325 స్కూళ్లకు తాళాలు ?
- విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడమే కారణం
- అలా చేస్తే1800 మంది టీచర్లు అదనమని గుర్తింపు
- పాఠశాలల విలీనం, హేతుబద్ధీకరణతో సర్దుబాటు
- మరింత జాప్యం కానున్న డీఎస్సీ 2014 నియామకాలు
గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 325 ప్రాథమిక పాఠశాలలను మూసి వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 30 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసి వేసి అక్కడి విద్యార్థులను సమీప పాఠశాలలకు తరలించేందుకు కసరత్తు చేస్తోంది. 30 మంది కంటే తక్కువ ఉన్న విద్యార్థులను కిలోమీటరు పరిధిలోని మరో పాఠశాలకు పంపే విధంగా విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖాధికారులు ప్రతిపాదనలు పంపారు.
ఈ విధంగా జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్, మున్సిపల్ ప్రాథమిక పాఠశాలల పరిధిలో 325 పాఠశాలలు మూసి వేయాలని నిర్ణయించారు. ఈ స్థాయిలో పాఠశాలలను మూసి వేస్తే ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న 1800 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉంటారని అధికారులు గుర్తించారు. వీరిని పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. విద్యాహక్కుచట్టం మేరకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులను తప్పనిసరిగా నియమించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను గమనిస్తే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ఐదు తరగతులకు ఇద్దరు లేక ముగ్గురు ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేశారు.
తాజాగా చేపట్టిన విలీన ప్రక్రియతో ప్రతి పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులను విధిగా నియమించాల్సి ఉంది. ముందుగా పాఠశాలలను విలీనం చేసిన తరువాత ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా పల్నాడు ప్రాంతంలోని మారుమూల మండలాలు, తండాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేక విద్యాబోధనకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది గుంటూరు, తెనాలి, బాపట్ల డివిజన్‌లలోనే పని చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో సత్తెనపల్లి, నరసరావుపేట డివిజన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
మరింత జాప్యం కానున్న డీఎస్సీ-2014 నియామకాలు
పాఠశాలల విలీనం ద్వారా జిల్లాలో 1800 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్లు గుర్తించడంతో హేతుబద్ధీకరణ, బదిలీల ద్వారా వారిని అవసరమైన పాఠశాలల్లో సర్ధుబాటు చేయాల్సి ఉంది. అదే విధంగా ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలను సైతం నెల రోజుల్లో జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవన్నీ జరిగిన తరువాతనే డీఎస్సీ-2014 నియామకాలు చేపట్టే అవకాశం లేదు. డీఎస్సీ ద్వారా వెయ్యి మంది టీచర్లను భర్తీ చేయాల్సి ఉంది.