గురువు బరువయ్యాడు!
సాక్షి, ముంబై: విద్యాహక్కు చట్టం ఇటు ఉపాధ్యాయులకు, అటు విద్యార్థులకు శాపంగా మారింది. ఈ చట్టంలో చేసిన కొన్ని సవరణల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 45 వేలమంది ఉపాధ్యాయులు రోడ్డునపడే ప్రమాదం ఏర్పడింది. విద్యాహక్కు చట్టంలో ఇటీవల చేసిన సవరణల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి. అలా చూస్తే ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో నిబంధనల ప్రకారంగా చూస్తే ఉపాధ్యాయులు మిగిలిపోతున్నారు.
అలా మిగిలిపోతున్న ఉపాధ్యాయుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక్కో తరగతి గదిలో లోయర్ ప్రైమరీ తరగతిలో 30 మంది, అప్పర్ ప్రైమరీ తరగతిలో 35 మంది చొప్పున విద్యార్థులుండాలి. అదే విధంగా సెకండరీ స్థాయిలో ఒక్కో తరగతి గదిలో 79 మంది విద్యార్థులు ఉండాలి. విద్యార్థుల సంఖ్య తగ్గితే సదరు తరగతులను మూసివేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇలా మూసివేయడంవల్ల అప్పటిదాకా ఆ తరగతులకు బోధించిన ఉపాధ్యాయులు ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది.
ఇదిలావుండగా కొత్త చట్టం ప్రకారం విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలలను మూసి వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 12 వేల పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే 19 వేల మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారు. ఒకవేళ 12 వేల పాఠశాలలను మూసివేస్తే ఇందులో బోధిస్తున్న ఉపాధ్యాయులు కూడా రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు మూతపడితే ఇక నుంచి విద్యార్థులు ఏడెనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే సుదూర పాఠశాలలకు వెళ్లలేక మరింతమంది బడి మానేయాల్సిన పరిస్థితి తలెత్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టంలోని నిబంధనలు అమలు చేస్తే ఈ కొండప్రాంతాల్లో కనీసం పాఠశాల కూడా కనిపించదని శిక్షక్ భారతికి చెందిన రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి సంజయ్ వేతుర్కర్ చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు నియమాలు అమలు చేస్తోందని శిక్షక్ భారతి అధ్యక్షుడు, ఎమ్మెల్యే కపిల్ పాటిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త నియమాలు అమలుచేసి ఉపాధ్యాయుల కడుపు కొడుతోందని ఆయన ఆరోపించారు.