ణయంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఏటా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల మనుగడపై ప్రతికూల ప్రభావం చూపుతున్న మాట వాస్తవమే. పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశాలుండవు. స్కూళ్లు మూతబడవు. పోస్టులూ తరలించే అవకాశముండదు. -
తాళం.. ఘోరం
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థుల సంఖ్యను పెంచాల్సింది పోయి.. తక్కువ ఉన్నారనే నెపంతో స్కూళ్లకు తాళం వేస్తుండడం ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారింది. ఇలాగైతే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువుకు నిలయంగా మారిన మన జిల్లాలో ఎక్కువ మంది గ్రామాల్లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఉంచేందుకు ఇష్టపడటం లేదు. చదువుపై ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. విద్యార్థులు లేని కారణంగా ఒకటి, రెండు కాదు ఏకంగా 177 స్కూళ్లు జిల్లాలో మూతపడ్డాయంటే పరిస్థితికి అద్దం పడుతోంది. బోధన సరిగా లేదని.. పేద వర్గాల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఇష్టపడం లేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ రోజు పిల్లలు లేక కళాహీనంగా మారాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో వందలాది స్కూళ్లు పిల్లలు లేని కారణంగా మూతపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనిఫైడ్ డి స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్)-2013 ప్రకారం జిల్లాలో 177 స్కూళ్లు విద్యార్థులు లేక, 10 మందిలోపు విద్యార్థుల సంఖ్య ఉన్న కారణంగా క్లోజ్ చేశారు. బత్తలపల్లి మండలం చిన్నేకుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్క విద్యార్థీ లేనికారణంగా క్లోజ్ చేశారు. మూతపడిన ప్రాథమిక పాఠశాలలివే : అగళి మండలం గొల్లహట్టి, లక్ష్మీపురం, బీరనపల్లి, ఎంకె గొల్ల హట్టి, హుళికెరదేవరహ ళ్లి, ఎంఎం పాల్యం. అమడగూరు మండలం బావిచెరువుపల్లి, సీతిరెడ్డిపల్లి, దుడరగుట్టపల్లి, అమరాపురం మండలం కదతడహళి,్ల అనంతపురం మండలం జంగాలపల్లి, ఆత్మకూరు మండలం దొద్దెకొట్టాల, బత్తలపల్లి మండలం చీమలనాగేపల్లి, రామాంజుంపల్లి, కళ్యాణదుర్గం మండలం పింజరికొట్టాల, కూడేరు మండలం మరుట్ల, కనగానపల్లి మండలం కొండ్రెడ్డిపల్లి, బెళుగుప్ప మండలం వీరాంజినేయ కొట్టాల, బ్రహ్మసముద్రం మండలం విఎన్ హళ్లి, గుమ్మగట్ట మండలం మారెమ్మపల్లి తాండ, పామిడి మండలం పామిడి ఆర్ఎస్, యల్లనూరు మండలం పిఎం కొండాపురం, బుక్కపట్నం మండలం నాయనవారిపల్లి, నల్లగుట్టపల్లి, బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, పుట్లూరు మండలం నాగిరెడ్డిపల్లి, రామగిరి మండలం ఆకుతోట్ల, రాయదుర్గం మండలం జుంజురాంపల్లి పాఠశాలలు మూతపడ్డాయి. చిలమత్తూరు మండలంలో 6, ధర్మవరం మండ లంలో 10, గాండ్లపెంటలో 4, గార్లదిన్నెలో 2, గోరంట్లలో 7, గుడిబండలో 2, గుంతకల్లులో 2, కదిరిలో 3, కొత్త చెరువులో 4, కుందిర్పిలో 4, లేపాక్షి మండలం శిరివరం, మడకశిరలో 8, ముదిగుబ్బలో 10, నల్లచెరువులో 4, నల్లమాడలో 2, నంబులపూలకుంటలో 5, నార్పలలో 2, ఓబులదేవచెరువులో 7, పరిగిలో 2, పెద్దపప్పూరు మండలం రెడ్డిపల్లి, పెనుకొండ లో 5, రొద్దంలో 5, రొళ్లలో 10, శెట్టూరులో 3, శింగనమలలో 2, సోమందేపల్లిలో 5, తాడిపత్రిలో 2, తలుపులలో 11, యాడికిలో 4, తనకల్లు మండలంలో 15 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. -
సర్దు‘పోటు’
