టీచర్ల సంఖ్యకు మించి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. టీచర్ల సంఖ్యకు మించి దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లలో 1.28 లక్షల మంది వరకు టీచర్లు ఉండగా బదిలీల కోసం 1,41,909 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొదటిసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించడం వల్ల చాలామంది టీచర్లు ఒకటికి రెండు, మూడు దర ఖాస్తులను సబ్మిట్ చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో డూప్లికేట్ అయిన దరఖాస్తుల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు.
మరోవైపు ఈసారి 0-19 మంది పిల్లలు ఉన్న స్కూళ్లకు ఒక్కో టీచర్‌ను ఇవ్వాలని అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం విద్యార్థుల్లేని స్కూళ్లకు కూడా టీచర్లను కేటాయించనున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 31 నాటికి 456 ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు లేరని విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే ఈసారి ప్రవేశాల సందర్భంగా విద్యార్థులు ఎవరైనా ఆయా స్కూళ్లలో చేరారా? లేదా? అన్న విషయం తెలియదు. దీంతో ఆ 456 స్కూళ్లకు కూడా ప్రస్తుతం టీచర్లను కేటాయిస్తారు. గ్రామాల్లో తల్లిదండ్రులతో సమావేశమై విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవిధంగా చర్యలు చేపట్టినా వారిని కొనసాగిస్తారు. లేదంటే ఆ టీచర్లను సమీపంలోని స్కూళ్లకు డెప్యుటేషన్‌పై పంపించే అవకాశం ఉంది.
మరోవైపు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ లెక్కలను తేల్చే పనిలో విద్యాశాఖ పడింది. ప్రస్తుతం పాఠశాలల్లో అవసరానికి మించి (సర్‌ప్లస్) దాదాపు ఐదారు వేల మంది వరకు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు వారిని ఈ బదిలీల్లో అవసరం ఉన్న స్కూళ్లకు పంపించనున్నారు. శుక్రవారం ప్రాథమిక సీనియారిటీ జాబితాలను ప్రకటించారు. శని, ఆదివారాల్లో సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం వంటి చర్యలు చేపట్టనున్నారు.
6వ తేదీన తుది సీనియారిటీ జాబితాలను ప్రకటించి 7వ తేదీ నుంచి బదిలీల కౌన్సెలింగ్‌ను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. 7వ తేదీన ప్రధానోపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 8వ తేదీన స్కూల్ అసిస్టెంట్లకు, హెడ్‌మాస్టర్లకు పదోన్నతులు కల్పిస్తారు. 9 నుంచి 11వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు చేపడతారు. 12న ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు కల్పిస్తారు. 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఎస్‌జీటీల బదిలీలు చేపడతారు.
ఇవీ జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు
ఆదిలాబాద్ 11,489
హైదరాబాద్ 3,662
కరీంనగర్ 16,898
ఖమ్మం 13,314
మహబూబ్‌నగర్ 19,739
మెదక్ 14,999
నల్లగొండ 17,562
నిజామాబాద్ 13,601
రంగారెడ్డి 13,204
వరంగల్ 17,441