67 స్కూళ్లు మూత! | 67 schools closed | Sakshi
Sakshi News home page

67 స్కూళ్లు మూత!

Published Tue, Jun 2 2015 1:41 AM | Last Updated on Sat, Sep 15 2018 7:22 PM

67 schools closed

కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులపై నమ్మకం సన్నగిల్లడంతో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తీసుకుంటున్న చర్యలు ఫలితమివ్వక పోవడంతో ప్రభుత్వం ఏకంగా పాఠశాలలను మూసి వేయడానికి సిద్ధమైంది. సర్వశిక్ష అభియాన్ తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 19 ప్రాథమిక పాఠశాలల్లో అసలు పిల్లలే లేరు. తొమ్మిది పాఠశాలల్లో 10 మంది, మరో 39 పాఠశాలల్లో పది మందిలోపే విద్యార్థులు ఉన్నారు.

పది మంది లోపు పిల్లలున్న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో  67 పాఠశాలలు మూతపడటం ఖాయం అని తెలుస్తోంది. ఇంగ్లిష్ మీడియంపై ఉన్న మక్కువతో చాలా మంది తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు మిగిలిపోనున్నారు. ఇలా మిగిలిపోయిన వారిని రేషనలైజేషన్‌లో అవసరం ఉన్న చోటుకు సర్థబాటు చేయనున్నారు. ఉపాధ్యాయులను ఇలా సర్దుబాటు చే స్తూ పోతే భవిషత్తులో టీచర్ పోస్టుల నియామకాలుండవని నిరుద్యోగులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

   ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులున్నప్పటికీ ఎందుకు పిల్లలు రావటంలేదో విద్యా శాఖాధికారులకు అర్థం కావడం లేదు. ప్రవేటు పాఠశాలల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు లేకపోయినప్పటికి చాలా మంది అక్కడికే విద్యార్థులను పంపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పాజిటివ్ అంశాలను త ల్లిదండ్రులకు విడమరచి చెప్పడంలో సదరు శాఖ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనేది కాదనలేని సత్యం. వేసవి సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఇల్లిల్లూ తిరిగి (క్యాంపైన్) ప్రమోషన్ వర్క్ నిర్వహిస్తుంటే ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది.

 అందోళనలో గ్రామీణ ప్రజలు  
 జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న విద్యార్థులు తల్లితండ్రులు పాఠశాలలు మూతపడతాయనే విషయంలో అందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలలను మూసివేస్తే తమ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు పంపడానికి ఆర్థిక స్థోమత లేని వారు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఇలాంటి వారి పిల్లలు ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయే ప్రమాదం ఉంది. లక్షలాది రుపాయలు వెచ్చించి నిర్మించిన పాఠశాలలు నిరుపయోగంగా మారే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement