ఇలాగైతే పాఠాలెలా..
ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ఎప్పుడు చిన్నచూపు చూస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ విద్యాప్రమాణాలను దిగజారుస్తోంది. ఏటా పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రకియ మొదలుకొని, ఉపాధ్యాయుల బదిలీలతో సహా అలసత్వం చూపిస్తోంది. విద్యాశాఖపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పాఠశాలల పరిస్థితి చూస్తే ప్రభుత్వ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
- ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి కాని రేషనలైజేషన్
- ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి ఏంటి?
- విద్యాహక్కు చట్టానికి తూట్లు
- విద్యార్థుల చదువులకు ఇబ్బందులు
విశాఖ ఎడ్యుకేషన్ : ఏటా బడుల్లో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా జరుగుతుంది. ప్రభుత్వ ఆలసత్వం వల్ల ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. దాంతోపాటు బదిలీ ప్రక్రియను కూడా పూర్తి చేయలేదు. బదిలీలు రేషనలైజేషన్‌తో ముడిపడి ఉండటంతో ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి వస్తున్నా ఈ బదిలీ ప్రక్రియని పూర్తి చేయడంలో కాలయాపన చేస్తుంది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వేసవి సెలవులు ముగిసేనాటికి ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి సక్రమంగా పాఠశాలలు జరిగేలా చూస్తామన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినప్పటికీ ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ, రేషనలైజేషన్‌లో జాప్యం చేస్తునే ఉంది. దీనివలన హేతుబద్ధీకరణ కోసం ఉపాధ్యాయులు వేచి చూడాల్సి వస్తుంది.
బదిలీ అయినా పాత స్థానాల్లోనే: జిల్లాలో 1385 ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రాథమికోన్నత పాఠశాలలు ఏకోపాధ్యాయునితో నడుస్తున్నాయి. వీటిలో కొన్ని చోట్ల విద్యార్ధులు నిష్పత్తి కంటే ఎక్కువగా ఉండగా, మరికొన్ని చోట్ల తక్కువగా విద్యార్ధులు ఉన్నారు. ప్రభుత్వం నిష్పత్తి తక్కువగా ఉన్న పాఠశాలలను రేషనలైజేషన్‌లో భాగంగా సమీప పాఠశాలలో విలీనం చేసి ఆదర్శపాఠశాలల సంఖ్యను పెంచాలని ఆలోచిస్తుంది. ఈ ప్రక్రియ కూడా పూర్తి కాకపోవడంతో ఏ పాఠశాలలు పోతాయో, ఏవి ఉంటాయో తెలియని పరిస్థితి విద్యార్ధులది. అదే పరిస్థితి ఉపాధ్యాయుల్లో కూడా కనిపిస్తుంది. హేతుబద్ధీకరణ పేరుతో ఎక్కడికి పంపిస్తారో తెలియని పరిస్థితి. దీనివలన వారు కూడా బోధనపై దృష్టిపెట్టలేకపోతున్నారు. విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం వలన చదువుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒకే టీచర్ అన్ని తరగతులకు బోధించాలంటే తలకు మించిన భారం. వీలైనంత వేగంగా రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సిలబస్ పరంగా నష్టపోయేది విద్యార్ధులే. 2013లో బదిలీ అయిన వారు చాలా మంది పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. వీరు పనిచేస్తున్న పాఠశాలలన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలే. ఆ పాఠశాలలకు ఎవరూ రాకపోవడంతో ఉపాధ్యాయులందరూ పాత స్థానాల్లోనే కొనసాగాల్సి వస్తుంది. బదిలీ ప్రక్రియ పూర్తి చేసిన కూడా పాత స్థానాల్లో కొనసాగుతున్న వీరు కూడా తమ బదిలీ స్థానాలకు వెళ్లడానికి ఎదురు చేస్తున్నారు. హేతుబద్ధీకరణ పూర్తయితే కాని తమ స్థానాలకు వెళ్లలేని పరిస్థితి.
విద్యాహక్కు చట్టమేమంటోంది
- విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి హేతుబద్దీకరణ ప్రక్రియ విద్యాశాఖ పూర్తి చేసి అన్ని పాఠశాలల్లో విద్యార్ధుల నిష్పత్తి అనుసరించి ఉపాధ్యాయులను నియామకం చేయాలి.
- ఎక్కువ మంది విద్యార్ధులు ఉన్న పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయ నియామకాలు చేసి ఖాళీ పోస్టులను గుర్తించి డీఎస్సీ అభ్యర్ధులను పూర్తి నింపడం కాని లేదా.
- ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి బదిలీ ప్రక్రియలో నియామకం చేయాలి.
తక్షణం బదీలీ ప్రక్రియ పూర్తి చేయాలి.
ప్రభుత్వ నిర్లక్ష్యం వలన హేతుబద్ధీకరణతోపాటు, బదిలీ ప్రక్రియ కూడా పూర్తిగా ఆగిపోయింది. రకరకాల కారణాలతో బదిలీలు కోరుకుంటున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం జీఓ కోసం ఎదురుచూస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలంటే బదిలీ ప్రక్రియతో పాటు రేషనలైజేషన్ పూర్తి చేయాలి.
-మధు, పీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి.