ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నెలకు కోటి రూపాయలకుపైగా సంపాదిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఇటీవల యూపీ ప్రభుత్వం టీచర్ల డేటా మొత్తం డిజిటల్ బేస్ తయారు చేస్తున్నారు. డిజిటల్ డేటా రూపొందించే క్రమంలో ఈ ఉదంతం బయటపడింది. ఆ ఉపాధ్యాయురాలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 25 చోట్ల ఒకే సమయంలో పని చేస్తుండటంపై రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ అధికారులు అవాక్కయ్యారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మెయిన్‌పురి జిల్లాకు చెందిన అనామిక శుక్లాగా గుర్తించిన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
అనామిక శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో పూర్తి కాలం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రాథమిక విద్యా విభాగం టీచర్ల డిజిటల్ డేటాబేస్ రూపొందిస్తున్న క్రమంలో జిల్లాలలో వేర్వేరు పాఠశాలల్లో ఒకే టీచర్ పని చేస్తున్నట్లు గమనించారు. దీనిపై ఆరాతీయగా కేజీబీవీలో పనిచేస్తున్న అనామికనే అమేథి, అంబేద్కర్ నగర్, రాయబరేలి, అలీగఢ్ సహా ఇతర 25 పాఠశాలల్లో ఒకేసారి ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ వివిధ పాఠశాలల నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13 నెలలపాటు కోటి రూపాయలకు పైగా వేతనాన్ని ఆమె అందుకున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ఇందుకు ఏ బ్యాంకు ఖాతాను వాడారో తెలుసుకునేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. తక్షణమే ఆమె వేతనాన్ని నిలిపి వేసిన విద్యాశాఖ అధికారులు నోటీసులు పంపించారు. (షాకింగ్: ఏసీ పైపులో 40 పాము పిల్లలు )
ఈ వ్యవహారంపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ఆనంద్ మాట్లాడుతూ విచారణకు ఆదేశించామని చెప్పారు. వాస్తవాలేంటో ఇంకా ఒక నిర్ధారణకు రాలేదని అన్నారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారని చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అటు ప్రభుత్వ విద్యాశాఖ వైఖరిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సతీష్ ద్వివేది మాట్లాడుతూ, దర్యాప్తునకు ఆదేశించామనీ, ఈ వాదనలు నిజమైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారుల ప్రమేయం ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే కేజీబీవీలో కాంట్రాక్టు పద్ధతిలో కూడా నియామకాలుంటాయనీ, ఈ నేపథ్యంలో వాస్తవాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. (నోకియా మరో అద్భుతమైన స్మార్ట్‌టీవీ : ధర ఎంత? )
Comments
Please login to add a commentAdd a comment