కర్నూలు(విద్య): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది డీఎస్సీ నిర్వహించకుండా విద్యా సంవత్సరం గట్టెక్కించేందుకు అడ్డదారులు వెతుకుతోంది. విద్యా హక్కు చట్టం లెక్కల ప్రకారం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు మించి పని చేస్తున్న ఉపాధ్యాయులను అవసరమైన చోట సర్దుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎక్కువ, తక్కువ ఉపాధ్యాయులు కలిగిన పాఠశాలల వివరాలను విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం, ఆర్జేడీ కార్యాలయం, డీఈవో కార్యాలయాల నుంచి ఆయా మండల విద్యాధికారులకు జాబితా అందింది. నిబంధనల మేరకు 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అవసరం. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 1ః30 నిష్పత్తిలో అధికారులు తక్కువ, ఎక్కుక ఉపాధ్యాయుల సంఖ్యను తేల్చారు. ఫలితంగా జిల్లాలో 1500 మంది పైగా ఉపాధ్యాయులు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రధానంగా కర్నూలు, నంద్యాల, ఆదోని తదితర నగరం, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు పని చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో కౌతాళం, కోసిగి, మంత్రాలయం, హాలహర్వి, ఆలూరు, ఆస్పరి తదితర మండలాల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రతరంగా ఉంది. ప్రధానంగా హైస్కూళ్లలో ఉపాధ్యాయుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు ఈనెల 24న డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేశారు. కాగా ఎంఈవోలకు పంపిన జాబితాపై డీఈఓ స్పందిస్తూ ఆర్జేడీ కార్యాలయంలో అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని.. వాస్తవ పరిస్థితిని ఆర్జేడీకి తెలియజేశామన్నారు. ఇదిలాఉండగా రేషనలైజేషన్‌కు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు అనుసరిస్తున్న విధానంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా తప్పించుకునేందుకు సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం తెర తీయడం సమంజసం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఉపాధ్యాయులు తక్కువ, ఎక్కువ ఉన్న పాఠశాలల్లో కొన్ని... ఉపాధ్యాయులు ఎక్కువున్న పాఠశాలలు 1. కర్నూలు నగరం కుమ్మరివీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 72 మంది విద్యార్థులుండగా ఆరుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారు. 2. కర్నూలు నగరం వడ్డేపేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులకు గాను ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ముగ్గురు ఉపాధ్యాయలు అదనంగా ఉన్నారు. 3. కర్నూలు నగరం ఎర్రబురుజులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులుండగా ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 4. కర్నూలు నగరం పెద్దమార్కెట్ వద్దనున్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులకు గాను నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 5. కర్నూలు నగరం బండిమెట్ట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 107 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నలుగురు ఉపాధ్యాయలు అదనంగా ఉన్నారు. 6. కర్నూలు నగరం గడ్డవీధిలో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 44 మంది విద్యార్థులకు గాను నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక్క టీచరే చాలని అధికారులు భావిస్తున్నారు. 7. కర్నూలు నగరం కుమ్మరి వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 43 మంది విద్యార్థులకు గాను 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ అదనంగా ఏడుగురు ఉపాధ్యాయులున్నట్లు తేల్చారు. 8. కర్నూలు నగరం బుధవారపేటలోని 17వ వార్డు మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులకు గాను 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఐదుగురు అదనంగా ఉన్నారు. ఉపాధ్యాయులు తక్కువున్న పాఠశాలలు 1. కౌతాళం మండలం గోతులదొడ్డి ఎంపీపీ స్కూల్లో 285 విద్యార్థులుండగా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. మరో 8 మంది టీచర్లు అవసరం. 2. కౌతాళం మండలం కామవరం ఎంపీపీ స్కూల్లో 354 మంది విద్యార్థులుండగా ఐదుగురు టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. మరో ఏడుగురు అవసరం. 3. కౌతాళం మండలం చిత్రపల్లి ఎంపీపీ స్కూల్లో 212 మంది విద్యార్థులుండగా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు కావాల్సి ఉంది. 4. కౌతాళం ఎంపీపీ స్కూల్(ఎస్‌డబ్ల్యు)లో 354 మంది విద్యార్థులుండగా ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. మరో ఏడుగురు అవసరం. 5. కోసిగి మండలం అగసనూరులోని ఎంపీపీ స్కూల్లో 214 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఐదుగురిని నియమించాల్సి ఉంది. 6. కోసిగి మండలం కామనదొడ్డి ఎంపీపీ స్కూల్లో 227 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లే ఉన్నారు. మరో ఆరుగురు అవసరం. 7. కోసిగి మండలం జంపాపురం ఎంపీపీ స్కూల్లో 283 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఇంకా ఏడుగురు ఉపాధ్యాయులు కావాలి. 8. కర్నూలు కలెక్టరేట్ వెనుకనున్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 503 విద్యార్థులుగా 12 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరో ఐదుగురు ఉపాధ్యాయుల అవసరం ఉంది. -
గురువు బరువయ్యాడు!
సాక్షి, ముంబై: విద్యాహక్కు చట్టం ఇటు ఉపాధ్యాయులకు, అటు విద్యార్థులకు శాపంగా మారింది. ఈ చట్టంలో చేసిన కొన్ని సవరణల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 45 వేలమంది ఉపాధ్యాయులు రోడ్డునపడే ప్రమాదం ఏర్పడింది. విద్యాహక్కు చట్టంలో ఇటీవల చేసిన సవరణల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి. అలా చూస్తే ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో నిబంధనల ప్రకారంగా చూస్తే ఉపాధ్యాయులు మిగిలిపోతున్నారు. అలా మిగిలిపోతున్న ఉపాధ్యాయుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక్కో తరగతి గదిలో లోయర్ ప్రైమరీ తరగతిలో 30 మంది, అప్పర్ ప్రైమరీ తరగతిలో 35 మంది చొప్పున విద్యార్థులుండాలి. అదే విధంగా సెకండరీ స్థాయిలో ఒక్కో తరగతి గదిలో 79 మంది విద్యార్థులు ఉండాలి. విద్యార్థుల సంఖ్య తగ్గితే సదరు తరగతులను మూసివేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇలా మూసివేయడంవల్ల అప్పటిదాకా ఆ తరగతులకు బోధించిన ఉపాధ్యాయులు ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది. ఇదిలావుండగా కొత్త చట్టం ప్రకారం విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలలను మూసి వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 12 వేల పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే 19 వేల మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారు. ఒకవేళ 12 వేల పాఠశాలలను మూసివేస్తే ఇందులో బోధిస్తున్న ఉపాధ్యాయులు కూడా రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు మూతపడితే ఇక నుంచి విద్యార్థులు ఏడెనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే సుదూర పాఠశాలలకు వెళ్లలేక మరింతమంది బడి మానేయాల్సిన పరిస్థితి తలెత్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టంలోని నిబంధనలు అమలు చేస్తే ఈ కొండప్రాంతాల్లో కనీసం పాఠశాల కూడా కనిపించదని శిక్షక్ భారతికి చెందిన రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి సంజయ్ వేతుర్కర్ చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు నియమాలు అమలు చేస్తోందని శిక్షక్ భారతి అధ్యక్షుడు, ఎమ్మెల్యే కపిల్ పాటిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త నియమాలు అమలుచేసి ఉపాధ్యాయుల కడుపు కొడుతోందని ఆయన ఆరోపించారు.